తెలుగు కధలు

1.గర్వభంగం

2.వెంటరాని వస్తువుల వెంట పడరాదు

3.కట్టెలవాడు - నక్క

4.అబద్ధం ఆపద తెస్తుంది

5.సువర్ణ సాహస

6.పుణ్య ఫల

7.బాబా బోధన

8.వ్యసనాలు పోగొట్టుకోవాలి

9.అసూయ

10.గాంధారి శాపం

1.గర్వభంగం

 విక్రమనగరి సంస్థానంలో వీరభద్రుడనే కవి ఉండేవా డు. అతను మంచి పండితుడే గానీ గర్విష్టి కావడంతో ఇతర కవులను జయించి, వాళ్లను అవహేళన చేస్తుండేవాడు.


వీరభద్ర కవి దెబ్బకు ఇతర కవులంతా భయపడి పోయి అతను ఎక్కడ కనిపిస్తాడో, ఎక్కడ తమను ఎగ తాళి చేస్తాడోనని నక్కి నక్కి ఉండేవాళ్లు.


వీరభద్ర కవి దేశాటనం ప్రారంభించాడు. అనేక రాజ్యాలను సందర్శించి అక్కడ మహారాజులచే పాద పూజలు చేయించుకుని, అంతులేని సంపదలు ఆర్జించడం ప్రారంభించాడు. కవిత్వంతో తనను ఓడించలేని పండితులను కారాగారాల్లో బంధించమని, హింసించమని రాజులను అజ్ఞాపించసాగడు. రాను రాను కవి అరాచకాలు పెరిగిపోయాయి.


ఇలా ఉండగా వీరభద్ర కవి గర్వం గురించి విన్న జయసింహుడు అనే యువకుడు తమ రాజ్యాన్ని పాలిస్తున్న రాజేంద్రవర్మ వద్దకెళ్లి "రాజా! వీరభద్రుణ్ణి కవితాగోష్ఠికి పిలిపించండి. అతని పొగరుఅణుస్తాను అని చెప్పాడు. జయసింహుని గురించి అతని తెలివితేటల గురించి తెలిసిన రాజేంద్రవర్మ ,వీరభద్రుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించాడు. వీర భద్రుడు తనకు పన్నెండు భాషలు వచ్చునని, తన మాతృ భాష ఏదో కనిపెట్టాలని, ఒకవేళ కనిపెట్టలేకపోతే రాజు తన రాజ్యాన్ని తనకు ధారాదత్తం చేసి, ఆస్థాన కవులతో సహా రాజ్యం వదిలి వెళ్లిపోవాలని షరతు విధించాడు. జయసింహుడు వచ్చి వినయంగా "కవివరేణ్యా! ఇవ్వాల్టికి చీకటి పడిపోయింది. తమరు విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకోండి. కవితాగోష్ఠి రేపు కొనసాగించవచ్చు" అనడంతో వీరభద్రుడు మందిరానికి వెళ్లి నిద్రపోయాడు.


అర్ధరాత్రివేళ జయసింహుడు మారువే షంలో పెద్ద దుడ్డు కర్రతో వీరభద్రుని చావగొట్ట సాగాడు. దాంతో వీరభద్రుడు "చచ్చాను దేవు డోయ్" అంటూ ఏడవసాగాడు. దాంతో జయ సింహుడు "ఇదే నీ మాతృభాష - తక్షణం వెళ్లిపో" అనగానే వీరభద్రుడు పారిపోయాడు. 

ప్రతిభ ఉండవచ్చు కానీ గర్వం పనికిరాదు.



2.వెంటరాని వస్తువుల వెంట పడరాదు

గ్రీకు దేశంలో అలెగ్జాండరు అను గొప్పరాజు కలడు. అతడు తన శౌర్యధైర్య పరాక్రమాలచే పెక్కు పరిసర రాజ్యాలను జయించి తదుపరి ఆసియా దేశంపై దండెత్తెను. ఆసియా ఖండమున గూడ అనేక తాను సంపా రాజ్యాలను కొల్లగొట్టి ధనమంతా దోచుకొని, దించిన ఆ సిరిసంపదలను, సువర్ణమును, రత్న రాసు లను గోనెలందు, పెట్టెలందువేసుకొని తిరిగి తన స్వస్థానమగు పశ్చిమదేశానికి పయనమయ్యెను.


పూర్వకాలమున రైలుబండ్లుగాని, విమానములుగాని, లేవు. కావున గుఱ్ఱాల పై, ఏనుగుల పై ఆ సామాగ్రినంతను మెల్లగ తరలించుకొనిపోవుచుండెను. అక్కడక్కడ కొన్ని మజిలీలు ఏర్పాటుచేసికొని మంత్రులు, సైనికులు మొద లైనవారు వెంటరాగా కొన్ని గుడారాలు వేసికొని మార్గ మధ్యమున సేదదీర్చుకొనుచు అలెగ్జాండరు విజయోత్సా హంతో స్వదేశమునకు చనుచుండెను.


ఇట్లుండ ఒకనాడు అలెగ్జాండరు చక్రవర్తికి ఆరోగ్యము క్రమముగక్షీణింపదొడగెను.అత్తఱిఅందటును ప్రయాణ కార్యక్రమమును నిలిపివైచి తమ ప్రభువుయొక్క స్వాస్త్య విషయమందే దృష్టిని నిలిపి అతనికి ఆరోగ్యము కలుగు టకై పరిపరివిధముల ప్రయత్నములు చేయదొడంగిరి. గొప్పగొప్ప వైద్యులను పిలిపించిరి.


పేరుగొన్న హకీములను రప్పించిరి. అన్నిరకములు వైద్యములను చేయించిరి. అన్ని మందుల్నీ వాడిచూచిరి. ఎంతటి రాజాధిరాజైనను తన కాని విధి బలీయమైనది. కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు కదా!


రాజుగారికి శరీరంలో ఉష్ణం ప్రబలుచుండెను.. వైద్యులు నిరాశను ప్రకటింపదొడగిరి.మంత్రులు, సామంతులు కింకర్తవ్య విమూఢులై ఏమిచేయుటకును తోచక రాజుచెంత తదేకదృష్టితో నిలబడియుండిరి. ఇక అవసాన కాలం సమీపించినదనియే అందఱును తలంచిరి. అత్తటి అలెగ్జాండరు తన మంత్రులను దగ్గరకు పిలిచి ఈ ప్రణా రముగ వారలనాదేశించెను - ఓ మంత్రులారా! నా ఆరో గ్యము దినదినము క్షీణించుచున్నది.


మీరు నావిషయమై చేయాల్సిన కార్యములన్నిటిని చక్కగా చేయుచున్నారు. కాని నా కర్మఫలితం మఱి యొక విధంగనున్నది. జరగాల్సినది జరిగియే తీరును. ఇక నేనెక్కు వదినములు జీవించు ఆశలేదు. కఫనాత పిత్త ములు నా దేహమునాక్రమించి స్మృతిజ్ఞానం లోపింపక పూర్వమే చిన్న సలహా చెప్పదలంచినాను.


ఏమనగా ఈ శరీరమునుండి ప్రాణవాయువు వెడలి పోగా సంప్రదాయానుసారము దీనిని ఒక పెట్టెలో పెట్టి శ్మశానమునకు తీసికొనివెళ్ళి మీరు ఖననము చేయు దురు. నేను మహారాజును కాబట్టి సామాన్యమానవునివలె కాక పెద్ద ఆటోపముతో ఈ శరీరమును ఊరేగించి శ్మశానమునకు తీసికొనిపోవుదురు. ఆ విషయం నాకు ముందుగనే బాగుగ తెలియును.


అయితే నేను మీకు చెప్పు సలహా ఏమనగా, నా మృతశరీరమును ఉంచునట్టి పెట్టెను తయారుచేయిం చునపుడు అందు చేతులు పెట్టుచోట రెండు పెద్ద రంధ్రములను ఏర్పాటుచేయుడు".


ఆ వాక్యములను వినగనే మంత్రులు సంభ్రమ చిత్తులై ఏ కారణముచే రాజట్లు నుడువుచున్నాడో తెలి యక తికమకపడుచుండిరి. పెట్టెలో ఆ విధంగా రంధ్రాలు ఏర్పాటుచేయుడని చెప్పుటలో గల అంతర్యమేమి?దీని

యందేదియో గొప్ప కారణమీమీడియుండవలెను. ఆ కారణమును ప్రభువు జీవించియున్నపుడే అతనివలన మనము తెలిసికొనుట యుక్తమని మంత్రులందలు యోచించుకొని ఎట్టకేలకు ధైర్యం వహించి అలెగ్జాండరు చక్రవర్తిని సమీపించి యిట్లడిగివైచిరి -


"మహాప్రభో! ఇంతవఱకు చరిత్రలో కనివిని యెరు గని విశేషమును తాము సెలవిచ్చితిరి. ఎవరైనను చనిపో యినచో ఒక పెట్టెలో పరుండబెట్టి శ్మశానానికి తీసికొని పోవుదురు. అంతేకాని ఆ పెట్టెకు చేతులయందు రంధ్ర ములు వేయించరు, కాని తాము రంధ్రాలు వేయించు లాగున చెప్పిరి. ఇదియొక అపూర్వ విషయము. అట్లు ఎందులకానతిచ్చిరో సెలవియ్య ప్రార్థన".


మంత్రుల ఆ వినయాన్విత వాక్యములను విని అలెగ్జాండరిట్లు, ప్రత్యుత్తరమొసగెను. "ఓ మంత్రులారా! ప్రయోజనం లేక ఎవరున కార్యమును చేయుటకుపక్ర మింపదు.నేను మృతినొందిన వెనుక మీరు నన్ను పెట్టెలో పరుండబెట్టి మూతవేసి ఊరేగించెదరు. వేలకొలది జనులు ఆ ఊరేగింపును తిలకించెదరు.


శ్మశానం వఱకు కోలాహలంగా నుండును. పెట్టెలో నన్ను పరుండ పెట్టి ఊరేగించునపుడు చేతు లుండుచోట పెట్టెకు రంధ్రములున్నచో ఆ రంధ్రాల గుండా నా చేతులు బయటకు వచ్చి వ్రేలాడును. ఇంత వదరు జనులలో గొప్ప అపోహ ఒకటి వ్యాపించియున్నది. అది యేదనగా, దేశదేశాలలో అలెగ్జాండదు కొల్లగొట్టిన ధనమునంతను పరలోకమునకు తీసికొని వెళ్ళుచున్నా డేమోయని జనులు తలంచుచున్నారు.


అట్లేమియు తీసికొనివెళ్ళుటలేదని నేను వారికి ఋజు వుపఱచాల్సియున్నది. నా చేతులు బయటకు కన్పించి నచో ఆ రక్తహస్తములను జూచి జనులంతా ఓహో అలె గ్జాండరు ఒట్టిచేతులతోనే పరలోకానికి బోవుచున్నాడే కాని ధనమును, సంపదను వెంట తీసుకొని  వెళ్లుటలేదు..


కోట్లకొలది ధనరాశులను వజ్రవైడూర్యములను, జీవి తంలో సంపాదించినప్పటికి అంత్యకాలంలో ఒక్క చెల్లి గవ్వ అయిన  వెంటతీసికొని వెళ్ళలేదు . ఈ ప్రకారం సత్యమును తెలుసుకొన్న వారు జీవితమును నావలె ధన,కనక వస్తువాహన రాజ్యాధి కారాలందు ధారబోయకుండా సత్యవస్తు సంపాదనమున వినియోగింపగలరు"


ప్రభువుయొక్క వాక్యములను శిరసావహించి మంత్రులందఱు కొద్దిరోజులలో సంభవించిన అలెగ్జాం డరు మరణానంతరము ఆ ప్రకారమే చేసిరి. అలెగ్జాం డరు తన యీ చర్య ద్వారా లోకమునకొక గొప్ప నీతిని బోధించెను. భౌతికసంపద ఏదియు జీవునకు శాశ్వతము కాదని అతడు ప్రపంచమునకు చాటెను,


కావున జనులు సావధానచిత్తులై తమకు శాశ్వతంగ ఉపకరించునటువంటి సత్యదయాధర్మములను జేపట్టి అసత్యములయిన దృశ్యపదార్థములందు విరక్తిని, శాశ్వత మయిన దైవమందు ఆసక్తిని కలుగజేసికొని జీవితమును ధన్యమొనర్చుకొందురు గాక!

3.కట్టెలవాడు - నక్క


                 ఒక అడవిలో కట్టెల వాడొకడు ఒక ఎండిన చెట్టు నరుకుతూ వుండగా, నక్క ఒకటి ఉరుకులు, పరుగులుగా వచ్చింది. బాబూ వేటగాళ్ళు నన్నూ తరుముకొని వస్తున్నారు. ఇక పరుగెత్తే ఓపిక నాకు లేదు. ఈ పొదలో నేను దాక్కుంటాను, వాళ్ళు వచ్చి అడుగుతారు. నక్క ఇటు వచ్చిందా అని అంటే రాలేదని చెప్పి నా ప్రాణము కాపాడవూ అని అతన్ని బ్రతిమాలుకున్నది. అలాగే చెబుతానులే అని దాన్ని ఓదార్చాడు. కట్టెలవాడి మాటలు నమ్మి ఆ నక్క పొదలో దాక్కున్నది. 

         కొంతసేపటికి వేటగాళ్ళు అక్కడికి వచ్చారు. నలుదిక్కులా ఆ నక్క కోసం చూశారు. అది ఎటూ కనిపించనందుకు కట్టెలవాడ్ని నక్క ఒకటి మాకు అందకుండా పరుగెత్తింది. అది ఈ వైపు వచ్చిందా అని అడిగాడు. అందుకు కట్టెలవాడు రాలేదు అంటూనే నక్కదాగి ఉన్న పొదవైపు వేలు చూపాడు. వేటగాళ్ళు అతని జవాబు వినగానే మరో దిక్కున పరుగెత్తారే కానీ అతని సైగ గమనించలేదు. వాళ్ళు చూపు మేర దూరము దాటి పోగానే నక్క పొదలోంచి బయటికి వచ్చింది. కట్టెలవాడ్ని పలుకరించకుండా తన నివాసం వైపు పోసాగింది అప్పుడు వాడా నక్కతో ఇలా అన్నాడు. 

          పంచకమా, నీకు మాట ఇచ్చినట్లు వేటగాళ్ళకు చెప్పి నీ ప్రాణం రక్షించాను గదా, ఇంత ఉపకారం చేసిన నన్ను కన్నెత్తి చూడకుండా, పన్నెత్తి పలుకరించకుండా పోతున్నావా, కృతజ్ఞత అనేది ఎరగనే ఎరగవా అని అడిగాడు. నక్క అతనికిలా బదులు చెప్పింది. 

          నీకు జీవనాధారమైన కట్టెల వలన మెత్తదనం అనేది ఉండదు. వీటితో సాంగత్యం వల్ల నీ మనస్సులో కూడా మెత్తదనానికి చోటు లేకుండా పోయింది. వేటగాళ్ళతో నీవు నేను చెప్పమన్న మాట చెపుతూనే నేను దాక్కొని ఉన్న పొదవైపు వేలు పెట్టి సైగ చేశావు గదా, ఆ సైగ నేను గమనించలేదనుకున్నావు, ఇటువంటి విశ్వాసఘాతకునివి నీకు నేను కృతజ్ఞత తెలుపుకోవాలా! ఈ మాటలు విని కట్టెలవాడు తలవంచుకున్నాడు. కావున మాటల యందు తీపి, మనస్సులో చేదుంచకూడదు.



4.అబద్ధం ఆపద తెస్తుంది


అనగనగా శివపురం అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి, తన కొడుకుతో పాటు నివసిస్తుండేవాడు. ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. అదే అడవిలో పెద్దపులి ఒకటి ఉండేది. అది మేతకు వచ్చిన గొర్రెలను, మేకలను తినేస్తూ ఉంటుంది.


ఆరోజు గొర్రెలను తోలుకెళ్లిన గొర్రెల కాపరి... తాను పక్కనే ఉన్న చెట్ల నుంచి కట్టెలు కొడుతుంటానని, గొర్రెలకు కాపలా కాస్తూ... పులి వస్తున్నట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తనను గట్టిగా కేకేసి పిలవమని కొడుకుకు జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు.


అయితే అల్లరి పిల్లవాడైన కొడుకు ఊరకే ఉంటాడా... ఒకవేళ పులి వచ్చినట్లయితే నాన్న వస్తాడో, లేదో చూద్దామనుకుని "నాన్నా పులి వచ్చింది" అంటూ గట్టిగా అరిచాడు. అదివిన్న అతడి తండ్రి పరుగు పరుగున వచ్చి పులి ఎక్కడ? అని ప్రశ్నించాడు. చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడ చూసినా పులి కనిపించలేదు. కొడుకు సరదాగా అలా చేశాడని అర్థం చేసుకున్న అతను మళ్లీ కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు.


ఈ తుంటరి పిల్లవాడు ఊరుకోకుండా... మళ్ళీ కాసేపటి తరువాత "నాన్నా.. పులి వచ్చింది" అంటూ గట్టిగా, భయంగా అరిచాడు. అది విన్న తండ్రి ఈసారి నిజమే గాబోలు అనుకుంటూ, కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ పులిలేదు. కొడుకును చీవాట్లు పెట్టిన అతను ఇంకోసారి అలా చేయవద్దని హెచ్చరించి, మళ్లీ తన పనిలోకి వెళ్ళిపోయాడు.


తండ్రి తిట్టడంతో చాలాసేపటి దాకా కిమ్మనకుండా ఉన్న ఆ పిల్లవాడు మళ్ళీ "నాయనా... పులి వచ్చింది" అంటూ గట్టిగా కేకలేసాడు. ఈసారి కూడా నిజంగా పులి వచ్చిందనుకున్న తండ్రి పరుగెత్తుకుని వచ్చి చూస్తే.. అక్కడ పులీ లేదు గిలీ లేదు. పట్టరాని కోపంతో ఆ పిల్లవాడికి ఒక్కటిచ్చిన తండ్రి విసురుగా అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు.


గొర్రెల వాసన పసిగట్టిన పులి ఈసారి మాత్రం నిజంగానే వచ్చింది. ఒక్కసారిగా పులిని చూసిన ఆ పిల్లాడు "నాయనా నిజంగానే పులి వచ్చింది" అంటూ భయం భయంగా గట్టిగా కేకలేసాడు. ఆ... వీడికి ఊరికే ఆటలెక్కువయినాయి. పులి రాకపోయినా వచ్చిందంటూ ఇందాకటినుంచీ మోసం చేస్తున్నాడు. అరిస్తే అరుచుకోనీలే అనుకుంటూ తన మానాన తను కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయాడు తండ్రి.


ఇంకేముందీ... పులి ఎంచక్కా గొర్రెలన్నింటినీ తినేసి అడవిలోకి పారిపోయింది. కట్టెలు కొట్టడం పూర్తయిన తరువాత కొడుకు దగ్గరకు వచ్చిన తండ్రి గొర్రెలు లేకపోవడం చూసి లబోదిబోమంటూ ఏడుస్తూ ఉండిపోయాడు.

 ఒక్కసారి అబద్ధం చెప్పి, తరువాత నిజం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారు. 

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.

5.సువర్ణ సాహసం



అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు.

ఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.అయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్తుకెళ్లిపోయిన తమ కొడుకును గురించే బాధపడుతూ ఉండేవారు. సువర్ణకూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది.

అలా వెళ్ళిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దు:ఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్లవ్వ ఇంట ఆగి, అక్కడి విశేషాలను కనుక్కున్నది: "ఒక రాక్షసుడు ఏరోజుకారోజు అక్కడి పిల్లలను ఎత్తుకు పోతున్నాడు. నగరమంతా హాహాకారాలు అలుముకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు."

అయితే నేను వెళ్లి వాడి పనిపడతానన్నది సువర్ణ.

"నీకెందుకమ్మా? అదీకాక ఆడపిల్లవు. నీ వల్ల ఏమి అవుతుంది?. మా మహారాజే ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా!" అంది అవ్వ. కానీ సువర్ణ తన పట్టు విడువలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడునాడంటున్న అడవిలోకే పోయింది. కానీ ఎంత వెతికినా రాకాసి జాడ లేదు.

అలసిన సువర్ణ ఒక చెట్టుకిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి ఆమెకు. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరునూ ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి, పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి, ఏదైనా సహాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ.

"ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడకాదు. వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూతా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూతా కొరివిదెయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్లాలంటే ముందుగా ఆ కనబడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకుగాను నేను ఈ పాదరక్షలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దెయ్యాలకు కనిపించవు. ఆ దెయ్యాలను దాటిన తరువాత నువ్వు గుహకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణిని ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు" అని పాదరక్షల్నీ, మణినీ సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని, పాముకు కృజ్ఞతలు చెప్పి అక్కడినుండి గుహవైపుకు బయలుదేరింది.

గుహను చేరుకొని, ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దెయ్యాలకు కనిపించలేదు. ఆపైన ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు- ఆమె మెడలోని మణిప్రభావం చేతనే!

అలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప, అక్కడ జనసంచారమనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలాసేపటికి ఒక పండుముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ "అమ్మా పాపా! ఇంత వరకూ తమంతట తాముగా ఇక్కడికి ఏ నరపురుగూ రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీచేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తోస్తున్నది. ముందుజాగ్రత్తగా నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటిదాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు" అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది.

కోట లోపలచూస్తే ఒక్కరు తక్కువగా పదివేలమంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్నపిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆరోజు సాయంత్రం రాక్షసుడు వచ్చీరాగానే అవ్వను "పదివేలమందీ పూర్తయ్యారా?" అని అడిగాడు. "అయ్యార"న్నది అవ్వ. "అయితే బలికి అన్నీ సిద్దం చేయమన్నాడు రాకాసి. అవ్వ అన్నీ సిధ్ధంచేసి, మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది.

రాక్షసుడు సురర్ణను చూసి వికవికా నవ్వాడు. "పాపా, నువ్వు స్వర్గం చేరుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాతకు మోకరిల్లు" అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని.

సువర్ణ రెండు చేతులూ జోడించి అమ్మకు మొక్కింది. "అలాకాదు పాపా, వంగి, నేలబారుగా పడుకొని నమస్కరించాలి" అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. "నాకు తెలియదు, నువ్వే చేసి చూపించు" అన్నది సువర్ణ. "అయ్యో! ఆ మాత్రం తెలీదా, ఇలా పడుకొని, ఇలా మొక్కాలి" అని రాక్షసుడు నేలబారున పడుకోగానే, ప్రక్కనున్న కత్తిని తీసుకొని, సువర్ణ ఒక్కవేటుతో అతని శిరస్సును ఖండించివేసింది.

రాక్షసుడు చనిపోగానే, అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన పదివేలమంది పిల్లలకూ వాళ్ల వాళ్ల రూపాలు లభించాయి. అవ్వకుకూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి! అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావులకు వారు చేరుకున్నారు.

ఆ పిల్లల్లోనే ఒకడు, రవివర్మ! అలా అనుకోకుండా తన అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకూ వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దానధర్మాలు చేసి, ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు.



6.పుణ్య ఫలం

 బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా హఠాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన  కుండపోత వర్షం ప్రారంభమైంది.


 ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.


 కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.


 ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.


ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.


 ఆ బస్సులో వున్న ఒక పెద్దయన  ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.!

        

 నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!  ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,.....

      అదిగో!ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి.

                                      మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి

మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!

            ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే  ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.

అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులోకూర్చున్నాడు….

 ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు.

చాలా మంది అతని వైపు అసహ్యంతో,  కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.


        కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ ..బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.


 ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు పడింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు...కానీ పిడుగు పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు...!!


 ఆ బస్సుపై…అవును.. బస్సుపై పిడుగు పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.


 నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ...ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల..... ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల ,.. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం వారంతా  మృత్యువాత పడడం జరిగింది.

7.బాబా బోధన


ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి "స్వామీ! అబద్దాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా, ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు?" అని అడిగాడు.


"ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశముంది" అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు, వసూళ్ళ గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు.


ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిసాడు. స్వామీజీ రాఘవయ్యతో "నాయనా! ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేసావు?" అని అడిగాడు. "స్వామీ! మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చెయ్యగలను?" అన్నాడు రాఘవయ్య.


నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా! మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా, ప్రశాంతంగా జీవించగలం" అన్నాడు స్వామీజీ. 


8. వ్యసనాలు పోగొట్టుకోవాలి


ఒక చెడ్డపని మరల మరల చేస్తుంటే అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు బలపడితే వ్యసనంగా రూపొందుతుంది. వాసనగా పరిణమిస్తుంది. ఇకదాన్ని తొలగించుకోటం మహాకష్టం. కాబట్టి చెడ్డ అలవాట్లను ముదరనీయకుండా ప్రారంభదశలోనే త్రుంచి వేస్తూండాలి. ఆయా పనులను ఇక మీదట చేయక మానే స్తుండాలి. చిత్తశుద్ధికి ఇది చక్కని మార్గం..


అట్లుచేయక చేసిన చెడ్డపనినే మరలమరల చేస్తుంటే అది వ్యసనంగా మారితే దాన్ని పోగొట్టుకోవటం మహాకష్ట సాధ్యమవుతుంది. అపుడు దాన్ని తొలగించుకోటానికి

బ్రహ్మాండమైన ప్రయత్నం ఆచరించవలసియుంటుంది. విషబీజాలను అంకురరూపం పొందక పూర్వమే వాటిని మట్టుబెట్టాలి. అంతరింపజేయాలి.


పూర్వం భోజరాజు అనే గొప్ప భూపాలుడు ఉండే వాడు, అతని ఆస్థానంలో లక్ష్మీ, సరస్వతి ఇరువురూ స్థానం పొందగలిగారు. అనగా అతనికి సంపదకు లోటు లేదు. సాహిత్యానికి, కవిత్వానికి, పాండిత్యానికి లోటు లేదు, అతడు తాను స్వయంగా పాండిత్యం పొందటమే కాక ఎందరో పండితులను పోషిస్తుండేవాడు.


కాళిదాసు మొదలైన మహాకవులకు తన ఆస్థానంలో స్థానం కల్పించాడు. ఆ భోజరాజు అందరి రాజులపలె గారు, ఎంతయో సుగుణ సంపన్నుడు. మూర్తీభవించిన సుగుణరాశియని చెప్పవచ్చును. కాని అతనిలో ఒక్క అపగుణంమాత్రము ఉండియుండింది. అదియే జాదం. జాదమాడటమంటే అతనికి ఎంతో ప్రీతి. అందువల్లనే అతడు ప్రతిరోజు తన రథం ఎక్కి దినానికి ఒక్కసారి


జూదశాలకు పోతుంటాడు. అతనిలో జూదం ఒక వ్యస నంగా ఏర్పడింది. ఈ విషయం అతని ఆస్థానంలో ఉన్న కాళిదాసు గమనించాడు. ఆ దుర్గుణాన్ని అతనిలో అంత మొందించాలని కృతనిశ్చయుడైనాడు. ఆ విషయమై భోజరాజుకు పదేపదే బోధిస్తూ వచ్చాడు.


"ఆ ఒక్క అవగుణం పోగొట్టుకొంటే బంగారానికి సుగంధంవుంటే ఇంకా ఎంతగొప్పగా రాణిస్తుందో అట్లుం టుంది మీప్రాభవం" అని చెప్పాడు. కాని ఇతరులు ఎంత చెప్పినా భోజరాజు తన దురలవాటును మానలేదు.


భోజరాజుచే జూదం మాన్పించాలని కాళిదాసు పట్టు బట్టాడు. ఒకనాడు కాళిదాసు సాధువేషాన్ని ధరించి కాషాయబట్టలు కట్టి జూదశాలకు పోయేదారిలో ఉన్న మాంసపుఅంగడి వద్ద మాంసం కొంటున్నట్లు నటించాడు. సరిగా అదే సమయానికి భోజరాజు రథంపై ఎక్కి బాద శాలకుపోతూ సాధువుని చూచి రథం ఆపించి, దిగి


సాధువుతో ఇట్లు పలికాడు "సాధువుగారూ! మాంసం కొనటం మీకు సముచితమేనా?" అది విని సాధువు"కల్లు త్రాగేటప్పుడు నంజు కోవటానికి నాకు మాంసం కావలసియున్నది" అని చెప్పాడు.వెంటనే భోజరాజు "కల్లు కూడా మీరు త్రాగుతారా?" అనడిగాడు.


"ఎప్పుడూ త్రాగను, వేశ్యలతో ఉన్నపుడే త్రాగు తాను" అన్నాడు సాధువు, "వేశ్యలను పోషించ టానికి మీకు డబ్బిక్కడిది?" అని రాజు ప్రశ్నిం చాడు. "దొంగతనం ద్వారా, జూదమాడటం ద్వారా డబ్బు సంపాదిస్తానన్నాడు సాధువు. ఆ 


మాటలు వినగానే భోజరాజు ఉక్కిరిబిక్కిరైనాడు. తానుజూదశాలకుపోతూ జూదం ఆడవద్దని ఇతరు గంధం లకెలా చెప్పగలుగుతాడు. వెంటనే రథాన్ని వెనుకకు త్రిప్పించి రాజభవనానికి పోయి ఆనాటి నుండి జూదమాడటం మానేశాడు. కాళిదాసు తన లక్ష్యాన్ని సాధించాడు. కృతకృత్యుడయ్యాడు.


మానవుడా! చెడ్డ అలవాట్లు వదిలెయ్, వ్యసనాలను దూరం చేసుకో, అవి మోక్షమార్గాన గొప్ప ప్రతిబంధ కాలు, బాగా బలపడియుండటంవల్ల చెడ్డ అభ్యాసాలను పోగొట్టుకోవటం కొంత కష్టమైనా, ఆ కష్టాన్ని ఓర్చుకొని.. ఏదో విధంగా వాటిని హృదయకుహరం నుంచి బైటకు వెట్టివేయాలి. హృదయాన్ని విష్కంటకంగా తయారు చేయాలి.దానికొరకై ఎంతయో ప్రయత్నమవసరం.


కావున మానవుడా! దురలవాట్లను జయించటానికి గొప్ప ప్రయత్నం ఆచరించు భగీరధయత్నంచేయ్. కొంత ప్రయాస అయినా వాటిని జయించడంవల్ల మహదానం దంకల్గుతుంది. కాబట్టి జాగరూకుడవైయుండు. దొంగ లను చేర్చవద్దు. శత్రువులను రానీయవద్దు. దుర్మార్గు లను దరికి చేర్చవద్దు. యత్నించు సాధించు! విజయం పొందు!! ఆనందం అనుభవించు!!!

శ్రీశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

9.అసూయ 


              ఒక వూరిలో మాధవుడు, కేశవుడు అను ఇద్దరు ర్తెతులు ఉండేవారు.  మాధవుడు చాలా తెలివైనవాడు.  దానికి తోడు బాగా కష్టపడి పనిచేసేవాడు. తనకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు.  కేశవుడు స్వతహగా బద్ధకస్తుడు.  ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ విచారంగా ఉండేవాడు.  మాధవుడు అంటే అతనికి గిట్టదు.  ఎల్లప్పుడూ మాధవుని గురించి అసూయ పడేవాడు. మాధవుడు సుఖంగా ఉండడం అతనికి గిట్టేది కాదు.  అందుచేత అతనెప్పుడూ మాధవుడికి కీడు జరగాలనే భగవంతున్ని కోరుకునేవాడు.   

            మాధవుడు ఎల్లప్పుడూ అందరు తనలాగే సుఖంగా జీవించాలని కోరుకునే వాడు.  అందుచేతనే భగవంతుడెప్పుడూ అతన్ని కాపాడుతూ ఉండేవాడు.  కొంతకాలం అలా గడిచిపోయింది.  మాధవుడు చాలా శ్రమపడి, తన తోటలో గుమ్మడి పాదులు వేసి పెంచాడు.  అందులో ఒక పాదుకి ఒక చక్కటి గుమ్మడి కాసింది.  అటువంటిది ఎక్కడా దొరకటం కష్టము.  

           అది నవనవలాడుతూ సప్తవర్ణాలతో చాలా అందంగా ఉంది.  మొగలి పువ్వులా మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. అన్నింటికంటే ముఖ్యం, అది ఒక ఏనుగాకారంలా ఉంది.  దానికి నాలుగు కాళ్ళు ఒక తొండము, ఒక తోక కనిపిస్తున్నాయి.  ఇంత మంచి గుమ్మడి పండు మహారాజుకి బహుమతిగా ఇస్తే బాగుంటుందని మాధవుడు అనుకున్నాడు.  దానిని రాజధాని నగరానికి తీసుకొని వెళ్ళి ఈ కానుకను స్వీకరించండి మహారాజా! అని వినయంగా సమర్పించాడు.  

           ఇటువంటి ప్రత్యేకమైన కానుకను తనకిచ్చినందుకు ఒక మంచి ఏనుగును మహారాజు మాధావుడికి బహుమతిగా ఇచ్చాడు.   కేశవుడికి ఈ వార్త తెలిసింది.  అసూయతో అలమటించాడు.  రాత్రంతా నిదురపోలేదు.  రాజును మెప్పించి.  మాధవుని కంటే మంచి బహుమతిని రాజు వద్ద పొందాలని ఆలోచించాడు.  ఏనుగు ఆకారాన్ని ఇచ్చినంత మాత్రం చేతన ఏనుగునిచ్చాడా మహారాజు, నిజమైన ఏనుగునే ఇస్తే ఇంకా ఎంత కానుక ఇస్తాడో, నాకు తప్పక ఒకటి, రెండు గ్రామాలనిస్తాడు.  అప్పుడు నేనొక జమీందారునవుతాను అనుకున్నాడు.   

           మరుసటి రోజున తనకున్న ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు సర్వస్వం అమ్మి పారేశాడు.  ఆ సొమ్ముతో ఒక పెద్ద ఏనుగును కొని రాజుగారికి కానుకగా తీసుకొని పోయాడు.  సాధారణ రైతు తనకెందుకు బహుకరిస్తున్నాడు రాజుకర్థం కాలేదు.  అతడు మంత్రులను పిలిచి ఇందులో ఏదో అంతరార్థం ఉంది. ఆలోచించి చెప్పండి.  ఇతనికి తగిన బహుమతి ఏమిటో నిర్ణయం చెయ్యండి అని చెప్పాడు.   

            ఆ మంత్రిగారు కేశవుడితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పాడు. మాటలలో పెట్టి నిజాన్ని తెలుసుకున్నాడు.  మాధవుడి మీదుండే అసూయ ఇందుకు కారణమని తెలుసుకున్నాడు. ఈ విషయమంతా రాజు గారికి తెలియచేసాడు. కేశవుడు బుద్దిని తెలుసుకుని అతనికి గుణపాఠం చెప్పడానికి,  మహారాజు అతనికి ఒక గుమ్మడికాయను బహుమతిగా ఇచ్చాడు.  ఆ గుమ్మడికాయను చూసి కేశవుడు కుప్పకూలిపోయాడు.  అతని హృదయం బ్రద్దలైంది.  అతడు తన ఆస్తినంతా అమ్మేసుకున్నాడు.  తినడానికి తిండిలేక కట్టుబట్టల్లేక ఇక్కట్లకు గురయ్యాడు.  అసూయవల్ల వచ్చే అనర్థం అంతా ఇంతా చెప్పనలవి కాదు.


10.గాంధారి శాపం



కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. “ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు” అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.


వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, “నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?” అన్నాడు.


“రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.


‘నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?’ అని దేవతలను ప్రశ్నించిందామె.


‘ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ‘ అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.


“విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?”


ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.


పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.


ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.


కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.


కోపంతో మండిపడిందామె.


“శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?” ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.


అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.


మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని “నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి” అంది.


కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.


“వాసుదేవా! ఇలా రావయ్యా” అని పిలిచింది గాంధారి.


“కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను – నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక” అని శపించిండి గాంధారి.


సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.


“అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?” అన్నాడు నవ్వుతూనే.


పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.