పంచతంత్ర కథలు

 పంచతంత్ర కథలు సంస్కృతంలో రాయబడ్డాయి. ముగ్గురు రాజకుమారులు ఆటలతో కాలక్షేపం చేస్తూ మూర్ఖంగా తిరుగుతుంటే వారిని బుద్ధిమంతులుగా చేయటానికి రాజు, విష్ణు శర్మ అనే గొప్ప గురువు దగ్గర ప్రాధేయపడగా ఆయన ఆ ముగ్గురు రాజకుమారులకు  కధల ద్వారా జీవితంలో ఎలా సంతోషంగా మరియు విజయవంతం కావాలో నేర్పించారు. పంచ అంటే ఐదు, తంత్రం అంటే తెలివిగా ప్రవర్తించటం.కధలు వినటానికి అందరూ ఇష్టపడతారు అందుకే విష్ణుశర్మ తన విద్యార్థులను కధల ద్వారానే బుద్ధిమంతులుగా మలిచారు. ఈ కధలను ఆయన జంతువులను పాత్రధారులుగా తీసుకొని బోధించటం జరిగింది.


కోతి-మొసలి

 

ఒక కోతి ఒక నది ప్రక్కన ఉన్నచెట్టుపై నివసిస్తూ ఉండేది. ఆ చెట్టుకు  ఏడాది పొడవునా పుష్కలంగా పండ్లు ఉండేవి. ఒక రోజు ఒక మొసలి నది నుండి బయటకు వచ్చి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది.

 "నీవెవరు?" అంటూ చెట్టు పైనుండి కోతి అరిచింది. మొసలి చెట్టు పై ఉన్న కోతిని చూసి, "నేను ఒక మొసలిని నేను చాలాసేపటి నుండి   ఆహారం కోసం తిరుగుతున్నాను." అని చెప్పింది.

 "ఆహారం కోసమా? నా దగ్గర  పళ్ళు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని తిని చూస్తావా. ఇవి  నీకు నచ్చితే కావలసినన్ని  ఇస్తాను." అని  చెప్పి, కోతి కొన్ని పళ్లను తెంచి  వాటిని మొసలి పైకి విసిరివేసింది.

 

మొసలి వాటిని తిని, "ఇవి చాలా బాగున్నాయి.  నా జీవితం లో ఇంత రుచికరమైన పళ్ళు నేను ఎప్పుడు తినలేదు " అని కోతి కి ధన్యవాదాలు తెలిపింది.కోతి మరిన్నిపళ్లను మొసలి పైకి విసిరివేసింది. మొసలి వాటిని అన్నింటినీ ఎంతో ఇష్టంగా తిని కోతితో మిత్రమా  నేను మళ్ళీ రావచ్చా? నాకోసం ఇంకొన్ని పండ్లు ఇవ్వగలవా అని ప్రాధేయపూర్వకంగా అడిగింది.

నీకు ఎల్లప్పుడూ స్వాగతం నీవు నా అతిథివి   అని కోతి చెప్పింది. మొసలి చాలా సంతోషించి మళ్ళీ వస్తానని చెప్పి కోతి దగ్గర సెలవు తీసుకుంది. మరుసటి రోజు మొసలి మరలా  వచ్చింది. కోతి మొసలిని  చూడగానే చాలా  సంతోషించి  తినడానికి ఇంకా ఎక్కువ పళ్లను ఇచ్చింది. ఈ విధంగా కోతి, మొసలి స్నేహితులు అయ్యాయి.

 

ప్రతి రోజు మొసలి కోతి దగ్గరకు వచ్చేది  అవి  ఎక్కువ సమయం కలిసి గడిపేవి.  తమకు సంబంధించిన  ప్రతి దాని గురించి మాట్లాడుకునేవి. ఒక రోజు అవి  తమ కుటుంబాలు, స్నేహితుల గురించి మాట్లాడుకున్నాయి  . అప్పుడు కోతి తాను ఇప్పటిదాకా ఒంటరిగా ఉన్నానని, నీవంటి స్నేహితుడు దొరకటం నా  అదృష్టమని చెప్పి చాలా సంతోషించింది. మొసలి తన భార్యతో కలిసి నదికి అవతలి వైపు నివసిస్తున్నట్లు కోతికి చెప్పింది.

 

కోతి మొసలి తో నీకు భార్య వుందా? అని అడిగింది. మొసలి అవును అని సమాధానం చెప్పింది.సరే అయితే  అని కోతి చాలా పళ్లను కోసి మొసలికి ఇచ్చింది. కోతి ఇచ్చిన బహుమతితో మొసలి ఇంటికి వెళ్ళింది. ఆడ మొసలి పళ్లను చాలా ఇష్టపడింది. కానీ ఆడమొసలికి తన భర్త ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా రావడం నచ్చలేదు.  ఒక రోజు మగ మొసలితో  మొసళ్ళు కోతులను చంపి  తింటాయి. కానీ నువ్వు ఆ కోతి సహవాసంలో ఎలా ఎక్కువ సమయం గడపగలుగుతున్నావు? అని అడిగింది.అప్పుడు మగ ముసలి నీవు చెప్పింది నిజమే గాని మేము మంచిమిత్రులం అయ్యాము కాబట్టి నాకు అటువంటి ఆలోచన లేదు అని చెప్పింది.

 కోతి ఈ తీపి పళ్లను మాత్రమే తింటుంటే దాని గుండె ఇంకా తీపిగా ఉండి ఉండాలి. నేను ఆ కోతిని  ఇక్కడకు తెప్పించుకోగలిగితే అది  నాకు  అత్యంత రుచికరమైన విందు అవుతుంది అని ఆడ మొసలి అనుకుంది. అందుకని మగ మొసలి తో అనారోగ్యంగా ఉన్నట్లు నటించి తనకు వచ్చిన వ్యాధి కోతి గుండె తింటే మాత్రమే తగ్గుతుందని లేకపోతే చనిపోతానని కన్నీరు కార్చింది.

మగ మొసలికి ఏం చేయాలో ఏమి తోచలేదు.అందువల్ల మౌనంగా వుండిపోయింది.కానీ ఆడమొసలి బాధ చూడలేక ఎలాగైనా కోతిని తేవాలని నిర్ణయించుకొంది. మరుసటి రోజు కొంచెం ఆలస్యంగా చెట్టుదగ్గరికి వచ్చింది.

కోతి మొసలిని  చూడగానే, "ఏం, మిత్రమా, నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు ? దారిలో ఏమైనా ప్రమాదం జరిగిందా?" అని అడిగింది.

అప్పుడు మొసలి నేను నీ భార్యతో గొడవపడ్డాను నిన్ను ఎలాగైనా మా ఇంటికి తెస్తానని నేను తేలేనని నా భార్య గొడవ పడ్డాం అందుకే ఆలస్యం అయ్యింది.నా భార్య చేతిలో నా పరువు నిలుపుతావుగా మిత్రమా అని దీనంగా అడిగింది.

అప్పుడు కోతి నీ కోసం ఆ మాత్రం చేయలేనా కానీ నేను నదిలో ఈదలేను మరి అవతలి ఒడ్డుకు ఎలా వచ్చేది అని అడిగింది. దానికి మొసలి నేను ఇది ముందే ఆలోచించాను మిత్రమా నీవు నా వీపు పైన కూర్చో నేను ఈదుకుంటూ అవతలి ఒడ్డు కు నిన్ను తెసుకుపోతాను అని చెప్పింది.అయితే సరే అని కోతి మొసలి వీపు పై ఎక్కి కూర్చొంది.

  మొసలి ఈదుకుంటూ నది మధ్యకు వచ్చింది.ఇక కోతి తప్పించుకుపోలేదులే అని కోతికి నిజం చెప్పింది. మిత్రమా నా భార్య చావుబ్రతుకుల్లో వుంది తన ఆరోగ్యం ఏమి బాగోలేదు కోతి గుండె తింటే గాని ఆరోగ్యం కుదుటపడదట అందుకే నిన్ను తీసుకుపోతున్నాను అని చెప్పింది. కోతికి గుండె ఆగినంత పని అయ్యింది. కానీ మెల్లగా తేరుకొని ఆడమొసలి నన్ను తినటం కోసం ఇలా మోసం చేస్తుంది అని గ్రహించింది. ఉపాయం  ఒకటి ఆలోచించుకుంది.

  అప్పుడు మొసలి తో మిత్రమా నాకు నీవు తప్ప ఎవరు వున్నారు. నా గుండె నీ కోసం ఇవ్వలేన అంటూ నిట్టూర్చింది. అప్పుడు మొసలి ఏమైంది మిత్రమా చెప్పు అని అడిగింది.

   అప్పుడు కోతి, మా కోతి జాతి లో ఎవరు పగటి పూట గుండెను తమ దగ్గర వుంచుకోరు నేను కూడా అలాగే నా గుండెను తీసి నేనుంటున్న చెట్టు కొమ్మకి తగిలించి వుంచాను రాత్రికి మరలా నాలో పెట్టుకుంటాను నీవు ఈ విషయం ముందే చెప్పినట్లయితే నాతో తెచ్చేదానిని అని చెప్పి బాధ పడింది.

   ఇప్పటికీ అయిన నష్టం లేదు నీవు మరలా చెట్టు దగ్గరకు పద నేను నా గుండెను తీసి నీకిస్తాను  అని చెప్పింది. సరే మిత్రమా అని మొసలి మరలా చెట్టు దగ్గరకు వచ్చింది.

 అవి  అక్కడికి చేరుకోగానే కోతి దూకి చెట్టు పైకి వేగంగా దూసుకెళ్లింది. ఎత్తైన కొమ్మపై హాయిగా కూర్చొని ఎదురు చూస్తూ  ఉన్న  మొసలి వైపు చూస్తూ, "ఇప్పుడు నువ్వు  ఒంటరిగా నీ  దుష్ట భార్య వద్దకు తిరిగి వెళ్ళు ఎవరైనా గుండెను చెట్టుకు తగిలిస్తారా పిచ్చివాడ అంటూ బిగ్గరగా నవ్వసాగింది.

మొసలి చేసిన తప్పుకు చింతిస్తూ వెనుకకు తిరిగింది.

సింహం-కుందేలు

 

చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక పెద్ద సింహం నివసిస్తూ వుండేది. ప్రతిరోజూ అది  కనపడిన జంతువునల్లా చంపి తినేది. అందువల్ల అడవిలో వున్న జంతువులన్నీ చాలా బయపడుతూ ఏరోజూ కారోజు ఇదే తమ చివరి రోజు అన్నట్లు బ్రతకసాగేవి.ఇలా అయితే బ్రతకటం కష్టమని భావించి జంతువులన్నీ సమావేశం అయ్యాయి. ఒక్కో రోజు ఒక్కో జంతువును సింహానికి ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి.అప్పుడు మిగతా జంతువులు ప్రశాంతంగా వుంటాయని అవి అలా ఆలోచించాయి.

 మరుసటి రోజు పెద్ద సంఖ్యలో జంతువులు అన్నీ  సింహం వద్దకు వెళ్ళాయి. వాటిని చూసి సింహం ఆశ్చర్య పోయింది. ఇవి నా దగ్గరకు ఇంత ధైర్యంగా వస్తున్నాయేన్టి  అని బిగ్గరగా గర్జించింది.అన్నీ జంతువులు ఆ గర్జనకు భయపడి కనపడిన పొదలలోకి దూరి దాంకున్నాయి. కొంతసేపటికి ధైర్యం చేసి మెల్లగా అన్నీ సింహం దగ్గరకు వచ్చాయి.

        అవి మెల్లగా సింహం తో రాజ మీరు ఈ అడవికి రాజు మేము బానిసలం. మీరు మమ్మల్ని చంపడానికి ప్రయత్నించే ముందు దయచేసి మేము చెప్పేది వినండి. మీరు ఇలా కనబడిన జంతువునల్లా చంపుతూ పోతే మేము అందరం చనిపోతాం. అప్పుడు మీరు వేటిని తింటారు అని అన్నాయి. సింహం ఆలోచించింది మీరు చెప్పేది నిజమే కానీ నేను మీలాగా గడ్డి తిని బ్రతకలేనుగా నేను వేటాడే బ్రతకాలి కదా అని అన్నది.

రాజ మేమందరం దీని గురించి ఆలోచించాం మీరు ఎప్పుడూ ఈ గుహలోనే  ఉండండి. మీ ఆహారం కోసం మేము ప్రతిరోజూ ఒక జంతువును పంపుతాము. మీరు ఆహారం కోసం ఇకపై వేటాడవలసిన అవసరం లేదు  మీ దగ్గరకే  ఆహారం వస్తుంది. అందువల్ల మీరు మేము ప్రశాంతంగా ఈ అడవిలో జీవించగలుగుతాము అని చెప్పాయి.

 సింహం వారందరూ చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించింది. మీరు ప్రతిపాదించిన దానిలో కొంత నిజం  ఉంది. నేను మీరు చెప్పిన దానికి  అంగీకరిస్తున్నాను. కానీ, మీరు ఏ రోజునైనా నా ఆహారాన్ని నాకు పంపించకపోతే అప్పుడు నేను అన్నిటిని చంపుతానుఅంది. జంతువులు అన్ని అలా జరగదని తప్పకుండ ఆహారాన్ని పంపిస్తామని  వాగ్దానం చేశాయి. ఆ రోజు నుండి, ప్రతి రోజు, ఒక జంతువు సింహం వద్దకు ఆహారంగా వెళ్ళేది. దానిని సింహం తినేది.

 ఇలా చాలా రోజుల పాటుసాగింది. ఒక రోజు కుందేళ్ళ వంతు వచ్చింది. ఒక చిన్న కుందేలును  సింహం వద్దకు వెళ్ళమని చెప్పారు. ఈ కుందేలు చాలా తెలివైనది.  తనని సింహం చంపి తినటం అనే ఆలోచన నచ్చలేదు. తనను తాను రక్షించుకోవడానికి ఒక మార్గం ఆలోచించాలి వీలైతే ఇతర జంతువుల ప్రాణాలు కూడా కాపాడాలి అని అనుకొంది.

చాలాసేపు ఆలోచించింది  చివరికి ఒక ఉపాయం దొరికింది. కుందేలు సింహం గుహకు బయలుదేరింది. నిదానంగా పాటలు పాడుకుంటూ సింహం దగ్గరకు ఆలస్యం గా వెళ్లింది.

 కుందేలు వచ్చే సమయానికి సింహం చాలా ఆకలితో ఉంది, ఒక చిన్న జంతువు తన ఆహారం గా రావడం చూసి దానికి చాలా  కోపం వచ్చింది. "నిన్ను ఎవరు ఇక్కడకు పంపారు? నీవు నా భోజనానికి ఎలా సరిపోతావు అదీకాక చాలా ఆలస్యంగా వచ్చావు. నిన్ను  ఇక్కడికి పంపించిన అన్ని జంతువులకు నేను ఒక పాఠం నేర్పుతాను. నేను వాటిని అన్నింటిని చంపుతాను." అని గర్జించింది.

 చిన్న కుందేలు వంగి, ", గొప్ప రాజు, దయచేసి నా మాట వినండి. ఏమి జరిగిందో తెలిస్తే మీరు నన్ను మరియు ఇతర జంతువులను నిందించరు. ఒక కుందేలు మీకు ఆహారంగా సరిపోదని వాటికి తెలుసు. మొత్తం ఆరు కుందేళ్ళను మీకోసం ఆహారంగా పంపాయి.కానీ మేము వచ్చే దారిలో ఒక పెద్ద సింహం మమ్మలను ఆపి మిగతా అయిదింటిని తినేసింది.నేను ఎలాగో  తప్పించుకొని ఈ విషయం మీకు చెప్పటానికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు సింహం నేను కాక "మరొక సింహమా? అది ఎవరు? నీవు దాన్ని ఎక్కడ చూశావు?" అని గర్జించింది.అది చాలా పెద్ద సింహం. అది ఒక పెద్ద గుహ నుండి బయటకు వచ్చింది అని కుందేలు చెప్పింది. సరే పద

ఆ మూర్ఖుడు నివసించే ప్రదేశానికి దోవ  చూపించు అన్నాడు నేను గాక ఈ అడవిలో ఇంకో రాజ నేను అసలు ఒప్పుకోను దానిని చీల్చి చెండాడతాను దానిని చూసి చంపేవరకు నాకు శాంతి ఉండదు అని  సింహం కోపంతో బయలుదేరింది.

"నాకు దోవ చూపించు,"  "నాకు దోవ  చూపించు." అని సింహం గర్జించ సాగింది.

 

“దయచేసి నాతో రండి."అంటూ  కుందేలు సింహాన్ని అడవిలోని బావి వద్దకు తీసుకుపోయింది. "అక్కడ, నా ప్రభూ," అతను ఈ కోటలో ఉంటాడు జాగ్రత్తగా ఉండండి అని పక్కకి వెళ్లింది. అది ఎక్కడ వుంది? "" నేను దానిని చూసినప్పుడు అది ఇక్కడే ఉంది "అని కుందేలు చెప్పింది. మీరు రావటం చూసి లోపల దాంకోని వుంటుంది. రండి చూపిస్తాను.అని బావి దగ్గరకు వెళ్లి సింహాన్ని కిందికి చూడమని కోరింది. సింహం బావిలోకి చూస్తే నీటిలో తన ప్రతిబింబం ప్రతిబింబిస్తోంది. అది చూసి సింహం

కోపంతో గర్జించింది. బావి లోపలి నుండి బిగ్గరగా గర్జన వచ్చింది. సింహం తన స్వరం యొక్క ప్రతిధ్వనిని విన్నది మరియు అది ఇతర సింహం యొక్క గర్జన అని అనుకుంది. ఒక్క క్షణం కూడా ఆగకుండా బావిలోకి దూకింది. సింహం  అలా నీళ్ళలోకి దూకి  మునిగి పోయి చనిపోయింది.

చిన్న కుందేలు ఇంటికి తిరిగి వచ్చి తాను చేసిన పని జంతువులన్నింటికి చెప్పింది. అలా జంతువులు  ఆ భయంకరమైన  సింహం నుండి కుందేలు తెలివి తేటల వల్ల బయటపడ్డాయి.

కొంగ - పీత

 

ఒక చెరువు  దగ్గర కొంగ నివసిస్తూ ఉండేది. చెరువులో చేపలు పుష్కలంగా ఉండటంవల్ల కొంగకు ఆహారానికి ఏ లోటు లేకుండా గడిచిపోయేది. సంవత్సరాలు గడిచాయి. కొంగ వయస్సు పెరిగింది మరియు బలహీనంగా మారింది. అందువల్ల  తన ఆహారం కోసం కావలసినన్ని  చేపలన్నింటినీ పట్టుకోవడం కష్టమైంది. కొన్ని సమయాల్లో  ఆహారం లేకుండా గడపవలసి వచ్చేది. తను ఆకలితో చనిపోతానని కొంగ భయపడింది.

 

కొంగ ఒక ఉపాయం ఆలోచించింది.  కళ్ళు మూసుకొని ఒక కాలుపై చెరువు లో  విచారంగా నిల్చుంది. తనను దాటిన చేపలను కూడా పట్టుకోవడానికి అది ప్రయత్నించలేదు. చెరువులోని చేపలు, కప్పలు మరియు పీతలు కొంగ  విచారంగా ఉండడాన్ని  గమనించాయి. ఒక పెద్ద పీత కొంగ  దగ్గరకు వెళ్లి,  ఎందుకు నీవు విచారంగా ఉన్నావు? నీవు  ఆహారాన్ని కూడా ఎందుకు తీసుకోవటంలేదు? అని అడిగింది.

 

నేను నా జీవితమంతా ఈ చెరువు పక్కనే గడిపాను. నేను ఎప్పుడూ సంతోషంగా ఉన్నాను. కానీ త్వరలో చనిపోబోతున్నాను ముసలివాడిని అయ్యాను కదా కానీ నా బాదంతా ఈ చెరువులో నివసించే జీవుల గురించే ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. ఈ చెరువులోని చేపలన్నీ త్వరలో చనిపోతాయి అని కొంగ విచారంగా సమాధానం చెప్పింది. ఎందుకు,అలా జరుగుతుంది అని  పీత అడిగింది.

ఎందుకంటే ఇక్కడ దగ్గర లోని ఊరి ప్రజలు త్వరలోనే ఈ చెరువును మట్టితో నింపి పంటలు పండిద్దాం అని అనుకుంటుంటే నేను విన్నాను. అలా మట్టితో నింపితే ఇందులో నివసించేవి ఏవి సజీవంగా ఉండవు.

చెరువులోని చేపలు, పీతలు మరియు కప్పలు కొంగ చెప్పిన మాటలు విన్నాయి. అవి కొంగ చెప్పే మాటలు  నిజం అనుకున్నాయి. కాబట్టి అవి  కొంగ వద్దకు వెళ్లి మీరు మాకు రాబోయే ప్రమాదం గురించి చెప్పారు. మీరు తెలివైనవారు,పెద్దవారు. దయచేసి ఈ ప్రమాదం నుండి తప్పించుకునే  ఉపాయం మాకు చెప్పండి అని దీనంగా అడిగాయి.

అప్పుడు ఆ జిత్తులమారి కొంగ, నేను ఒక పక్షిని  మాత్రమే. అయిన, నేను మీకు ఒక చిన్న సహాయం చేయగలను. ఇక్కడికి కొంత దూరంలో ఒక లోతైన చెరువు ఉంది. దాన్ని అంత తేలికగా పూడ్చలేరు. మీకు కావాలంటే, నేను మీ అందరినీ అక్కడికి తీసుకెళ్లగలను. మీరు మా ఏకైక శ్రేయోభిలాషి మీరు మమ్మల్ని రక్షించగలరు. దయచేసి మీరు మమ్మల్ని ఆ చెరువు దగ్గరకు తీసుకెళ్లండి అని చేపలు అన్నాయి.

 

అప్పుడు కొంగ  ఇది చాలా కష్టంతో కూడుకున్న పని . అయినా  నేను నా వంతు కృషి చేస్తాను అని చెప్పింది. నన్ను మొదట తీసుకు పోండి, మొదట నన్ను తీసుకు పోండి అని చెరువులోని ప్రతి చేప అరిచింది. అప్పుడు కొంగ దయచేసి మీరంతా  ఓపిక పట్టండి, నేను ఒకేసారి కొన్నింటిని మాత్రమే మోయగలను. కానీ నేను రోజులో  వీలైనన్ని ఎక్కువసార్లు  మిమ్మల్ని తీసుకుపోవటానికి  ప్రయత్నిస్తాను. నేను ఇప్పుడు వయస్సుమళ్లిన ముసలివాడిని అని మీరు తెలుసుకోవాలి అందువల్ల  ఒకసారి పోయొచ్చాక  నాకు కొంచెం విశ్రాంతి కావాలి. లేకపోతే నేను ఎగరలేను.

 కొంగ తన మొదటి యాత్రకు బయలుదేరింది. అది తన ముక్కులో కొన్ని చేపలను తీసుకొని బయలుదేరింది. అయిన, అది  వాగ్దానం చేసినట్లుగా వాటిని మరొక చెరువుకు తీసుకెళ్లలేదు, ముందే వేసుకున్న పధకం ప్రకారం  వాటిని ఒక పెద్ద రాతి వద్దకు తీసుకువెళ్లింది. అక్కడ  వాటిని తినేసింది. తరువాత మరలా చెరువు వద్దకు తిరిగి వచ్చింది.  మరికొన్ని చేపలను తీసుకుని  వాటినీ బండరాయి దగ్గరకు  తీసుకుపోయి తినేసింది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఆకలితో ఉన్నప్పుడు,  మరికొన్ని చేపల కోసం  తిరిగి చెరువు వద్దకు వెళ్లింది. అన్నీ అయిపోగా చివరికి చెరువులో పెద్ద పీత మాత్రమే మిగిలింది. పీత  కూడా ఆ చెరువును  వదిలి తనను తాను రక్షించుకోవాలని అనుకుంది. అందువల్ల అది కొంగతో,అయ్యా నన్ను కూడా దయచేసి వాటి దగ్గరకు తీసుకుపోండి అని అడిగింది.

 అప్పుడు కొంగ మనసులో ఇప్పటిదాకా చేపలు  తిని తిని  అలసిపోయాను  మార్పు కోసం ఒక పీతను ప్రయత్నించవచ్చని అనుకుంది.

నేను మీకు సహాయం చేయడానికే ఇక్కడ ఉన్నాను. రా, నేను నిన్ను ఆ  పెద్ద చెరువు వద్దకు తీసుకువెళతాను అంది  కొంగ. పీత చాలా సంతోషించింది. కానీ నాదొక విన్నపం నీవు నన్ను తీసుకుపోయేటప్పుడు నీ ముక్కు తో  నన్ను తీసుకుపోవద్దు.నేను నీ మెడ పట్టుకుని ఉంటాను అంది దానికి కొంగ సరే అంది.తనని తీసుకుపోయేటప్పుడు పీత క్రిందికి చూసింది. ఎక్కడ నీటి జాడ కనపడలేదు.అందుకని అది కొంగతో అయ్యా

మీరు నన్ను తీసుకెళ్తున్న పెద్ద చెరువు ఎక్కడ ఉంది?అని అడిగింది"అక్కడ ఉన్న భారీ రాతిని నువ్వు  చూడలేదా? అదే నేను నిన్ను తీసుకెళ్తున్న ప్రదేశం. నేను చేపలన్నింటినీ తీసుకెళ్లిన ప్రదేశం కూడా  అదే. అని చెప్పి  "హా, హా, హ" అంటూ కొంగ నవ్వింది.

పీత ఇప్పుడు రాతిని స్పష్టంగా చూడగలిగింది. బండపై చేపల ఎముకలు ఉన్నాయి. దానికి చాలా భయం వేసింది. అప్పుడు పీత మనస్సు లో ఇది  అన్ని చేపలతో చేసినట్లుగా  రాతిపైకి దిగి, నన్ను కూడా చంపుతుంది అని అనుకుంది.

పీత గట్టిగా ఆలోచించి   తన పదునైన పంజాలను కొంగ మెడలోకి దించింది. కొంగ రెక్కలు పీత నుండి బయటపడటానికి తన వంతు ప్రయత్నం చేసింది. కానీ వల్ల కాలేదు కాసేపటికికొంగ నేలమీద పడింది. పీత కొంగ యొక్క శరీరం నుండి తలను కత్తిరించివేసింది.ఆ విధంగా పీత కొంగ నుండి తప్పించుకొంది.