adrushtam
అదృష్టం
అనగనగా ఒక ఊరిలో కోటమ్మ అనే
ఆవిడ నివసిస్తూ వుండేది.ఆమెకు ఒక్కగానొక్క కొడుకు పేరు శివయ్య తండ్రి చిన్నప్పుడే చనిపోవటం వల్ల అతనిని గారాబంగా
పెంచింది.రోజు కూలీనాలీ చేసి అతన్ని పెద్దవాడిని చేసింది.అతిగారాబం వల్ల శివయ్య
బద్దకంగా,లావుగా తయారయ్యాడు.ఏ పని చేయకుండా తిని తిరుగుతుండేవాడు. ఇలా అయితే తనకి బాధ్యత తెలియదని
పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని అందరూ చెప్తుంటే విని కోటమ్మ ఆ పక్కవూరిలోనే ఒక
సంబంధం చూసి వెంకమ్మ అనే అమ్మాయితో పెళ్లిచేసింది.కానీ శివయ్యలో ఎటువంటి మార్పు
రాలేదు. అత్తాకోడళ్ళు ఇద్దరు పనిచేసి తెస్తే తినేవాడు.
ఎలా చేయాలి ఇలా అయితే అని
ఆమె ఎంతో బాధపడుతుండేది. ఇవన్నీ శివయ్యకి ఏం
పట్టేవి కాదు. ఒకరోజు కోటమ్మ, శివయ్య తో అబ్బాయి నాకు వయసు అయిపోతుంది
ఇంక నేను పని చేయాలంటే కష్టం నీవు ఇలా తిని కూర్చొంటే కుటుంబం ఎలా గడుస్తుంది అని
బోరున ఏడ్చింది. దానికి శివయ్య ఏం చేయమంటావు అమ్మ నాకు ఏ పని రాదు ఎలా చేసేది
అన్నాడు. సరే అయితే మేము గారెలు చేసి ఇస్తాము నీవు ఊరిలోకి పోయి అమ్ముకొనిరా అని
చెప్పింది కోటమ్మ.సరే అమ్మ అలానే చేస్తాను అన్నాడు శివయ్య.
ఉదయాన్నే అత్తాకోడళ్ళు లేచి
గారెలు చేసి ఒక పెద్ద బుట్టలో పెట్టి శివయ్య నెత్తి మీద పెట్టారు అవి తీసుకొని శివయ్య
ఊరి లోకి బయలుదేరాడు. అతనికి ఈ పని కొత్త
కావటంతో గారెలు అని అరవకుండా బుట్ట నెత్తిన పెట్టుకొని పోతూ వున్నాడు .అది ఏంటి అని ఎవరు అడగలేదు. అలా అలా నడుచుకుంటూ ఊరి చివర
చెరువు దాకా పోయాడు.సూర్యుడు నడినెత్తిమీద వున్నాడు బాగా ఎండ గా వుండటంతో చెరువు
పక్కన చింతచెట్టు కింద బుట్ట దించి కూర్చొన్నాడు. కింద పెట్టగానే ఆ గారెలవాసన ముక్కులకు
తగలడంతో శివయ్యకు ఆకలి వేయటం ప్రారంబించింది. గారెలు బాగా రుచిగా వుండటంతో ఒక్కోటిగా
మొత్తం తినేశాడు.పక్కనే వున్న చెరువులో నీరు తాగి చెట్టు కింద పడుకొని
నిద్రపోయాడు. సాయంత్రానికి మెలుకువ వచ్చింది. లేచి బుట్ట తీసుకుని ఇంటికి
బయలుదేరాడు.తన కొడుకు ఎంత కష్టపడి అమ్మివస్తున్నాడో అని కోటమ్మ, శివయ్య కోసం
చూడసాగింది.చీకటి పడే సమయానికి ఇంటికి వచ్చిన కొడుకుని అన్నీ అమ్ముడు పోయాయా అయ్యా
అని అడిగింది.
శివయ్య లేదమ్మ అన్నాడు
అయితే మరి గారెలు ఏవి అని అడిగింది ఎవరు గారెలు అడగలేదమ్మ మధ్యాహ్నం దాకా ఊరంతా
తిరిగాను చివరకు ఆకలి అయ్యి అన్నీ తినేశానమ్మ అన్నాడు. వాళ్ళు అడగాలంటే నువ్వు
గారెలు అమ్మటానికి వచ్చావని వాళ్ళకు తెలియాలికద అని వెంకమ్మ తిట్టింది.సరే
అయిందేదో అయ్యింది రేపు జాగ్రత్తగా అమ్ముకుని రా, అందరికీ వినపడేటట్లు పెద్దగా
అరువు అని కోటమ్మ చెప్పింది సరే అమ్మ అన్నాడు శివయ్య.ఆ రోజు రాత్రికి బియ్యం నానపోసి తెల్లవారక ముందే లేచి ఆ బియ్యం రోటిలో వేసి దంచసాగారు
అత్తాకోడళ్ళు.ఆ మసక చీకటిలో ఆ రోట్లో పాముని వాళ్ళు గమనించలేదు.ఉదయం అయ్యేసరికి
బూరెలు చేసి బుట్టలో పెట్టారు.బూరెల వాసన చూడగానే శివయ్యకు నోట్లో నీళ్ళు
వూరసాగాయి.బుట్టను ఎత్తి నెత్తి మీద పెట్టుకొని బయలుదేరాడు. ముందుగానే వాటిని
తినాలని నిర్ణయించుకోవటంతో వూరి బయటగా నడుచుకుంటూ చెరువు దగ్గరకు చేరుకున్నాడు.బుట్ట
మీద కప్పిన గుడ్డ తీసి తినబోయెంతలో నలుగురు దొంగలు చుట్టూ చేరారు నల్లగా బలంగా
ఉన్న వాళ్ళని చూసే సరికి శివయ్యకి వెన్నులో వణుకు పుట్టి,కళ్ళు తిరిగి పడిపోయాడు. వాళ్ళు వీడెవడో
దద్దమ్మ లాగా వున్నాడు చూడగానే పడిపోయాడు తంతే చచ్చేవాడెమో అనుకోని
నవ్వుకోసాగారు.శివయ్య బట్టలన్నీ వెతికారు వాళ్ళకి ఏమి దొరకలేదు బూరెలను చూశారు సరే
డబ్బు లేకపోతే లేకపోయిందిలే బూరెలు తిందామ్ అని అందరూ వాటిని తిని నీళ్ళు తాగారు.ఆ
బూరెలలో విషం వుండటం వలన అందరూ అక్కడే పడి చచ్చారు.
శివయ్య
కొంతసేపు అయిన తర్వాత లేచి చూస్తే వాళ్ళందరూ పడి వున్నారు నిద్ర పోతున్నారేమో
అనుకోని మెల్లగా లేచి బయలుదేరబోయాడు.పొరపాటుగా ఒక దొంగ కాలు తొక్కాడు కానీ అతనిలో
చలనం లేదు శివయ్యకి అనుమానం వచ్చింది.చిన్న పుల్ల తీసుకొని వారి చెవులో,ముక్కులో పెట్టాడు అయిన ఎటువంటి చలనం లేదు. వాళ్ళ ముక్కు దగ్గర వేలు
పెట్టి చూశాడు శ్వాస ఆడటం లేదు గుండె మీద చెవి ఆనిచ్చి చూశాడు గుండె కొట్టుకోవటం
లేదు.వాళ్ళందరూ చచ్చారని అర్ధం అయ్యింది.అప్పుడే తనకు ఒక విషయం గుర్తు వచ్చింది ఆ
నలుగురు దొంగలను పట్టించిన లేక చంపిన వారికి ఆ దేశ రాజు బహుమానం ఇస్తానని
ప్రకటించిన విషయం.వెంటనే వారి దగ్గర వున్న కత్తి తీసుకొని అందరినీ పొడిచాడు ఒకడి
తల మాత్రం నరికి తీసుకొని కోట దగ్గరకు బయలుదేరాడు.కోటగుమ్మానికి కాపలా కాసే వాళ్ళు
ఈ విషయం సేనానికి చెప్పారు.సేనాని ఇది నమ్మలేదు ఇది గనుక అబద్దం అయితే నీ తల ఈ కోట గుమ్మానికి వేలాడుతుంది, నిజం అయితే నీకు రాజుగారు, నీ జీవితానికి సరిపడినంత ధనం ఇస్తారు పద, చూద్దాం అని చెరువు దగ్గరకు వచ్చాడు. అది నిజమేనని గ్రహించి రాజుగారితో చెప్పి అతనికి రావలసిన బహుమతిని
ఇచ్చి సత్కరించారు.శివయ్య తనకి పట్టిన అదృష్టానికి ఎంతో సంతోషిస్తూ ఇంటికి వెళ్ళి
వాళ్ళమ్మ మరియు భార్యతో హాయిగా కాలం గడపసాగాడు.
కొంతకాలానికి ఆ రాజ్యంలో ఒక సింహం బాధ
బయలు దేరింది. రాత్రికి అడవి నుండి రాజ్యం లోకి వచ్చి
మనుష్యులను తినసాగింది.ఎవరు దానిని చంపలేకపోతున్నారు. రాజ్యంలో ఎవరైతే ఆ సింహాన్ని
చంపుతారో వారికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని దండోరా వేయించాడు రాజు.కానీ
ఎవరు ముందుకు రాకపోవటంతో రాజుకు చాలా బాధ వేసింది మంత్రిని పిలిచి సలహా
అడిగాడు.మంత్రి ఆ నలుగురు దొంగలను చంపిన ఆ శివయ్యను పంపండి అని సలహా ఇచ్చాడు.రాజు శివయ్యను పిలిచి విషయం చెప్పాడు.శివయ్య గుండెలు భయంతో జారిపోయాయి.
ఇంటికి వెళ్ళి భార్యతో మా అమ్మను జాగ్రతగా చూసుకో ఇక ఇదేనా చివరిరోజు అని రాజు
ఇచ్చిన కత్తి తీసుకొని బయలుదేరాడు.చీకటి పడెలోపు అడవిలోకి వెళ్లిపోయాడు. దూరం
నుండి సింహం గర్జన వినపడగానే పక్కనే వున్న మర్రిచెట్టు ఎక్కేశాడు అప్పుడే హోరున
వర్షం పడటం ప్రారంబమయ్యింది.పెద్ద,పెద్దగా ఉరుములు మెరుపులు
శివయ్యకు ఇంకా భయాన్ని కలిగిస్తున్నాయి.శివ, శివా అంటూ
వణుకుతూ చెట్టుపైనే కూర్చున్నాడు.సింహం ఆ చెట్టు దగ్గరగా వచ్చి మెరుపుల వెలుతురులో
ఆ చెట్టు పైన వున్న శివయ్యను చూసింది.శివయ్య సింహాన్ని చూడగానే వణక సాగాడు.
సింహం
గర్జిస్తూ చెట్టుపైకి చూస్తుంది శివయ్య వణుకుతూ వున్నప్పుడు అతని చేతిలోని కత్తి
జారిపోయింది.అది సరిగ్గా సింహం నోట్లో పడింది.శివయ్య అది గమనించలేదు.కొంతసేపటికి
వర్షం తగ్గింది సింహం గర్జన ఆగింది. శివయ్య ఆ చెట్టు పైనే నిదుర పోయాడు.తెల్లవారిన
తరువాత ఆ దోవ వెంట పోయేవారు సింహం చచ్చిపడి వుండటం చూసి రాజభటులకి చెప్పారు. వారు వచ్చి
దాని గొంతులోని కత్తి చూసి దీనిని శివయ్య చంపాడని అనుకున్నారు.కింద అలికిడి విని
శివయ్యకు మెలుకువ వచ్చింది.కింద సింహం చనిపోయి వుంది మెల్లగా చెట్టు దిగాడు అందరూ
శివయ్యను ఎత్తుకొని రాజుగారి వద్దకు తీసుకుపోయారు.రాజు యువరాణిని ఇచ్చి వివాహం జరిపించాడు.శివయ్య తన ఇద్దరు భార్యలు అమ్మతో సంతోషంగా కాలం గడపసాగాడు.కానీ ఈ ఆనందం ఎక్కువ
కాలం సాగలేదు.ఒకరోజు పక్క రాజ్యం నుండి ఒక వర్తమానం వచ్చింది ఈ రాజ్యంపై దండెత్తి వస్తున్నామని, యుద్దానికి సిద్దం కావాలని.రాజు గారికి ఏం చేయాలో ఏమో ఏమి పాలుపోలేదు,పక్క రాజ్యం ఈ రాజ్యం కంటే అన్నీ విధాలా బలమైనది.సైనికబలం,గజబలం,అశ్వబలం అన్నీ దీనికంటే ఎంతో ఎక్కువ.మంత్రిని పిలిచి చర్చించారు ఇప్పటికిప్పుడు యుద్ధం అంటే ఓడిపోవటం
పక్కా,కానీ యుద్దం అంటే పారిపోవటం పిరికిచర్య.సరే ఎలాగైనా పోరాడుదాం
అని నిర్ణయించారు తన అల్లుడు ఉన్నాడు కదా అని దైర్యం చేశాడు.
ఈ విషయం తెలియగానే
శివయ్య కూలబడిపోయాడు.ఒళ్ళంతా చెమటలు పట్టాయి.తనకి కత్తి పట్టడమే రాదు ఇంక యుద్దం ఏమి
చేస్తాడు.ఇంట్లోకి వెళ్ళి భార్యాలిద్దరికి మీ తాళి బొట్ట్లు తీసి మంచం కోడుకి కట్టండి నేను బ్రతికి
వస్తే మెడలో వేసుకోండి లేకపోతే వదిలేయండి అని చెప్పి బయలుదేరాడు.తన కోసం సిద్దం చేసిన
గుర్రం పైన కూర్చున్నాడు.అదే అతనికి మొదటిసారి గుర్రం మీద కూర్చోవటం. అది మంచి గుర్రం
యుద్దాలలో ఆరితేరిన గుర్రం ఎలాగో కళ్ళెమ్ పట్టుకుని కూర్చున్నాడు శివయ్య.సైనికులు అందరూ
బయలుదేరారు ఇంకా కొంత దూరంలో రణరంగానికి చేరుతామనగ పెద్దగా డప్పులమోతలు మోగించారు.
వాటికి భయపడిన శివయ్య గుర్రం కళ్ళెం గట్టిగా లాగడు అది ఇక వేగంగా పరిగెత్తటం ప్రారంభించింది.శత్రుస్తావరాల
దగ్గరగా వచ్చేసింది. అక్కడ అంత సేనను చూసి శివయ్య గుర్రం పైనుండి ఎగిరి తాటిచెట్టు
మీదకు దుకాడు ఆ చెట్టు అతని బరువు దెబ్బకు
వేళ్ళతో సహా పైకి లేచింది.ఇది చూసిన శత్రుసైన్యానికి భయం మొదలైంది వాళ్ళు ఇదివరకే శివయ్య దొంగలను,సింహాన్ని చంపిన దాని గురించి విని వుండటంతో వెనుకకు పరిగెత్తటం ప్రారంభించారు.ఆ
పరుగు వారి రాజ్యం దాకా సాగింది.
పక్క రాజ్యం
నుండి శాంతి సందేశం వచ్చింది మీ రాజ్యంతో యుద్దం చేయటం మా వల్ల కాదు మా బహుమానాన్ని
స్వీకరించండిఅని, చాలా బహుమానాలను పంపారు.రాజుగారు శివయ్యకు రాజ్యం
అప్పగించి తాను విశ్రాంతి తీసుకున్నాడు.
తనకు లభించిన
ఈ అదృష్టానికి పొంగిపోతు శివయ్య రాజ్యపాలన చేస్తూ ఆనందంగా జీవించసాగాడు.
Post a Comment