పిచ్చి సుబ్బయ్య
అనగనగా ఒక గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు.అతను కష్టపడి పని చేస్తాడే గాని అమాయకంగా ఉండేవాడు.అందువల్ల అతని చేత పని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం లేకపోతే తక్కువ ఇవ్వటం చేసేవారు.కానీ ఇతను ఎదురు తిరిగి అడిగేవాడు కాదు.ఊర్లో అందరూ సుబ్బయ్య ను తిక్కల సుబ్బయ్య అని పిచ్చి సుబ్బయ్య అని పిలిచేవారు అయిన ఇది అతను పట్టించుకునేవాడు కాదు.
కొంతకాలానికి సుబ్బయ్య కి పెళ్లి జరిగింది గంత కి తగ్గ బొంతల ఆమె కూడా అమయకురాలే పేరు సుబ్బమ్మ.అలా అలా వారి జీవితం సాగి పోతూ ఉంది.
ఒకసారి ఆ గ్రామం లో రాజు గారి ఆదేశాల మేరకు ఆ ఊరి పెద్ద అందరికి వ్యవసాయనికి గాను స్థలాలు పంచుతూ ఉన్నాడు.పాపం ఇది తెలియని సుబ్బయ్య ఇంట్లో నిద్ర పోతూ వున్నాడు.సాయంత్రం అరుగు మీద కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటుంది విని అప్పుడు బయలుదేరి గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తను వ్యవసాయం చేసుకోవటానికి పొలం ఇవ్వమని అడిగాడు.అప్పుడు గ్రామ పెద్ద బిగ్గరగా నవ్వి ఓరి పిచ్చోడా ఇప్పుడు వచ్చి అడిగితే ఎక్కడి నుంచి ఇచ్చేది వెళ్లు వెళ్ళు అన్నాడు.
ఇంటికి వెళితే తన భార్య తిడుతుందని భయపడి సుబ్బయ్య అక్కడే వున్నాడు. కొంతసేపటికి గ్రామ పెద్ద వీడు ఇక వెళ్ళడు అని ఆనుకొని ఊరి చివర పొలం ఉంది తీసుకుంటావా అని అడిగాడు.సుబ్బయ్య సరే అన్నాడు.అది స్మశానం పక్కన భూమి కావటం తో ఎవరు తీసుకోక మిగిలిపోయింది.
మరుసటి రోజు పొద్దునే సుబ్బయ్య, సుబ్బమ్మ పలుగు, పార పట్టుకొని పొలానికి బయలుదేరారు.పిచ్చిమొక్కలు, పెద్ద పెద్ద రాళ్లు అన్ని వేరేసి పొలాన్ని బాగు చేశారు.పొలంలో మొక్కజొన్న నాటారు.కొంతకాలానికి పొలం లో పంట బాగా పెరిగింది.కంకులు కూడా రావడం ప్రారంభమయ్యింది.కానీ ఒకరోజు ఉదయం భార్యాభర్తలు వెళ్ళిచూసే సరికి ఒకవైపు పంటను ఏవో తిన్నట్టు అనిపించింది.అందుకని పొలంలో మంచె వేసుకుని అక్కడే కాపలా ఉండాలని సుబ్బయ్య నిర్ణయించుకున్నాడు.
మరుసటి రోజు అర్ధరాత్రి దాకా మేల్కొని గమనిస్తూనే వున్నాడు.ఏమి రాకపోవడంతో నిద్రపోయాడు కానీ ఉదయం లేచి చూసేసరికి మరల ఇంకో పక్క పంటను తిన్నట్టు అనిపించింది.ఉదయం అంత చూసాడు ఏమి రాలేదు మరల రాత్రి అర్ధరాత్రి దాటేదాకా చూసి నిద్రపోయాడు.మరల ఉదయం లేచిచూస్తే అలాగే పంట ఒకవైపు తిని ఉంది.ఇక లాభం లేదు ఈరోజు అదేదో ఎలాగైనా తెలుసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
ఆరోజు రాత్రి 4 గంటల వరకు ఎటువంటి అలికిడి లేదు సుబ్బయ్య కళ్ళు మూతలు పడుతున్నాయి అప్పుడే తెల్లటి ఆకారం పైనుండి కిందకు దిగి రావటం చూసాడు.భయం వేసింది దుప్పటి కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకొని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ పడుకున్నాడు.కొంతసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి అది ఏమిటా అని చూసాడు.ఏదో తింటున్నట్టు అలికిడి అయ్యింది మెల్లగా మంచె దిగి అటువైపు వెళ్ళాడు.తెల్లటి రెక్కల గుఱ్ఱం తింటూ కనిపించింది.కొడదామని కర్ర పైకి ఎత్తే లోపు అది మెల్లగా పైకి ఎగరటం ప్రారంభించింది.గబుక్కున దాని తోక గట్టిగా పట్టుకున్నాడు.
అది అలా పైకి వెళుతూ ఉంది సుబ్బయ్య దాని తోక ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.అది అలా వెళ్లి ఏదో లోకంలో ఆగింది.సుబ్బయ్య చుట్టూ చూశాడు ఆలోకం చాలా అందం గా ఉంది.ఒక చోట రత్నాలు, వజ్రాలు, బంగారం రాశులుగా పోసివున్నాయి.అవి చూడగానే సుబ్బయ్య కళ్ళు మిల మిల మెరిసిపోయాయి.అవి ఎలా మూట కట్టాల అని ఆలోచించి తన పంచె తీసి దానిలో వాటిని మూటలా కట్టిపెట్టి మరల ఆ గుఱ్ఱం ఎప్పుడు కిందకు వెళుతుందా అని ఎదురు చూడసాగాడు.ఆ గుఱ్ఱం రాగానే మరలా దాని తోక పట్టుకొని తన పొలానికి చేరుకున్నాడు. ఆ మూట తీసుకుని ఇంటికి రాగానే సుబ్బమ్మ ఎక్కడికి పోయావు పొలం దగ్గర లేకుండా అని అడిగింది.
అది తర్వాత చెపుతా గాని లోపలికి పద అని ఇంటిలోకి వెళ్ళాక సుబ్బమ్మ కు జరిగినది అంత చెప్పి వజ్రాలు,రత్నాలు కొలవటానికి మానిక ని తెమ్మని సుబ్బిశెట్టి ఇంటికి పంపాడు. సుబ్బిశెట్టి అంత పొద్దునే ఎవరు అని బయటికి వచ్చి చూసి సుబ్బమ్మ మానిక అడగడం తో అనుమానం వచ్చి దాని అడుగున చింతపండు పెట్టి ఇచ్చాడు. ఇంటికి వచ్చాక ఇద్దరు సుబ్బయ్య తెచ్చిన దానిని కొలిచారు. తరువాత సుబ్బిశెట్టి మానిక ఇవ్వటానికి సుబ్బయ్య వెళ్ళాడు.సుబ్బిశెట్టి మానిక తీసుకొని అడుగున చూసాడు దానికి ఒక వజ్రం అంటుకొని ఉంది.వెంటనే సుబ్బయ్య నిజం చెప్పు ఎక్కడిది నీకింత ధనం అని అడిగాడు. సుబ్బయ్య ఏమి ధనం అన్నాడు.నాకు తెలుసు నిజం చెప్పు సుబ్బయ్య అని నిదానంగా అడిగాడు. సుబ్బయ్య పాపం జరింగిందంతా చెప్పేశాడు. అయితే నన్ను తీసుకెళతావా అని అడిగాడు.ఓ అలానే తీసుకెళ్తా అన్నాడు సుబ్బయ్య.
ఆ రోజు రాత్రి సుబ్బయ్య పొలం దగ్గరికి బయలు దేరుతున్నప్పుడు ఊరిలో వారందరూ బయలుదేరారు పెద్ద, పెద్ద గోతాలు, సంచులు తీసుకొని సుబ్బయ్య కు ఇంతమంది కి ఎలా తెలిసిందో అర్ధం కాలేదు సుబ్బమ్మ వంక చూశాడు. సుబ్బమ్మ నాకేమి తెలియదు నేను రంగమ్మ కి,కోటమ్మ కే చెప్పాను ఎవరికి చెప్పలేదు అంది. పక్కవారికి తెలిశాక రహస్యం ఆగుతుందా అలా ఊరంతా తెలిసిపోయింది.అందరూ గుఱ్ఱం కోసం ఆకాశం వైపు చూస్తూ వున్నారు.కొంతసేపటికి గుఱ్ఱం వచ్చి మొక్కజొన్న పంటను తినటం ప్రారంభించింది.
అది మరలా పైకి పోయేటప్పుడు ముందు సుబ్బయ్య దాని తోక పట్టుకున్నాడు.సుబ్బయ్య కాళ్ళు వేరొకళ్ళు,అలా ఒకరి కాళ్ళు ఒకరు పెట్టుకుంటూ అందరూ పైకి వెళ్ళటం ప్రారంభించారు చివరిలో సుబ్బిశెట్టి మిగిలాడు.
సుబ్బిశెట్టి పైన ఉన్న సుబ్బయ్యను అరే సుబ్బయ్య ఈసారి ఎంత ధనం తీసుకొస్తావురా అని అడిగాడు.సుబ్బయ్య తన చేతులను పూర్తిగా చాపి ఇంత తెచ్చుకుంటాను అన్నాడు.సుబ్బయ్య తోక వదిలి వేయటం తో అందరూ అంత పై నుండి సుబ్బిశెట్టి పైన దబ్బున పడ్డారు.
Post a Comment