telugu short stories 4
1.భగవంతుని పై నమ్మకం
ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను చూసి చాలా జాలి పడ్డాడు. ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు? నీకు ఏమైనా సహాయం చేయనా ?అని అడిగాడు.
ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ, వేడిని కొంచము తట్టుకుని హాయిగా, సంతోషంగా ఉండగలను." అని చెప్పింది .
“ఇటువంటి ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి నీ కోరిక నెరవేర్చమని అయనను అడుగుతాను”, అన్నారు.
శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను. కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను చెప్పానని చెప్పు" అన్నారు పరమాత్మ.
నారదుడు మళ్ళీ ఎడారి లో ఉన్న పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి భగవానుని పై ఎంతో నమ్మకము. ఈ ఉపాయం విని చాలా సంతోషించింది. నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది.
మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య కూర్చుని ఉంది. పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే విషయం బోధ పడలేదు. మళ్ళీ దేవుడి దగ్గరకి వెళ్ళి ఆయనతో ఈ పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు.
అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది. పక్షి తల రాతలో చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని, అర్థము చేసికొని ఆచరించింది. అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన భగవత్ప్రసాదమును స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది. ఆ పక్షి చూపించిన ఈ భక్తి శ్రద్ధలకు , నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు.
*అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన దాన్ని ప్రసాదముగా భావించాలి. ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి. మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు. అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.
2.పద్మపాద బయన్న కథ
జగద్గురువులైన ఆది శంకరాచార్యులవారికి సనందుడనే శిష్యుడుండేవాడు. ఆ సనందుడు మిక్కిలి గురుభక్తి విద్యలపై ఆసక్తి కలవాడు. తన ఎకాగ్రత వినయవిధేయతల వలన కొద్దికాలం లోనే విద్యలునేర్చి శంకరభగవత్పాదులకు ప్రియ శిష్యుడైనాడు పద్మపాదుడు. “ఏ కారణముగా సనందుడు గురువుగారికింత ప్రియుడైనాడో” అని చర్చించుకుంటున్న తన శిష్యులను విన్నారు శంకరులు. వారికి సనందుని అపారమైన గురుభక్తిని చూపాలని నిశ్చయించుకున్నారు.
ఒకసారి ఆది శంకరులు తమ శిష్యసమేతముగా గంగాతీరమునకు వెళ్ళినప్పుడు ఆవలి గట్టునున్న సనందుని చూచి “నాయనా! సనందా శీఘ్రముగా ఇటు రా!” అని పిలిచినారు. గురు ఆజ్ఞయే తప్ప ఇతరము గూర్చి ఆలోచించని సనందుడు వెంటనే కళ్ళుమూసుకుని అనన్యమైన గురుభక్తితో ఇవతలి గట్టుకి నీటి మీద నడచి వచ్చాడు! అప్పుడు సనందుడు నీటిలో మునిగిపోకుండా అతని పాదాల క్రింద పద్మాలను మొలిపించింది గంగాభవానీ. ఆ ఆశ్చర్యకరమైన సంఘటన చూసి ముగ్ధులైన శిష్యులు సనందుని గురుభక్తి తెలుసుకున్నారు. అప్పటి నుంచి సనందుడు పద్మపాదుడనే పేరుతో ప్రసిద్ధుడైనాడు.
చోళదేశంలో పుట్టిన పద్మపాదుడు బాల్యము నుంచి అఖండ నృసింహభక్తుడు. స్వామి సాక్షాత్కారము కోసం పవిత్రమైన అహోబిల అడవులలో ఎన్నో ఏండ్లు తీవ్ర తపస్సును చేసినాడు. కాని నరహరి కరుణించలేదు. శిష్యుని భక్తి పరిపక్వమైనదని గ్రహించిన ఆది శంకరులు ఒకనాడు పద్మపాదుని పిలిచి దగ్గరలో ఉన్న చెంచుగుడెం లోని కొండగుహలో నృసింహస్వామికై తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. గురు ఆజ్ఞపై పద్మపాదుడు కొండగుహ చేరి ఘోర తపస్సు ప్రారంభించాడు.
తాపసి వచ్చాడని తెలియగానే పరుగు పరుగున సాధుసేవ చేదామని వచ్చాడు చెంచుగుడెం దొర బయన్న. “సామీ! నేను బయన్నను. ఈ నేల ఏలికను. దేని కోసం నీవు ఇక్కడికి వచ్చావు దొరా”? అని అడిగాడు. “సింహం ముఖముతో మనిషి శరీరంతో ఉండే దేవుని వెదుకుతున్నా” అన్నాడు పద్మపాదుడు. అడవినంతా ఎఱిగిన ఆ బయన్న తానెన్నడూ అట్టి వింత జంతువును చూడలేదన్నాడు. బయన్న మూఢభక్తుడు. ఉంది అని రూఢిగా చెప్పిన పద్మపాదుని మాటలువిని “సామీ! ఆ ముగము నిజంగా ఉంటే కట్టేసి తెస్తా లేకుంటే పానాలు వదిలేస్తా” అని ఆ నరసింహమును వెదుక బయలుదేరాడు బయన్న!
పద్మపాదుడు వర్ణించిన నృసింహస్వామి అద్భుత రూపాన్ని మనస్సులో ముద్రించుకున్నాడు బయన్న. ఏకాగ్రచిత్తంతో నిద్రాహారాలు మాని అడవంతా తిరిగాడు బయన్న. ఎంత శ్రమించినా అణువణువూ పరీక్షగా చూచినా ఎక్కడా కనబడలేదు స్వామి. “నీవు కనిపించని ప్రాణమెందులకు?” అని బయన్న ప్రాణాత్యాగం చేయబోయాడు. బయన్న నిస్వార్థ నిష్కల్మష మూఢభక్తికి మెచ్చి నృసింహుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే స్వామిని తీగలతో కట్టేసి పద్మపాదుని ముందర నిలబెట్టాడు బయన్న!
కళ్ళముందరే బయన్నకు కనబడుతున్న నృసింహుడు పద్మపాదునకు కనబడలేదు. “స్వామీ! ఏమి నా పాపము?” అని ఆక్రోశించాడు పద్మపాదుడు. “నాయనా! పద్మపాదా! కోటి సంవత్సరములు నా రూపాన్ని ధ్యానం చేసినా అలవడని ఏకాగ్రత భక్తి ఈ బయన్న ఒక్కరోజులో సాధించాడు. ఈ సత్పురుషుని సాంగత్యం వలనే నీకు నా మాటలు వినబడుతున్నాయి. నీవు విచారించకు. నీ అఖండ గురుభక్తికి మెచ్చాను. అవసరమైనప్పుడు నేనే నీకు దర్శనమిచ్చి నిన్ను కాపాడెదను” అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు స్వామి.
పద్మపాదుని గురుభక్తి అనన్యము. గురుకృప లేని ఏవిద్య రాణించదు. ఇహపరసాధనానికి దిక్కైన గురువుని అత్యాదరముతో పూజించాలి.
ఏకాగ్రత నిశ్చల భక్తి యొక్క గొప్పతనము మనకీ కథలో బయన్న ద్వారా తెలిసినది. నిద్రాహారాలు మాని ఏకాగ్రచిత్తంతో స్వామిని వెదకిన బయన్నను కరుణించాడు నృసింహుడు.
3.కాకి - పిచ్చుక
అనగనగా ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒక రోజు కుండపోతగా వర్షం కురవడం మొదలయింది. ఆ వర్షానికి పిచ్చుక గూడు ఎగిరిపోయింది. అంత వర్షంలో ఆ పిచ్చుక తడిసిపోతున్న తన పిల్లల్ని తీసుకొని ఆశ్రయం కోసం కాకి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. లోపలి నుండి కాకి ఎవరు? అని అడిగింది. పిచ్చుక "కాకమ్మ గాలివానకు నా గూడు కొట్టుకు పోయింది. నా పిల్లలు తడిసిపోతున్నారు, కొద్దిగా మీ ఇంట్లో చోటివ్వు వాన తగ్గగానే వెళ్ళిపోతాను" అని అంటుంది. దానికి కాకమ్మ "నా పిల్లలు వెచ్చగా పడుకోని ఉన్నారు. నేను తలుపు తీయను" అని నిర్ధాక్షిణంగా చెప్తుంది. పిచ్చుక చేసేదేం లేక ఇంకొక ఇంటిని వెతుక్కుంటూ వెళ్తుంది.
కొన్ని రోజుల తర్వాత, పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తడుతూ ఉండడంతో ఎవరు? అని అడుగుతుంది. బయటనుండి "పిచ్చుకమ్మ నేను కాకిని, వర్షానికి నా ఇల్లు కూలిపోయింది, నా పిల్లలు తడిచిపోతున్నారు. దయతలిచి తలుపు తీస్తే, ఈ రాత్రికి మీ ఇంటిలో ఉంటాను" అంది కాకి. వెంటనే పిచ్చుక తలుపు తెరిచి, కాకి పిల్లల్ని తన రెక్కల్లో ముడుచుకొని తీసుకొచ్చి తన పిల్లల పక్కన ఉంచుతుంది.
గతంలో పిచ్చుక తాను ఎలా ప్రవర్తించిందో గుర్తుచేసుకొని సిగ్గుతో తల దించుకుంటుంది
4.ధర్మవ్యాధుని కథ
(శ్రీమహాభారతం లోని కథ)
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.
5.కోతి చెప్పిన నీతి
ఇంద్రవర్మ ఎప్పుడు వివిధ రాజ్యాలను పర్యటించే వాడు. కానీ తన రాజ్యంలో కొంత భాగమైన చూసింది లేదు. ఇది ఇలా ఉండగా, ఒక రోజు రాజు విహారానికి బయల్దేరి, తన రాజ్యంలోని అడవిలో విశ్రాంతి కొరకై ఆగుతాడు. తన దగ్గరలోనే ఒక కోతిని గమనిస్తాడు. అది రాజు ఫలహారం చేసి మిగిలిన వేరుశెనగకాయల్ని తీసుకొని చెట్టు పైకి ఎక్కి తినసాగింది. అలా తింటూ ఉండగా, కోతి చేతి నుండి ఒక వేరుశెనగకాయ కింద పడుతుంది. ఆ ఒక్క కాయ కోసం, తన చేతిలోని కాయలన్ని పడేసి కిందకి దిగుతుంది. ఇదంతా గమనిస్తున్న రాజు చూసి నవ్వసాగాడు. కోతి కోపంతో, ఎందుకు నవ్వుతున్నావ్? అని అడిగింది. అప్పుడు ఇంద్రవర్మ "ఒక్క కాయ కోసం అన్నీ వదులుకున్నావ్ నువ్వెంత వెర్రిదానివి!" అని అన్నాడు. వెంటనే కోతి "నన్ను వెర్రిదానినని అంటున్నావుగా, మరి నువ్వు చేసేది కూడా అదేగా. మన రాజ్యంలోని అందాలని ఆనందించకుండా, ప్రజల కష్టసుఖాలని విచారించకుండా పక్క రాజ్యాలని పర్యటిస్తూ ఉంటావు కదా" అని అంది.
ఇంద్రవర్మకు జ్ఞానోదయం అయింది. తాను చేసేది తప్పు అని తెలుసుకొని, విదేశీ పర్యాటనికి స్వస్తి చెప్పి, తన రాజ్యం మంచి చెడ్డలు చూసుకోసాగాడు.
6.కార్తవీర్యార్జునుడు
రావణుని గదతో పడగొట్టి పడిపోయిన అతనిని బంధించటానికి వెళుతున్న అర్జునుడు.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలుపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. అదే నేటి శమంతపంచకం. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
కార్తవీర్యార్జునుడు రావణునితో యుద్ధం చేసి బంధించెను
Post a Comment