సాలిడ్ బ్యాటరీలొస్తున్నాయ్
విద్యుత్ వాహనాల వ్యయాలను తగ్గిస్తాయ్
విద్యుత్ వాహనాల ధర ఎక్కువగా ఉండడానికి బ్యాటరీ కూడా కారణం. అయితే కంపెనీలు బ్యాటరీ వ్యయాలు తగ్గించుకోవడం ద్వారా ధరలను కిందకు తీసుకురావాలని సూచిస్తున్నాయి. అందులో ఒకటి సాలిడ్ స్టేట్ బ్యాటరీలను వినియోగించడం. అయితే వాటి నుంచి విద్యుత్‌ను రాబట్టుకునే క్లిష్ట ప్రక్రియకు సాంకేతికత ఎంత వరకు సహాయం చేస్తుంది; అవి ఎపుడు అందుబాటులోకి వస్తాయన్నది అసలు ప్రశ్న.సాలిడ్ స్టేట్ బ్యాటరీలంటే..
ఇప్పటిదాకా వినియోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల్లో ద్రవరూప ఎలక్ట్రోలైట్‌ను వినియోగిస్తున్నాయి. వాటి స్థానంలో ఘనరూపంలో అయాన్-కండక్టింగ్ మెటీరియల్‌ను వాడి తయారుచేసేవా సాలిడ్ స్టేట్ బ్యాటరీలు.
ఏమిటి ఉపయోగం..: ద్రవరూప బ్యాటరీలతో పోలిస్తే వీటిలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ ఉంచవచ్చు. అపుడు బ్యాటరీ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో కారు బరువు తగ్గి మైలేజీ ఎక్కువ ఇస్తుంది. కారులో స్థలం కూడా పెరుగుతుంది. లేదంటే అదే పరిమాణంతో ఎక్కువ దూరం వెళ్లే మోడళ్లను సిద్ధం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి కిలోవాట్ అవర్‌కు అయ్యే ఖర్చు తగ్గుతుంది. తాజాగా ఫోర్డ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు ‘సాలిడ్ పవర్’ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఈ బ్యాటరీలను పొందడానికే.
మల్టీ లేయర్ సెల్ వరకు (20 యాంప్-అవర్) తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సాలిడ్ పవర్ సిద్ధంగా ఉంది. వాహనాల్లో వినియోగించడానికి ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఫోర్డ్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యూకు సైతం 100 యాంప్-అవర్ బ్యాటరీలను ఇవ్వడానికి యత్నాలు చేస్తోంది. అదీకాక సరికొత్త సాంకేతికతపై కొత్తగా పెట్టుబడులు పెట్టనవసరం లేకుండా సాలిడ్ పవర్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ దశాబ్దం చివరకు సాలిడ్ స్టేట్ బ్యాటరీలతో ఈవీలు సిద్ధం కావొచ్చని ఫోర్డ్ అంటోంది. ప్రస్తుత ఈవీలతో పోలిస్తే ఈ సాలిడ్ బ్యాటరీల్లో 25-30 శాతం వరకు ఇంధన సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరింత దూరం వెళ్లడానికి వినియోగపడుతుంది. ఉదాహరణకు ఇపుడున్న ముస్తాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రస్తుత ప్యాకేజీతో 300 మైళ్లు ప్రయాణిస్తుందనుకుంటే.. సాలిడ్ స్టేట్ బ్యాటరీతో 400 మైళ్లు ప్రయాణించవచ్చు. లేదంటే బ్యాటరీల సంఖ్యను తగ్గించుకుని ధరను తగ్గించుకోవచ్చు.