let us know

తెలుసుకుందాం

విషయ సూచిక


       తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?


root of hair
తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం కింద ఉన్న అంతశ్చర్మం లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న అవకాశం తక్కువ.


       అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?


head
చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు ఉంటాయి. వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు


       పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు ఎందుకని?


అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు, వంశపారంపర్యత కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు


        డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ అందరిలో ఒకే విధంగా ఉన్నా మనుషుల రూపు రేఖల్లో ఎందుకు తేడాలుంటున్నాయి?


rna dna
మానవుడిలో 23 జతల క్రోమోజోములున్నాయి. ప్రతి క్రోమోజోములో డీఎన్‌ఏ పేలికలుంటాయి. ప్రతి డీఎన్‌ఏ పేలికలో న్యూక్లియోటైడులనే విడివిడి రసాయనిక భాగాలు దండలో పూసల్లా ఉంటాయి. ప్రతి న్యూక్లియోటైడు పూసలో ఓ నత్రజని క్షారం, ఓ చక్కెర ధాతువు, ఓ ఫాస్ఫేటు సంధానం ఉంటాయి. చక్కెర ధాతువు, ఫాస్ఫేటు భాగం ప్రతి న్యూక్లియోటైడులో ఒకే విధంగా ఉన్నా నత్రజని క్షారాల వరస క్రమం ఒకే విధంగా ఉండదు. చాలామటుకు సామ్యంగానే ఉన్నా అక్కడక్కడా తేడాలుంటాయి. ఈ తేడాలున్న భాగాలే మనుషుల్లో వ్యత్యాసాలకు ప్రధాన కారణమవుతాయి. సాధారణ వరుస క్రమం మనిషిలో సాధారణ విషయాల్ని (తల, ఆకలి, హార్మోన్లు, అవయవాలు మొదలయిన స్థూల రూపాల్ని) నిర్దేశించగా విశిష్టతను ఈ తేడా భాగాలే నిర్దేశిస్తాయి. ఇలా విడివిడి జీవుల్లో విడివిడి వరుస క్రమాలు, డీఎన్‌ఏ పేలికల సంఖ్యలుంటాయి. వీటినే జన్యువులు అంటారు. మనుషుల్లో అక్కడక్కడ జన్యువుల్లో తేడాలుండడం వల్లే రూపురేఖల్లో తేడా!


       పొటాషియం సైనైడు తో ఎందుకు చనిపోతారు?


KCN pills image
పొటాషియం సైనైడు నీటిలోను, రక్తంలోను బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హీమోగ్లోబిన్‌లో ఉండే ఇనుము కేంద్రానికి అనుసంధానించుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్‌ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడుకు, హీమోగ్లోబిన్‌కు మధ్య రసాయనిక ప్రక్రియ ఏమీ లేదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం, సైనైడు అయాన్లుగా విడివడుతుంది. ఇది కణాల్లో ఉండే 'సైటోక్రోమ్‌-సి-ఆక్సిడేజ్‌' అనే ఎంజైముతో బంధించుకుంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్‌ నుంచి ఎలక్ట్రాన్లను గైకొని, వాటిని శ్వాసద్వారా వచ్చే ఆక్సిజన్‌కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధాన కర్త. అయితే సైనైడు అయానులో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాల్లోని ఆక్సిజన్‌, గ్లూకోజ్‌ పరస్పరం వృథా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తిలేని కణాలు చేష్టలుడిగిపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది.


       దంతాలు ఎందుకు పుచ్చిపోతాయి?


teeth decay
సాధారణంగా చాలా మందికి దంతాలు పుచ్చిపోతుంటాయి. పళ్లు అలా పుచ్చిపోవడం వల్ల కలిగే పంటి నొప్పి వర్ణనాతీతం. చాలా మంది ఈ పంటి నొప్పిని భరించలేరు. ఈ మాట చెప్పేవాళ్ళ కంటే.. పంటి నొప్పిని భరించే వాళ్లకే ఎక్కువ తెలుసు. ప్రతిరోజు సరిగా దంతాలను శుభ్రం చేయకపోవడం వల్లే పళ్లు పుచ్చపోతాయని భావిస్తారు. ఇదొక కారణం కావొచ్చు. కానీ, దంతాలు పుచ్చిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. అవేంటో తెలుసుకొని ముందుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఈ బాధ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అసలు దంతాలు పుచ్చిపోవడానికి కారణాలను పరిశీలిస్తే, ఇష్టానుసారంగా చాక్లెట్లు ఆరగించేవాళ్ళలో కూడా దంతాలు సులభంగా పుచ్చుపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా, విటమిన్ డి తక్కువవారిలో కీళ్ళ నొప్పులతో పాటు పళ్లు పుచ్చిపోతాయి. శీతలపానీయాలు అధికంగా తాగడం. చ‌క్కెర శాతం ఎక్కువ‌గా ఉండే ఐస్‌క్రీంలు తినడం వల్ల దంతాలు సులభంగా పుచ్చిపోతాయి. డీ హైడ్రేష‌న్ వ‌ల్ల శ‌రీరం ఎండిపోవ‌డ‌మేకాకుండా నోరు కూడా ఎండిపోతుంది. ఇలానే ఎక్కుసేపు ఉండ‌డం వ‌ల్ల కూడా దంతాలు పుచ్చిపోతాయి. దంతాలు పుచ్చిపోవడానికి జీర్ణ సమస్యలు కూడా ఓ కారణం చెబుతున్నారు. సాధారణంగా జీర్ణ సమస్యలు ఉంటే.. గుండెల్లో మంట ఏర్పడుతుంది. దీనికి దంతాలు పుచ్చిపోవడం అదనం.


       సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?


sun rays downloaded from unplash
సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రపు వేళల్లో మన దేహానికి 'డి' విటమిన్‌ అందించినా, ఆహ్లాదం కలిగించినా, సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే, కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మచ్చలుగా ఏర్పడుతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య ఓజోన్‌ పొర పరచుకొని ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ ఓజోన్‌ పొర గాఢత చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు. వాహనాలను నడపడానికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాల కాలుష్యాలు. అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీఎస్‌). వీటి ప్రభా వాన్ని అరికట్టినా, ఆకాశంలోని ఓజోన్‌ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్‌ పొర మరీ బలహీన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.


       సూర్యరశ్మి నుంచి పొందే D విటమిన్‌కు, ఆహారం ద్వారా లభ్యమయ్యే డి విటమిన్‌కు తేడా ఉందా?


స్వచ్ఛమైన పదార్థం ఏ పద్ధతిలో తయారయినా గానీ గుణగణాలు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి D విటమిన్‌ను సూర్యరశ్మి ద్వారా పొందినా, ఆహారం ద్వారా పొందినా వాటిలో తేడా ఉండదు. ఆహారం ద్వారా లభించే D విటమిన్‌ ఒకే దఫాలో సరిపడినంత తీసుకోగలం. సాధారణ మనిషికి రోజుకు 15 నుంచి 20 మైక్రో గ్రాముల (మిల్లిగ్రాములో వెయ్యో వంతును మైక్రోగ్రాము అంటారు) 'డి' విటమిన్‌ అవసరం. అయితే ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే చర్మంలో 'డి' విటమిన్‌తోపాటు క్యాన్సరు కారక ఉత్పన్నాలు కూడా వచ్చి చేరతాయి. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. సాధారణంగా ఉదయం కాసేపు ఎండలో నడిచినా లేదా సాయంత్రం ఎండ ఉన్నప్పుడు కొన్ని నిముషాలు ఉన్నా మనకు అవసరమైనంత 'డి' విటమిన్‌ లభిస్తుంది. 'డి' విటమిన్‌ లోపిస్తే ఎముకలకు సంబంధించిన లోపాలు వస్తాయి. ఇందులో ప్రధానమైంది 'రికెట్స్‌' chole calciferol అనే పేరుతో D3 విటమిన్‌ సూర్యరశ్మి సమక్షంలో చర్మంలో కొలెస్టరాల్‌ నుంచి తయారవుతుంది. ఇది ఆహారం ద్వారా కూడా దొరుకుతుంది. ergo calciferol కూడా దొరుకుతుంది. D2 విటమిన్‌ మాత్రం సూర్యరశ్మి సమక్షంలో సాధారణంగా లభ్యం కాదు. దీన్ని ఆహారం ద్వారా పొందాల్సిందే. ఈ రెండింటిని కలగలిపి D విటమిన్‌ అంటాము. ఈ విటమిన్లు ఎముకలు సమగ్రంగా, సక్రమంగా పెరిగేలా దోహదపడతాయి.


       ఉల్లిపాయలు కోస్తే కళ్ళు మండుతాయి ఎందుకు?


onion image  by Promodhya Abeysekara on unsplash
శాస్త్రీయంగా ఉల్లిపాయ పేరు ఎలియం సిపా. మామూలు కంటితో కూడా చూడ్డానికి వీలైన పెద్ద జీవకణాలు ఉల్లిపాయ పొరల్లో ఉంటాయి. కోసినప్పుడు కన్నీళ్లు తెప్పించే పదార్థాలను, కంటిలోకి వాయురూపంలో చేరితే కన్నీళ్లు కలిగించే రసాయనాలనీ 'నేత్ర బాష్పద రకాలు' అంటారు. ఉల్లిపాయ కణాల్లో గంధక పరమాణువులుండే అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. అందులో అల్లీన్‌ ఒకటి. అలాగే అల్లినేస్‌ అనే ఎంజైమ్‌ కూడా ఉంటుంది. ఉల్లిపాయను కోసేటప్పుడు అందులోని కణాలు తెగిపోవడం వల్ల ఇవి బయటపడి గాలిలోని ఆక్సిజన్‌ సమక్షంలో చర్య జరిగి సల్ఫీనిక్‌ ఆమ్లాలు ఏర్పడుతాయి. వెంటనే ఇవి ఉల్లిలోని మరో ఎంజైమ్‌ వల్ల 'సల్ఫర్ఆక్సైడ్‌' అనే వాయురూప పదార్థంగా మారుతుంది. ఇది గాలిలో వ్యాపించి కంటిని చేరితే, కంటిలో ఉన్న నాడీ తంత్రులు స్పందించి 'మంట' పుట్టిన భావన కలుగుతుంది. వెంటనే ఆ మంటను నివృత్తి చేయడానికి మెదడు కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీరు కలిగిస్తుంది.


        సూక్ష్మజీవులు అన్ని ఒకరినుంచి ఒకరికి సంక్రమిస్తాయా?


సూక్ష్మజీవి కంటితో నేరుగా చూడలేని జీవి. ఇవి ఏక కణ జీవులు లేదా బహుకణ జీవులు కావచ్చు. పురాతన కాలం నుంచి కంటికి కనబడని సూక్ష్మ క్రిములు ఉండవచ్చునని ఊహించారు.ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం అనేది వాటి జీవన విధానంలో ఒక భాగమే.హాని కలిగిస్తున్నామా, మేలు చేస్తున్నామా అనే విషయం ఆయా సూక్ష్మజీవులకు తెలీదు. వాటి మానాన అవి జీవిస్తుంటాయి. సాధారణంగా మనం ప్రమాదాన్నే గుర్తిస్తాము కానీ మేలును కాదు. పెరుగు తింటున్నప్పుడల్లా మనం ఈస్ట్‌ బ్యాక్టీరియాను తలుచుకోము. ఏ దగ్గో, జ్వరమో వస్తే అందుకు కారకమైన సూక్ష్మజీవుల గురించి ఆరా తీస్తాము. మొత్తానికి హానిచేసేవైనా, మేలు చేసేవైనా అవి ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి.


       రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?


రక్త నాళాలు
శరీరములో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి ఆక్సిజన్‌ తక్కువైన (చెడు ) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్‌ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్‌ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెనుకకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉంటుంది.


❮ Previous