గురుభక్తి
ద్వాపరయుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి వుండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదమభ్యసిస్తూ, ఆయనను శ్రద్ధతో సేవిస్తుండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి, మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తుండేవారు. అతని సేవనుబట్టి అతని గురుభక్తిని, మనశ్శుద్దినీ నిరూపించి అనుగ్రహించేవారు.
ఒకనాడు ధౌమ్యుడు, అరుణిని పిలిచి, 'నీవు మన పొలానికి వెళ్ళి, చెరువునుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది' అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువునుండి కాలువద్వారా నీరు పెట్టాడు. కాని కాలువకు ఒకచోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి, రాళ్ళు ఎంతవేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు, ప్రాణం పోయినా సరే, గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో, ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడా నీరు అతనిమీదుగా పొలానికి ప్రవహించింది. చీకటిపడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి, పొలం నిండుగా నీరుండడం గమనించారు. కాని శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి, ఆయన శిష్యునికోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధాన మీయలేక కొంచెంగా శబ్దం చేసాడు. దానినిబట్టి ధౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి,కౌగలించుకొని, సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్యమహర్షి, 'నాయన! నీవింటికి వెళ్ళి, తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు. కృతార్థుడవవుతావు' అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి యింటికి వెళ్ళి, లోకపూజ్యుడయ్యాడు.
ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, 'నాయనా! పై రు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరు కోసి, ధాన్యం యింటికి చేర్చు అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి, పైరునెంత జాగ్రత్తగా సంరక్షించి,పంట పక్వానికొచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగాపోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికొక బండి, ఒక దున్న పోతునూ యిచ్చి, ధాన్యం యింటికి చేర్చమని చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు తన భుజాన వేసుకొని ధాన్యం యింటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి, తానొక్కడే బండిని బురదలోనుండి లాగడానికి ప్రయత్నించి, ఆ శ్రమకోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి, అతని గురుసేవా దీక్షకు మెచ్చి, అతని మెడనుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి యింటికి పంపారు. కొద్దికాలం లోనే అతడు గూడ అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు.
ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తుండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది గాదు. ధౌమ్యుడు ఆలోచించి, ఒకరోజు అతనిని పిలిచి, 'నాయనా! నీవు గోవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూండు' అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, 'నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకూ గోవులను మేపాలి' అన్నారు. మరునాటి నుండి, ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి, సంధ్య వార్చుకుని, దగ్గరలోనున్న బ్రాహ్మణుల యిండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్దికాలానికి అతని శరీరానికి మంచి పుష్ఠి కల్గింది. అది గమనించిన ధౌమ్యుడు, ఒకరోజున అతనినడిగి కారణం తెలుసుకొని, 'నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా? నిత్యము నీవు తీసుకొచ్చిన భిక్ష నాకిచ్చి, మరల అడవికి పోయి ఆవులను మేపుకొనిరావాలి' అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతనిని యెంతగానో బాధించేది. తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకర్పించి, రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా వుండడం చూచి గురువు కారణం అడిగి తెలుసుకుని, ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచెమైనా బాధపడక అలానే చేసి, ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్దికాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది. ఒకరోజు ధౌమ్యులవారు అందుకు కారణము అడిగి తెలుసు కొని పశువుల ఎంగిలి పలు త్రాగితే నీవు కూడా పశువు వలె బుద్ధిహీనుడవవుతావు. కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలచి, వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది, అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెదుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు.
సూర్యాస్తమయమైనా శిష్యుడింటికి రాకపోయేసరికి, అతనిని వెదుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలో నుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని, అశ్వనీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టివచ్చింది. వెంటనే అతడు బావినుండి బయటకువచ్చి గురువుకు నమస్క రించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, 'నాయనా! నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు గూడ నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడనే శిష్యుడు తన గురుభక్తిచేత నాగలోకాన్ని జయించి, నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వత మొనర్చగలడు' అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై, యింటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యులవారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది.
Post a Comment