తెలుసుకుందాం 2

తెలుసుకుందాం


 విమానాలు ఆకాశంలో ఎగురుతున్నపుడు వాటి మీద పిడుగులు పడవా?

పిడుగు అంటే ఏమిటో తెలుసుకుంటే ఈ విషయం బోధపడుతుంది. మేఘాల రాపిడితో ఉద్భవించిన అత్యధిక స్థిర విద్యుత్తు నేలవైపునకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నేలకు, విద్యుదావేశితాలయిన మేఘాలకు మధ్య వేల వోల్టుల మోతాదులో శక్మ భేదం (Potential difference) ఉంటుంది. రెండు బిందువుల మధ్య శక్మ భేదం ఉన్నట్లయితే విద్యుదావేశం అతి తక్కువ నిరోధం ఉన్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ విద్యుత్  గమనం  ఉష్ణ రూపంలో బయటపడుతుంది. అదే ప్రమాదాన్ని కలిగించే సంఘటన. కానీ విమానం కిందున్నపుడు విద్యుత్ప్రవాహాన్ని నిరోధించే రబ్బరు టైర్లు ఉంటాయి.(విద్యుత్ మన నుండి భూమి కి చేరితేనే మనకు షాక్ కొడుతుంది అందువలననే రబ్బరు చెప్పులు ధరించి కరెంట్ పని చేయాలి.) మేఘాల్లో ఉన్నపుడు దాని ద్వారా భూమిని చేరే మార్గం మేఘాల్లోని విద్యుత్తుకు లేదు.  అసలు విషయం మరోటి ఉంది. విమానం పైకి లేచిన కొన్ని నిముషాల్లోనే అది మేఘాల్ని దాటి పైకి వెళ్లి ప్రయాణిస్తుంది. మెరుపులు ఉరుములు, పిడుగులు తన కింద ఎక్కడో సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి పిడుగు ప్రభావం విమానం పైన ఉండదు. అందువలన విమానాలు గాలిలో ఎగురుతున్నపుడుగానీ నేలమీద ఉన్నపుడుగానీ వాటిని పిడుగులు సాధారణంగా ఏమీచేయలేవు.


అతిధ్వనులంటే ఏంటి?

                        శబ్దాలను హెర్జ్‌ (Hertz)లో కొలుస్తారని తెలుసుకదా? ఇలా 20 నుంచి 20,000 హెర్జ్‌ల స్థాయిలో ఉండే శబ్దాలనే మన చెవి వినగలుగుతుంది. 20,000 హెర్జ్‌లకు ఎక్కువైన శబ్దాలను 'అతి ధ్వనులు' (ultrasonic sounds) అంటారు. ఏదైనా వస్తువు సెకనుకు 20,000 కంటే ఎక్కువ కంపనాలకు గురైనప్పుడే అతి ధ్వనులు ఏర్పడుతాయి. 

                          వీటిని క్వార్ట్జ్‌ (quartz) లేక పింగాణీ (ceramic) లాంటి పదార్థాల గుండా ఏకాంతర విద్యుత్‌ (AC)ని ప్రవహింప చేయడం ద్వారా గానీ, యాంత్రిక, అయస్కాంత విధానాల ద్వారాగానీ పుట్టిస్తారు. 1890లో పియర్‌ క్యూరీ అనే శాస్త్రజ్ఞుడు ఆవిష్కరించిన అతి ధ్వనులను, రెండో ప్రపంచయుద్ధంలో జలాంతర్గాముల ఉనికిని కనిపెట్టడానికి ఉపయోగించారు. 

                          దేహంలో ట్యూమర్లు, కిడ్నీ, లివర్‌ లాంటి భాగాల్లోని లోపాలను కనిపెట్టడంలో, గర్భస్థ శిశువు పెరుగుదలను కనుగొనడంలో, టంగ్‌స్టన్‌ లాంటి దృఢమైన లోహాలను కోయడంలో, వివిధ పరికారాల లోపలి భాగాల్లో కంటికి కనబడని పగుళ్లను కనుగొనడంలో, యంత్రభాగాలను, సర్జరీ పరికరాలను పరిశుభ్రం చేయడంలో రకరకాలుగా అతిధ్వనులు ఉపయోగపడతాయి.

ఇన్ వార్ స్టీల్ అంటే ఏమిటి ?దాని ప్రయోజనాలు  ఏమిటి ?

                             ఎలక్ట్రానిక్ వాచ్ లు,  బ్యాటరీగడియారాలు  రాకముందు , స్ప్రింగ్ లు , లోలకాలతో తయారయ్యే గడియారాలు ఉండేవి , వీటి లోపలి భాగాలను లోహాలతో తయారు చేయడం వల్ల , పరిసరాల ఉష్ణోగ్రతల్లో తేడాలు వల్ల ఇవి వ్యాకోచించడమో,సంకోచించడమో జరిగేది . ఫలితంగా అవి చూపించే సమయాలు ఖచ్చితంగా ఉండేవి కావు . ఒక్కో  ఋతువులో ఒక్కోలా ఉండేవి . అలాగే దూరాన్ని కొలిచే టేపులు కుడా ఇనుము , స్టీలు లోహాలతో చేయడం వల్ల సంకోచ,వ్యాకోచాల  కారణంగా కొలతలు మారుతుండేవి , అందువల్ల ఉష్ణోగ్రత మార్పులకు పెద్దగా ప్రభావితం కానీ లోహం కోసం అన్వేషించారు . అదే ఇన్ వార్ స్టీల్ . దీన్ని స్టీల్, నికెల్  64 : 36 లను నిష్పత్తి లో మిశ్రమించి తయారు చేస్తారు.


గంటకు 60 నిముషాలే ఎందుకు? 

                             నిముషానికి అరవై సెకండ్లు , అరవై నిమిషాలు కలిస్తే ఒక గంట . ఈ పద్దతిని  సుమేరియన్‌ సంసృతి వారు ఆరంభించారు . చేతివేళ్ళ మీద ఉండే కణుపు గీతలు లెక్కపెట్టడమే వారికి చేతనయినది . ఒక చేతిలోని నాలుగు వేళ్ళ(బొటనవేనిని మినహాయించి) కణుపుల (phalanges) మొత్తము 4 x 3 = 12 . రెండు చేతులు కలిపితే 24 గంటలుగా , వాటిలో ఒకటి పగలు గాను ఒకటి రాత్రి గాను చేశారు .ఇక 4 చేతివేళ్ళకణుపులను బొటనవేని సంఖ్య 5 చే గుణించగా 4 x 3 x 5 = 60 ని గంటకు నిముషాలుగాను , నిమషానికి 60 సెకనులు గాను ఊహాతీతం  గా తీసుకోవడం జరిగిందని శాస్త్రజ్ఞుల నమ్మకము .

వాటర్‌ హీటర్‌ కాయిల్‌ను బకెట్‌లో నీటి అడుగున పెట్టినా ముందుగా ఉపరితలంలోని నీరు వేడెక్కుతుందేం?

                                 బకెట్‌లో నీటి అడుగున వాటర్‌ హీటర్‌ కాయిల్‌ను ఉంచి ఆన్‌ చేయగానే ముందుగా కాయిల్‌ చుట్టూ ఉండే నీరు వేడెక్కుతుంది. ద్రవాల సాంద్రత, ఉష్ణోగ్రత పెరిగే కొలదీ తగ్గుతుంది. అందువలన కాయిల్‌ చుట్టూ వేడెక్కిన నీరు వెంటనే బకెట్‌ ఉపరితలానికి చేరుకుంటుంది. ఉపరితలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండి సాంద్రత ఎక్కువగా ఉండే నీరు బకెట్‌ అడుగుకు చేరుకొని, కాయిల్‌వల్ల వేడెక్కి తిరిగి పైకి చేరుకుంటుంది. ఇలా బకెట్‌లోని నీరంతా ఒకే ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు నీరు పై నుంచి కిందకు, కిందనుంచి పైకి కదులుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రక్రియను ఉష్ణ వికిరణం (heat convection) అంటారు.


సోలార్ బేటరీ ఎలా పనిచేస్తుంది?

                              సూర్యుని కాంతి శక్తిని విద్యుచ్చక్తి గా మార్చడమే సౌర ఘటాల (Solar Batteries) పని . ఆ విద్యుత్ ను ఏ ప్రయోజనము కోసం వాడతామనే విషయాన్ని బట్టి అవి పనిచేసే విధానము కుడా మారుతుంది . కొన్ని సౌరఘటాలు ఎప్పటికప్పుడు కాంతి శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తూ పరికరాలను నడిపిస్తుంటాయి . కేవలం తక్కువ మోతాదు విద్యుత్ మాత్రమే అవసరమయ్యే కాలిక్యులేటర్లు ,డిజిటల్ గడియారాల్లాంటివి ఈ విధానం లో పనిచేస్తాయి . చీకటిలో ఇవి పని చేయవు . ఇక ఎక్కువ విద్యుత్ కావాల్సిన బల్బులు , యంత్రాలు , టార్చిలైట్లు , వీదిలైట్లు పని చేయాలంటే తొలుత కాంతి శక్తిని చాలా గంటల పాటు విధుత్ శక్తి గా మారుస్తూ నిలువ ఉంచుకునే  విధానాన్ని వాడతారు . సినికాన్ వంటి పదార్ధాలలోని ఎలక్ట్రాన్లు కాంతి శక్తివల్ల ఉత్తేజితమై ఒక శక్తి స్థాయి నుంచి పైశక్తి స్థాయికి మారుతూ ధన , రుణ విద్యుద్దావేశాల్ని ఏర్పరచ గలవు . ఇలాంటి ఘటాలను వందలాదిగా వరుసగా కలపడం ద్వారా కొంత మోతాదులో ''విద్యుత్ పొటన్షియల్'' ఏర్పడుతుంది .


వోల్టేజ్‌ స్టెబిలైజర్‌ను ఎందుకు వాడాలి? అది ఎలా పనిచేస్తుంది?

                                       ఇంట్లో వాడే టీవీ, రిఫ్రిజిరేటర్‌, ఏసీ లాంటి విద్యుత్‌ పరికరాలకు సరఫరా అయ్యే విద్యుచ్ఛక్తి స్థిరమైన ఓల్టేజిలో ఉండాలి. విద్యుత్‌ శాఖ నుంచి ఇంటికి సరఫరా అయ్యే విద్యుత్‌ 220 ఓల్టులు ఉండాల్సి ఉండగా ఒక్కోసారి హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. ఓల్టేజి తగ్గితే పరికరాలు పనిచేయవు. ఎక్కువైతే కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయా పరికరాలకు సరఫరా అయ్యే విద్యుత్‌ నిర్దిష్టంగా అందేలా చూసే పరికరం అవసరమైంది. అదే ఓల్టేజి స్టెబిలైజర్‌. దీని ద్వారానే ఆయా పరికరాలకు విద్యుత్‌ అందే ఏర్పాటు ఉంటుంది. ఇందులో ఉండే ట్రాన్సిస్టర్‌ అనే పరికరం విద్యున్నిరోధానికి అనుసంధానమై ఉంటుంది. ఈ ఏర్పాటు వల్ల సరిగ్గా పరికరానికి కావలసినంత మేరకే విద్యుత్‌ను స్టెబిలైజర్‌ నియంత్రించి పంపుతుంది. స్టెబిలైజర్‌లో వాడే ట్రాన్సిస్టర్‌ను జెనర్‌ డయోడ్‌ లేదా అవలాంచ్‌ డయోడ్‌ అంటారు.   


సెల్‌ఫోన్‌ను చాలాసేపు ఆఫ్‌ చేసి మళ్లీ ఛార్జింగ్‌ చేసి ఆన్‌ చేస్తే తేదీని తప్పులేకుండా చూపిస్తుంది. ఆఫ్‌ చేసినా దాన్లో తేదీల సమాచారం ఎలా దాగుంది?

                                  సాధారణంగా సెల్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోకముందే ఆఫ్‌ చేస్తే, ఆ బ్యాటరీ శక్తితో సమాచారం సెల్‌ఫోన్‌ సర్క్యూట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఫోన్‌ మెమొరీలో ఉన్న కాంటాక్ట్‌ పేర్లు వగైరా సమాచారమంతా అలాగే ఉంటుంది. అందుకే తిరిగి ఆన్‌ చేసినపుడు తేదీ, సమయం, ఇతర వివరాలు కూడా ఉంటాయి. కానీ సెల్‌ను చాలాకాలం పాటు ఆఫ్‌ చేస్తే దానిలోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయిపోతుంది. అప్పుడు ఫోన్‌ మెమొరీలో ఉండే సమాచారం మొత్తం ఖాళీ అవుతుంది. తిరిగి ఛార్జింగ్‌ చేసి ఆన్‌ చేస్తే ఆ సమాచారం తిరిగి రాదు. కానీ తేదీ, కాలం మాత్రం బాగానే కనిపిస్తాయి. ఇందుకు కారణం ఫోన్‌ మెమొరీ కాదు. మనం ఏ కంపెనీ సెల్‌ఫోన్‌ను వాడుతున్నామో, ఆ టవర్‌తో లింకు ఏర్పడి వారి సర్వీసు సర్వర్‌ కంప్యూటర్‌తో సంధానించుకుంటుంది. అయితే కాంటాక్ట్స్‌, ఇతర వివరాలను సెల్‌లో ఉండే మైక్రోచిప్‌లోకానీ, సిమ్‌ మెమొరీలో కానీ దాచుకుంటే ఎన్ని రోజుల తర్వాతైనా తిరిగి వాడుకోవచ్చు.


అక్కడి నీరు ఎక్కడిది?

                               మనం ఫ్రిజ్‌ను వాడేప్పుడు చాలా సార్లు దాని తలుపు తెరుస్తుంటాము కదా. బయటి గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌లాంటి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుందని చదువుకుని ఉంటారు. మనం తలుపులు తీసినప్పుడల్లా గాలి లోపలికి చొరబడి డీప్‌ఫ్రీజర్‌కి తగులుతూ ఉంటుంది. ఆ గాలిలోని నీటి ఆవిరి అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతకి గురై క్రమేణా మంచు పొరల్లాగా మారుతుంటుంది. ఫ్రిజ్‌ లోపల చల్లని పరిస్థితుల్లో పీడనం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే తలుపులు తీసినప్పుడల్లా బయటి గాలి వేగంగా లోపలికి చొరబడుతుంది.


ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా?

                              వాయువుల్లో వాస్తవ వాయువులు (Real Gases) ఆదర్శ వాయువులు(Ideal Gases) అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్‌ థామ్సన్‌ గుణకం. ఓ వాయువును బాగా సంపీడనం (Compression) చేశాక ఒక్కసారిగా విరళీకరణానికి(expansion) గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్‌ థామ్సన్‌ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్‌ బృందానికి చెందిన ఫ్రియాన్‌ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్‌ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా (Cyclically) వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే. ఏసీ గాలి వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎటొచ్చీ ఫ్రియాన్‌ వాయువుతోనే ఉంది తంటా అంతా. ఇది వాతావరణంలోకి ఏమాత్రం లీక్‌ అయినా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది. తద్వారా భూ వాతావరణానికి అనారోగ్యం కలుగుతుంది.


మనం ఇంట్లో వాడే స్పాంజిని దేనితో, ఎలా తయారు చేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకోగలుగుతుంది?

                           మామూలు నార, దూది, పాత గుడ్డ వంటి వాటిని లుంగచుట్టినా అవి కూడా స్పాంజిలాగే పనిచేస్తాయి. మనం వాడే తువ్వాలు, జేబురుమాలు, వంటింటి మసిగుడ్డ కూడా స్పాంజి పనిచేసే సూత్రం ఆధారంగానే పయోగపడుతున్నాయి. స్పాంజి ఒక ప్లాస్టిక్‌ పాలిమర్‌. అంటే ముద్దగా ఉన్న పాలిమర్‌ పదార్థంలో అత్యధికంగా గాలి గదులు ఉంటాయి. ఒక గదికి, మరొక గదికి కూడా మార్గాలు ఉంటాయి.అందువల్ల చూడ్డానికి పెద్దగానే ఉన్నా అందులో ఉండేది ఎక్కువ ఖాళీనే. దీని తయారీ దశలోనే ద్రవస్థితిలో ఉండే పాలిమర్‌లోకి నైట్రోజన్‌ను కానీ, గాలిని కానీ, కార్బన్‌డయాక్సైడును కానీ నురగ రూపంలోపంపుతారు. అందువల్లనే రంధ్రాలతో స్పాంజి ఏర్పడుతుంది. ఇక అది నీటిని పీల్చుకోవడానికి కారణం ద్రవాలకుండే తలతన్యత అనే ధర్మమే. సన్నపాటి సందుల్లోకి ద్రవాలు పాకడాన్నే కేశనాళికీయత (capillarity) అంటారు. ఈ లక్షణం వల్లనే అద్దుడు కాగితం ఇంకుని, సుద్దముక్క నీటిని, తువ్వాలు తడిని, స్పాంజి నీటిని పీల్చుకుంటాయి. దీపంలో వత్తి ద్వారా నూనె పైకి పాకడానికి, చెట్ల వేర్ల ద్వారా నీరు ఆకుల్లోకంటా చేరడానికి కూడా ఇదే కారణం.


హోటల్స్ లో చేతులు తుడుచుకోవడానికి  మెత్తని కాగితాన్ని ఇస్తారు. దాన్ని ప్రత్యేకత ఏమిటి ? అది నీటిని తొందరగా  ఎలా పీల్చుకుంటుంది ?


                                           ఇలాంటి కాగితాన్ని tissue   పేపర్ అని , కాగిత రుమాలు అని అంటారు. కాగితాలను సెల్యులోజ్‌ అనే  పదార్థంతో  చేస్తారని తెలుసుగా ? మామూలు కాగితంలో ఈ పదార్థం పోగులు దట్టంగా అల్లుకొని ఉంటాయి . పైగా అధిక ఉష్ణోగ్రత వద్ద రోలర్ల సాయంతో నొక్కుతూ తయారు చేయడం వాళ్ళ సెల్యులోజ్‌ పోగుల్ని పిండిపదార్థం జిగురులాగా అతుక్కుని ఉంచుతుంది , అందువల్ల సాధారణ కాగితం గట్టిగా , నీరు తొందరగా ఇంకని విధంగా తయారు అవుతుంది , అయితే tissue   పేపర్ లో సెల్యులోజ్‌ పోగుల్ని చాలా వదులుగా ఉండేలా తయారు చేస్తారు , వీటిని కలిపి ఉంచడానికి పిండిపదార్థము వాడరు , అందువల్ల పొరకు, పొరకు మధ్య , చాలా ఖాళీలు ఎక్కువగా సూక్శ్మస్థాయిలో ఉంటాయి , ఈ కారణంగా ఇవి తడిని ఎక్కువగా పీలుచుకొగలుగుతాయి.


సిరాను బ్లాటింగ్‌ పేపర్‌ ఎలా పీల్చుకుంటుంది?

    ముందు ద్రవాలకు సంబంధించిన ఒక ధర్మాన్ని తెలుసుకుందాం. ఒక కేశనాళిక (వెంట్రుకంత సన్నని రంధ్రం ఉండే గాజుగొట్టం)ను ఒక పాత్రలో ఉన్న నీటిలో నిలువునా ముంచితే ఒక విషయాన్ని గ్రహించవచ్చు. పాత్రలోని నీటి మట్టం కంటే కేశనాళికలోని నీటి మట్టం కొంచెం ఎత్తులో ఉంటుంది. అంటే పాత్రలోని నీరు కేశనాళికలోకి ఎగబాకిందన్నమాట. ద్రవాలకు ఉండే ఈ ధర్మాన్ని కేశనాళీయకత (capillarity) అంటారు. ద్రవాల ఉపరితలం, సాగదీసిన బిగువైన పొరలాగా ప్రవర్తిస్తుంది. దీన్నే ద్రవాల తలతన్యత (surface tension) అంటారు. కేశనాళీయకత అనేది ఈ తలతన్యత ప్రభావమే. ఇప్పుడు బ్లాటింగ్‌ పేపర్‌ విషయానికి వద్దాం. దీన్ని కొయ్య, ఎండుగడ్డి, దూది లాంటి పదార్థాల మెత్తని గుజ్జుతో తయారు చేస్తారు. ఈ గుజ్జును చదునైన తలంపై పోసి రోలర్లతో ఒత్తిడికి గురి చేయడం వల్ల బ్లాటింగ్‌ పేపర్‌ తయారవుతుంది. ఈ పేపర్‌ కణాల మధ్య ఏర్పడే ఖాళీలు అతి సన్నని రంధ్రం గల గొట్టాలలాగా పనిచేస్తాయి. ఒలికిన సిరాపై బ్లాటింగ్‌ పేపర్‌ను సుతారంగా అద్దినప్పుడు కేశనాళీయకత వల్ల దాని ఖాళీల్లోకి సిరా ఎగబాకుతుంది. అలా ఆ కాగితం ఉపరితలంపైకి వచ్చిన సిరాను చుట్టుపక్కల కణాలు పీల్చుకోవడంతో అది వ్యాపిస్తుంది.


సెల్యులోజ్‌ అంటే ఏమిటి?

                                        సెల్యులోజ్‌ అనేది మొక్కలు ఉత్పత్తి చేసే ఒక పదార్థం. మొక్కలకు వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడును, నీటిని కలిపి గ్లూకోజ్‌ అనే చక్కెర పదార్థంగా మార్చే శక్తి ఉందని పాఠాల్లో చదువుకుని ఉంటారు. అలా తయారు చేసిన గ్లూకోజ్‌ను మొక్కలు ఏం చేస్తాయనే విషయం వేర్వేరు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ మొక్కా గ్లూకోజ్‌ను ఎక్కువగా నిల్వ ఉంచుకోదు. ఎందుకంటే గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే మొక్కల కణాలు ఎక్కువ నీటిని శోషించుకోవలసి ఉండడంతో అవి పగిలి విచ్ఛిన్నమవుతాయి. అలాగే గ్లూకోజ్‌ ఎక్కువయ్యే కొద్దీ కిరణజన్య సంయోగ క్రియ(photosynthesis) వేగం తగ్గిపోతుంది.

                            ఈ ప్రమాదం నుంచి తప్పించుకోడానికి మొక్కల్లో అదనపు గ్లూకోజ్‌ అణువులతో పొడవైన గొలుసులను తయారు చేసే ఒక ఎంజైమ్‌ ఉంటుంది. ఈ గొలుసులలో పిండిపదార్థం (starch) ఒకటైతే, మరొకటి సెల్యులోజ్‌.సెల్యులోజ్‌ గొలుసుల పొడవు ఒకో మొక్కకు ఒకోలా ఉంటుంది. ఉదాహరణకు పత్తిమొక్కలో తయారయే ఒక్కో సెల్యులోజ్‌ గొలుసులో 10,000 గ్లూకోజ్‌ అణువులు ఉంటాయి. సెల్యులోజ్‌ మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్క యొక్క కణాల గోడలు దృఢమైన సెల్యులోజ్‌ పదార్థంతోనే తయారవుతాయి. ఆ ఏర్పాటు లేకపోతే మొక్క తన భారానికి తానే ముడుచుకుపోయి నశిస్తుంది.

                             సెల్యులోజ్‌ మనకు ఆహారంగా పనికిరాదు. మన జీర్ణవ్యవస్థలో పిండి పదార్థాల గొలుసులను గ్లూకోజ్‌ అణువులుగా విడగొట్టగల ఎంజైములు ఉన్నాయి కానీ, సెల్యులోజ్‌ను విడగొట్టగల ఎంజైములు లేవు. మనం మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటే వాటిలోని పిండిపదార్థం జీర్ణమై, సెల్యులోజ్‌ భాగం విసర్జితమవుతుంది. ఎండుకట్టెలలో సెల్యులోజ్‌ అధికంగా ఉండడంతో ఎక్కువ ఉష్ణాన్నిచ్చే వంట చెరకుగా ఉపయోగపడతాయి. సెల్యులోజ్‌ను కాగితం, వస్త్రాలు, రేయాన్‌, సెల్లోఫేన్‌, సెల్యులాయిడ్‌ లాంటి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.


హిమానీ నదులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?


    ఎత్తుగా ఉన్న పర్వతాల దగ్గర వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రత బాగా పడిపోవడం వల్ల గాల్లో ఉన్న తేమ మంచు బిందువులు కింద పడతాయి. అవన్నీ పేరుకుపోయి కొండల మధ్య ఉన్న లోయల్ని బావుల్లో నీళ్లు నింపినట్టుగా మంచు బిందువులతో నింపుతాయి. అక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడుకన్నా తక్కువ ఉండడం వల్ల, పీడనం కూడా తక్కువగా ఉండి మంచు బిందువులు ఘనీభవిస్తాయి. ఇలా నెలల తరబడి కొండల మధ్య పేరుకుపోయిన మంచు బిందువులు ఒక దిమ్మలాగా బల్లపరుపుగా కొండల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలను ఆక్రమిస్తాయి. ఇటువంటి మంచు దిమ్మలు విశాలమైన గాజు పలకలాగా కనిపిస్తాయి. దీనిపైన ఆసక్తి ఉన్నవాళ్లు ఐస్‌ స్కేటింగ్‌ వంటి శీతాకాలపు క్రీడలను ఆడుతుంటారు. ఇలాంటి మంచుతో కూడుకున్న విశాలమైన ఘనీభవించిన మంచు మైదాన ప్రాంతాలనే (గ్లేషియర్‌) హిమనీ నదం అంటారు. వేసవి రాగానే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ మంచు కరిగి స్వచ్ఛమైన నీరులాగా పర్వతాల కిందివైపునకు ప్రవహిస్తుంది. ఇలా అనేక పాయలు కలిసి నదులుగా ఏర్పడతాయి. అలా హిమాలయ పర్వతాల నుంచి గంగా, యమునతో పాటు ఎన్నో నదులు ఏర్పడ్డాయి.

వర్షం వచ్చేముందు మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?


                                 ఒక వస్తువుపై కాంతి కిరణాలు పడినపుడు ఏమవుతుందోననే విషయాన్ని చూద్దాం. ఏదైనా వస్తువుపై కాంతికిరణాలు పడినపుడు కాంతిలోని కొంతభాగం వెనుదిరిగి వస్తుంది. దీన్ని పరావర్తనం అంటారు. కాంతిలోని కొంత భాగాన్ని వస్తువు శోషిస్తుంది. కొంత భాగం వస్తువులోంచి పయనించి అవతలవైపు నుంచి బయటకు వస్తుంది. అద్దం లాంటి తళతళమెరిసే వస్తువుపై కాంతి పడినపుడు, అందులోని ఎక్కువ శాతం పరావర్తనం చెందుతుంది. నల్లగా ఉండే వస్తువుపై కాంతిపడితే ఎక్కువ కాంతిని అదిశోషిస్తుంది. గాజు లాంటి పారదర్శక పదార్థంపై కాంతి పడితే, చాలా వరకు కాంతి అందులో నుంచి బయటకు వస్తుంది.

సూర్యరశ్మికి భూమిపై ఉండే నీరు ఆవిరి అవడం వల్ల మేఘాలు ఏర్పడతాయని మనందరికీ తెలుసు. తక్కువ స్థలంలో ఎక్కువ నీటి బిందువులు గుమికూడి ఉన్న మేఘం ఎక్కువ కాంతిని శోషించుకుంటుంది. అందుకే ఆ మేఘం నల్లగా కనిపిస్తుంది. ఎక్కువ నీటి బిందువులు ఉన్న ఆ మేఘం త్వరగా వర్షిస్తుంది. కొన్ని నీటి బిందువులు, చాలా వరకు చిన్న మంచు స్ఫటికాలు ఉండే మేఘంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. ఈ మేఘాల్లోనే పారదర్శకమైన మంచు స్ఫటికాలు ఉంటే వాటి గుండా కాంతి కిరణాలు చొచ్చుకుపోయి ఆ మేఘాలు పారదర్శకంగా కనిపిస్తాయి. దీనికి ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు.
 
                          వర్షం వచ్చే ముందు నల్లని మెఘాలు కమ్ముకుంటాయి . అంతకు ముందు అవి నీలం , తెలుపు రంగుల్లో ఉంతాయి .ఆ నల్లని మేఘాలను శాస్త్రపరిభాషలో " కుమ్యులో నింబస్ " మేఘాలు అంటారు . ఆ మేఘాలలొ దట్టంగా పేరుకున్న నీటి బిందువులు , మంచు అందుకు కారణము ,. ఆ దట్టమైన పొరవలన ఆ మేఘాలలో నుండి కాంతి కి్రణాలు ప్రయాణం చేయలేవు . ఫలితంగా మనకు నల్లగా కనిపిస్తాయి . ధూళిరేణువులు , కాలుష్యకారకాల వల్ల కుడా నల్లరంగు వస్తుంది .

జింక చర్మము మీద కూర్చుని పూర్వ కాలంలో  తపస్సు చేసేవారు ఎందుకు?


                           వేదాలలో ఋగ్వేదము రంగు  "తెలుపు " , సామవేదము రంగు " నలుపు " . ఆ రెండు వేదాల రంగులే ..... పగలూ ,రాత్రి . అందుకే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మము మీద తపస్సు చేసేవారు.  జింక చర్మము మీద తపస్సు అనేక వ్యాధులను దూరము చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాల సారాంశము ద్వారా తెలుస్తోంది.

ఈ కాలములో జింక చర్మము మీద తపస్సు చాలా పెద్ద నేరము . పూర్వం కాలము లో కాలం చెల్లిన జింక చర్మాలను మాత్రమే ఋషులు ఉపయోగించేవారు .



అంతటా ఒకే కరెన్సీ ఉండదు ఎందుకు ?

                          ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. 

                         మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్‌ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్‌ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం. 

                          అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.



పాలు విరుగుతాయెందుకు?

                               రసాయనశాస్త్రము ప్రకారము పాలు అష్తిరమైన కొల్లాయిడ్స్ రూపము . పాలలో పోషక పదార్ధాలైన ప్రోటీన్లు , విటమిన్లు తోపాటు మిక్రోమాలిక్యూల్స్ ఉంటాయి. ఇటువంటి కొల్లాయిడ్ పదార్ధాలను వేడిచేసినపుడు అందులోవున్న పెద్ద అణువులు దగ్గరకు చేరి పీలికల్లా గడ్డలా తయారవుతాయి . అలా యేర్పడడాన్ని విరగడం అంటాం .కొల్లాయిడ్  స్థితిలో ఉన్న పాలు విరగడానికి పులుపు వంటి పదార్ధములు జోడవడము ఒక కారణము . ఎక్కువ సమయము నిలువ ఉన్నా పాలు విరుగుతాయి.పాలు పి.ఎచ్ (ph) మారడము వలన ఇలా జరుగుతుంది . పాలు ఎసిడిక్ పి.ఎచ్ వైపు మారినపుడు వాటి అణువుల అమరిక తేడా అవడము మూలంగా పీలికల్లా గడ్డలు గా తయారవుతుంది.


బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి?

                                     విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉన్నవన్నమాట. బంగారం (Au) పరమాణువుల్లో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహబంధాన్ని(metallic bond) ఏర్పరుచుకుంటాయి. అందువల్ల బంగారం చాలా స్థిరమైన లోహం. అంటే అది ప్రకృతిలో మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపలి పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే లభ్యమవుతుంది. అరుదుగా ఉండడం, వెలికి తీయడం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ ప్రాంతంలో కొన్ని బంగారపు గనులున్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా, రష్యాల్లో బాగా ఉన్నాయి.