do you know

మీకు తెలుసా

Content


       గబ్బిలాలు చీకట్లో చూడగలవా?


గబ్బిలాలు క్షీరదాలు.వీటి ముందు భాగాలు రెక్కలుగా రూపాంతరం చెంది ఎగరటానికి అనుకూలంగా మారాయి.పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి కూడా వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే చుట్టూ ఉన్న పరిసరాలను అంచనా వేయగలుగుతాయి.  ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు. అలాగని గబ్బిలాలు తమ కళ్ల ద్వారా చూడలేవని అనుకోకూడదు. వాటి కళ్లు వెలుగు, చీకటుల తేడాను గుర్తించగలవు. తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు. అంతే కాకుండా గబ్బిలాలు తాము అంతకు ముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు. 

Bat image
  గబ్బిలాలు నోటితో అతిధ్వనులను చేస్తాయి. మనకి వినబడని ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని వెనుదిరుగుతాయి. అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి. ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగెలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం. రాత్రిపూట సంచరించే నిశాచర(చీకటిలో సంచరించే)  జంతువులైన ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల కోవలోకే గబ్బిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి. 

వీటి గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు
  • గబ్బిలాల లో దాదాపు 1000 రకాలు ఉన్నాయి.
  • గబ్బిలాలు దాదాపు 30 ఏళ్లు జీవిస్తాయి. గంటకు 60 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి.
  • గబ్బిలాలు పూర్తి చీకట్లో కూడా ఆహారం చూడగలవు. ఎక్కువ శబ్దం చేసి సెకనుకు10-20 బీబ్స్ చేసి రీ సౌండ్ సృష్టించి కీటకాలను ఆకర్షించి ఆహారాన్ని తింటాయి.
  • గబ్బిలాలు గంటకు 1200 దోమలను తినగలవు. ప్రతి రాత్రి తమ శరీర బరువును పెంచుకుని దోమలు, కీటకాలు వ్యాపించకుండా చేస్తాయి.
  • తల్లి గబ్బిలాలు తమ పిల్ల గబ్బిలాలను కొన్ని వేల, లక్షల గబ్బిలాల మధ్య ఉన్నా దాని వాసన, శబ్దం ద్వారా గుర్తిస్తాయి.
  • ఎక్కువ గబ్బిలాలు కీటకాల పై ఆధారపడి జీవిస్తే, కొన్ని పళ్ళు, చేపలు తింటే కొన్ని రక్తం కూడా తాగుతాయి.
  • మూడు రకాల పిశాచ గబ్బిలాలు కేవలం రక్తం మాత్రమే తాగి జీవిస్తాయి.
  • ఈ పిశాచ గబ్బిలాలు పదునైన వాడి దంతాలు కలిగి ఉండి, ఒక జంతువు చర్మాన్ని ఆ జంతువు గమనించే లోగానే చీల్చి రక్తం తాగుతాయి.
  • పిశాచ గబ్బిలాలు చేసే గాయాలు చాలా ప్రమాదకరమైనవి.
  • కొన్ని గబ్బిలాలు కొద్దీ గుంపు తో జీవించడానికి ఇష్ట పడితే, చాలా గబ్బిలాలు గుహలలో వేలాదిగా కలిసి జీవిస్తాయి.
  • దక్షిణ పసిఫిక్ లో ఉండే “ఫ్లయింగ్ ఫాక్స్” జాతి గబ్బిలాల రెక్క విచుకున్నప్పుడు దాదాపు ఆరు అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలో పెద్దది.
  • గబ్బిలాల లో చిన్న జాతి థాయిలాండ్ లో “బంబుల్ బీ” ఇది గోటి కంటే చిన్నగా, పైసా బరువు ఉంటుంది.
  • ఫ్లయింగ్ ఫాక్స్ లేదా పెరోతుస్ గబ్బిలాలు ప్రపంచంలో అతి పెద్దవి.


       గద్ద అంత దూరం ఎలా చూడగలదు?

ప్రాణులన్నింటిలోకి గద్దజాతి పక్షుల దృష్టి చాలా నిశితంగా, తీక్షణంగా ఉంటుంది. దీనికి కారణం అది విశాలమైన, పొడవైన కనుగుడ్లు కలిగి ఉండడమే. దాని కనుగుడ్డులో కంటి కటకానికి, రెటీనాకు విశాలమైన ప్రదేశం లభిస్తుంది. మానవులతో పోలిస్తే, పక్షుల రెటీనాలలోజ్ఞాన సంబంధిత జీవ కణాల సంఖ్య ఎక్కువవడమే కాకుండా అవి రెటీనాలో సమంగా వ్యాపించి ఉంటాయి. అందువల్ల గద్ద పైనుంచి ఎక్కువ భూవైశాల్యాన్ని కూడా చూడగలుగుతుంది. దాని కంటిలో ఏర్పడే ప్రతిబింబం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది.
Eagle image
మన కంటిలో కన్నా గద్ద కంటిలో ఈ కణాలు ప్రతి చదరపు మిల్లీమీటరుకు 8 రెట్లు అధికంగా ఉండడంతో అది దూరంగా ఉండే వస్తువుపై కూడా అతి త్వరగా దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది. కంటిలోని ద్రవాల కదలికల ద్వారా మనం సెకనుకు 25 ప్రతిబింబాలను చూడగలిగితే, గద్ద సెకనుకు 150 ప్రతిబింబాలను చూడగలుగుతుంది. అంతే కాకుండా మన కంటికి కనబడని అతినీల లోహిత కిరణాలను గద్ద చూడగలుతుంది. ఎలుకల లాంటి ప్రాణుల విసర్జకాలు వెలువరించే అతినీల లోహిత కిరణాలను ఆకాశం నుంచి కూడా చూడగలగడం వల్ల అది, వాటి ఉనికిని పసిగట్టి వేటాడగలుగుతుంది.


        పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో చోటికి ఎలా వలస పోతాయి?


ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు ఒకే ప్రదేశానికి వలస పోవడానికి ఎన్నో కారణాలు దోహదపడతాయి. భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణుల లాంటి భౌగోళిక పరిసరాలను అవి గుర్తు పెట్టుకోగలుగుతాయి. సముద్రాలను దాటి వలసపోయే ముందు పక్షులు సముద్ర తీరంలో ఒక నిర్ణీత ప్రాంతంలో గుమిగూడుతాయి. తర్వాత వాటి దృష్టి వ్యవస్థ ఆధారంగా సముద్రాలను దాటుతాయి. వాటి తలలో మాగ్నటైట్‌ అనే సూక్ష్మకణాలు అయస్కాంత సూచికలాగా పనిచేయడంతో ఆ ప్రభావం వల్ల భూ అయస్కాంత క్షేత్రాన్ని పసిగడుతూ, దానికి అనుగుణంగా దృష్టి వ్యవస్థను అనుసంధానించుకుని ముందుకు సాగుతాయి. ఆపై సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ పక్షులు తాము వలసపోయే ప్రాంతానికి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాయి.


        మిగతా జంతువులతో పోల్చితే కుక్కకు మాత్రమే విశ్వాసం అనే గుణం ఎలా వచ్చింది?


కుక్కలు, పిల్లులు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు మొదలైన క్షీరద జంతువులు మానవ సామాజిక జీవితంలో పెంపుడు జంతువులుగా ఉండనట్లయితే అవి లక్ష సంవత్సరాల క్రితమే అంతరించిపోయేవని జీవావరణ శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఎందుకంటే వాటికి క్రూరమృగాల నుంచి, విపరీతమైన ప్రకృతి భీభత్సాలనుంచి ఆత్మ రక్షణ చేసుకోగల సత్తాలేదు. అంతేకాదు, కోళ్లు, బాతులు కూడా మానవుడు లేకుంటే ఇంతకాలం పాటు ఉండేవి కావని తెలుస్తోంది.
ఇలా మానవుడితో ప్రత్యక్షంగా (పెంపుడు), పరోక్షంగా (వీధి) శునకాలు భాగమయ్యాయి. కుక్కకు సహజ సిద్ధంగా చాలా సునిశితమైన ఘ్రాణశక్తి ఉంది. మనిషికున్న ఘ్రాణశక్తికన్నా కుక్కలకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి ఉంది. అందువల్ల మనుషుల్ని వారి నుంచి విడుదలయ్యే విశిష్టమైన వాసనల ఆధారంగా గుర్తించగలుగుతాయి. అన్నం పెట్టే వారెవరో, పెట్టని పక్కింటి వారెవరో, ఎపుడూ చూడని ఆగంతకులెవరో వాసన ద్వారా ప్రధానంగా చూపులద్వారా కుక్కలు గుర్తించగలుగుతాయి. అలా వీటికి విశ్వాస గుణం అలవడింది. కుక్కలకు నోరెక్కువ. గట్టిగా మొరగగలవు. కాబట్టి ఆగంతకులు వస్తే అరిచిగోల చేస్తాయి. ఇంటివారికి ఆ విధంగా సహకరించగలవు. అంతేకాకుండా ఇవి కరుస్తాయి. కుక్కలున్న ఇంటికి రావాలంటే దొంగలకు భయం. అందుకే మనుషులకు కుక్కలు మంచి పెంపుడు జంతువులయ్యాయి. మిగతా జీవులను పెంచుకున్నా అవి కుక్కల్లా విశ్వాసం చూపించలేవు.


        కోతి నుంచి మానవుడు ఆవిర్భవిస్తే , మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు ?


మానవుడు కోతి నుంచి పుట్టాడంటే దాని అర్థం కోతులాంటి జీవులు పరిమాణం చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే . ఇది గొంగళి పురుగు సీతాకోక చిలుకల మారడం లాంటి జీవిత చక్రం కాదు . మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి కాని కాండం అంతరించి పోదు కదా ? జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం , కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ పళ్ళు తినడం , కొన్ని పరికరాలను సులువుగా వాడగల్గడం లాటి నైపుణ్యాలు తరాల తరబడిన పరిమాణంలో క్రమేనా అలవడ్డాయి . అవే చింపాంజీలు , ఉరాన్గుటాన్ లు , గొరిల్లాలు లాంటి తోక లేని కోతి గా మారాయి . వాటి నుంచి క్రమేనా మానవజాతి పరిమాణం చెందింది . మనకు తల్లితండ్రుల పోలికలు ఉన్నా వాళ్ళు కుడా మనతోనే ఉంటారు కదా , అయితే తల్లితండ్రుల కన్నా మనం పరిమానాత్మకంగా కొంత మెరుగ్గా ఉంటాము , ఏ జీవ జాతి ప్రకృతిలోని ఒడిదుడుకుల్ని అధిగమించి నాలుగు కాలాల పాటు నిలదోక్కుకోగలదో అదే మనుగడ సాగిస్తుంది , తట్టుకోలేని జాతులు అంతరించిపోతాయి , శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ చెప్పినట్లు ప్రకృతివరణమే జాతుల ఆవిర్భావానికి ఆస్కారం కలిగించింది.


        సముద్రపు నీరు నీలం రంగులో కనిపిస్తుంది, ఎందుకు?


ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సూర్యుని కాంతి ప్రధానంగా ఏడు రంగుల మిశ్రమమని చదువుకుని ఉంటారు. ఈ కాంతి సముద్రంపై పడినప్పుడు నీటి అణువులు ఆ కాంతిని వెదజల్లుతాయి. దీన్నే పరిక్షేపం (స్కాటరింగ్‌) అంటారు. ఇలా వెదజల్లేప్పుడు సూర్యకాంతిలోని ఇతర రంగుల కన్నా నీలం రంగు ఎక్కువగా పరిక్షేపమవుతుందనేది స్థూలంగా చెప్పే కారణం. రసాయనిక బంధాల పరంగా చూస్తే నీరు దృశ్యకాంతిని శోషించుకోలేదు. అందుకనే సాధారణ నీరు వర్ణరహితంగా, పారదర్శకంగా ఉంటుంది.
నీటి అణువులు కాంతిని శోషించుకోలేవు కాబట్టే వెదజల్లుతాయి. ఆ ప్రక్రియలో అధికంగా నీలం రంగునే వెదజల్లుతాయి. మన కన్ను సూటిగా వెళ్లే కాంతి కన్నా అన్ని వైపులకూ వెదజల్లిన కాంతిని ఎక్కువగా గుర్తించగలుగుతుంది. అలాగే నీలంగా కనిపించే ఆకాశాన్ని నీరు ఒక అద్దంలా ప్రతిబింబించడం కూడా సముద్రపు నీలం ఒక కారణమని కూడా చెప్పవచ్చు.


        పొగమంచు గుండా అవతలి వైపు ప్రదేశాన్ని,వస్తువులను చూడలేము ఎందుకు?


అతి సూక్శ్మమైన నీటి బిందువులు చల్లాచదురై గాలిలో తెలియాడుతున్నపుడు ఏర్పడే పరిస్థితిని పొగమంచు అంటారు. నిజానికిది ఘనీభవించిన నీటి ఆవిరి. ఇది నేలకు అతి దగ్గరగా ఏర్పడే మేఘం లాంటిది . వాతవరణంలోని ఉష్ణోగ్రతను బట్టి గాలి కొంత ఘనపరిమాణమున్న నీటిని శోషిస్తుంది .గాలి గరిష్టంగా శోషించే నీరు ఒక ఘనపు మీటరుకు ౩౦ గ్రాముల వరకే అంత కన్నా ఎక్కువ నీరు గాలిలో ఆవిరి రూపంలో కలిసినా, గాలి ఉష్ణోగ్రత తటాలున పడిపోయిన పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచులోని సూక్ష్మమైన నీటి బిందువులు, ఆ ప్రదేశంలోని ప్రతి వస్తువుపై ఒక కాంతి నిరోధక తెరలాగా పనిచేస్తాయి. దాంతో మన కంటికి కనిపించే సామర్థ్యానికి అంతరాయం కలుగుతుంది . వెయ్యి మీటర్ల పరిధిలోని వస్తువులను స్పష్టంగా చూడలేకపోతే అది పొగమంచు ప్రభావమే.


        కాకులు ఎంత తెలివైనవో తెలుసా?


కాకులు చాలా తెలివైన పక్షులు. రామ చిలుకలు తప్ప మిగతా అన్ని పక్షుల కంటే పెద్ద మెదడును కలిగి ఉంటాయి. కాకులు అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి ఉంటాయి. సేకరించిన ఆహారాన్ని దాచుకోవడం వాటికి అలవాటు. కొన్నిసార్లు ఆహారాన్ని వివిధ చోట్లకు మారుస్తాయి, కానీ ఆ ప్రదేశాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాయి. కాకులు పడిపోయిన స్నేహితుడి చుట్టూ గుమికూడి, ఇతర కాకులను పిలుస్తాయి. కాకులు చాలా ధైర్యం గలవి. తమ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ సైజు గల గ్రద్దలను తరుముతాయి.
కాకులు పగబడతాయి కూడా. వాటికి చెడు చేసిన వారిని కొన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుంటాయి. గుంపులుగా వచ్చి దాడి చేస్తాయి. వీటికి ఒక వింత అలవాటు ఉంది. చీమలను తమ ఈకల నిండా పాకించుకుంటాయి. దీని కోసం కొన్నిసార్లు చీమల పుట్ట సమీపంలో ఉంటాయి. ఈ విధంగా ఎందుకు చేస్తాయో ఇప్పటివరకు అంచనా వేయలేక పోయారు. ఆడ, మగ కాకులు ఒకసారి జతకలిస్తే జీవితాంతం కలిసి ఉంటాయి, మరణంతో మాత్రమే వేరుపడుతాయి. కొన్ని సందర్భాల్లో మగ కాకులు భాగస్వామిని విడిచి వెళ్లడం గుర్తించారు, కానీ ఆడ కాకులు మాత్రం ఎప్పటికీ విడిచి వెళ్లవు. కాకి దాదాపు 1000 రకాల ఆహారాన్ని సేకరించి తింటుంది. ఇందులో పురుగులు, కీటకాలు, పండ్లు మరియు విత్తనాలు మొదలైనవి ఉంటాయి. కాకులు మంచి గుడ్డు దొంగలు కూడా. ఇతర పక్షులు గూడు కట్టుకోవడం, అవి ఏ సమయానికి గూళ్లో ఉంటాయి అనే విషయాలను నిశితంగా గమనిస్తాయి. యూరప్ మరియు ఆసియా ప్రాంతాలలో కాకులు ఎక్కువగా కనపడుతాయి. వీటి జనాభా 43 నుంచి 204 మిలియన్ల మధ్య అంచనా వేయబడింది.


        డాల్ఫిన్లు గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయి?


అన్ని జలచరాలకీ ఒకే రకమైన శ్వాసక్రియ ఉండదు. చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకుండే మొప్పల్లాంటి అవయవాల సాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ను రక్తంలోకి వ్యాపనం చేసుకోగలవు. కప్పలు, కొన్ని రకాల ఉభయచరాలు గాలిలో ఉండే ఆక్సిజన్‌ను ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకోగలిగినా, చర్మపు పొరలోకి కూడా నీటిలోని ఆక్సిజన్‌ను సైతం కొంతలో కొంత సేకరించుకోగలవు. కానీ నీటిలోనే నివాసం ఉంటున్నా నీటిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు కూడా ఉన్నాయి. నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్‌, డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటి జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్‌ను తీసుకోగల స్థితిలో ఉండదు. వాటికి ఊపిరితిత్తులు, నాసికా రంధ్రాలు ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకంటా వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయి.


       గడ్డకట్టిన సరస్సులో జలచరాలు ఎలా జీవిస్తాయి?


thanksto ole-jorgen-from-unsplash
చలికాలంలో చాలా దేశాల్లో సరస్సులు గడ్డ కడతాయి. అయితే గడ్డ కట్టిన భాగం పైనే ఉంటుంది. కానీ సరస్సు అడుగు భాగంలో నీరు గడ్డకట్టకుండానే ద్రవస్థితిలో ఉంటుంది. ఇందుకు కారణం నీటికున్న అసంబద్ధ లక్షణమే. నీటి సాంద్రత, మంచు సాంద్రత కన్నా ఎక్కువ. ఇలా ద్రవస్థితిలో ఎక్కువ సాంద్రత, ఘనస్థితిలో తక్కువ సాంద్రత ఉండటం వల్లే మంచు గడ్డలు నీటిపైన తేలుతాయి. అంతే కాదు ఇలాంటి పదార్థాల మీద బరువు పెట్టినట్టయితే వాటికి ఘనీభవనస్థానం మామూలు కన్నా తక్కువ అవుతుంది. సరస్సుల్లో గడ్డ కట్టిన ఐసు గడ్డలు బరువులాగా ఉండటం వల్ల కిందున్న నీరు అల్ప ఉష్ణోగ్రత ఉన్నా ఘనీభవించకుండా ద్రవ రూపంలో ఉంటుంది. కాబట్టి జలచరాలు యాథావిధిగా సంచరిస్తూ జీవన కార్య కలాపాలు సాగించగలవు. కిందున్న నీటిలో జంతుజాతులతో పాటు వృక్ష జాతులయిన నాచు, ప్లాంక్టిన్‌, క్లామిడోమోనాస్‌, యుగ్లీనా వంటి సూక్ష్మ హరిత జీవులు ఉంటాయి. అవి కిరణజన్య సంయోగ క్రియలో విడుదల చేసే ఆక్సిజన్‌ జీవులకు సరిపోతుంది. పైగా అక్కడక్కడా మంచు గడ్డల చీలికల్లోంచి వాతావరణంలోని ఆక్సిజన్‌ అందుతుంది


       చేపలు ఎగురుతాయా?


Photo by John Cobb on Unsplash
ఎగిరే చేపలు ఉన్నా అవి పక్షిలా ఎగరడము కాదు . చేపలకుండే రెక్కలు కొంచెమే విస్తరించి ఉంటాయి. ఈ తరహా చేపలు తోకతో నీటి మీద కొట్టి గాలిలోకి లేచి రెక్కలుకాని రెక్కలను విప్పి గాలిలో తేలుతూ కొంచము దూరము లో పడతాయి. అలా వరుసగా చేసుకుంటూ పోతాయి. ఇది ఒక రకమైన దూకడము . శత్రువులనుండి రక్షించుకునేందుకు , ఆహారము వేటాడే సమయములో వేగముగా చలించేందుకు ఇలా ఎగురుతాయి.


❮ Previous Next❯