telugu short stories 3

1.ముంగిస - పిల్లాడు

2.గయాసురుడు

3.దేవత - బంగారు గొడ్డలి

4.శుకుడ

5.మార్పు

6.మితిమీరిన విశ్వాస

13.అక్షయపాత్



1.ముంగిస - పిల్లాడు




శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగిస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.


ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం మూంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి మంగిసను చంపినందుకు బాధపడింది. 


2.గయాసురుడు



గయాసురుడు పురాణ ప్రసిద్ధి చెందిన తపస్వి, రాక్షసుడు. మహా విష్ణుభక్తుడు, తన తపోశక్తిచే తన శరీరమే పరమ పవిత్రంగా మలచుకుని, దానిని తాకిన వారు ముక్తి పొందేలా చేసుకోగలిగినవారు. విష్ణుభక్తితో తన శరీరాన్ని సకల తీర్థాలకన్నా పరమ పవిత్రంగా మలచుకున్నాడు. వైదిక కర్మలు నశించినప్పుడు ఆయన శరీరంపై బ్రహ్మ యజ్ఞం చేసాడు. ఆ యాగానంతరం ఆయన శరీరంలోని మూడు భాగాలు దివ్యక్షేత్రాలుగా పితరులను తరింపజేసే దివ్యధామాలుగా చేసుకునే వరం పొందారు.



గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.

ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.[1]

బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.[2]

గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.

ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన(కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో(కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.

3.దేవత - బంగారు గొడ్డలి


అనగనగ ఒక ఊరిలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించే వారు. ఒక రోజు ఆ ఊరికి సమీపంలో ఉన్న నది ఒడ్డున రామయ్య కట్టెలు కొడుతుండగా, గొడ్డలి పట్టు తప్పి నదిలో పడిపోయింది. దీనితో తన జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయిందని బాధపడుతూ, దిగాలుగా నది ఒడ్డున కూర్చొని  విచారిస్తున్నారు.

రామయ్య బాధ పడటం చుసిన నదీదేవత, తన ముందు ప్రత్యక్షమైంది. ఏంటి రామయ్య దిగాలుగా కూర్చో ఉన్నావు అని ప్రశ్నించింది. అప్పుడు రామయ్య ఆ దేవతతో "తల్లీ, నేను కట్టెలు కొట్టి వాటిని అమ్మితే గాని నాకు పూట గడవదు. అన్నం పెట్టే నా గొడ్డలి ఇప్పుడు నీ నదిలో పడిపోయింది" అని దిగాలుగా సమాధానమిచ్చాడు.


దీనితో నదీదేవత నది నుండి ఒక బంగారు గొడ్డలి తీసి రామయ్య కి చూపించి ఇది నీదేనా అని అడిగింది. ఆ గొడ్డలి చూసి రామయ్య నాది కాదు అన్నాడు. వెంటనే ఇంకొక వెండి గొడ్డలి నది నుండి తీసి చూపించింది. రామయ్య అది కూడా తనది కాదని చెప్తాడు. ఈసారి నది నుండి రామయ్య ఇనుప గొడ్డలిని తీస్తుంది దేవత. రామయ్య తన గొడ్డలిని చూసి సంతోషంతో తనదే అని తీసుకుంటాడు. బంగారు, వెండి గొడ్డళ్లని చూపిన ఆశపడని రామయ్యని చూసి నదీదేవత సంతోషించి, ఆ మూడు గొడ్డళ్లు ఇచ్చి మాయమైంది.


దేవత ఇచ్చిన ఆ మూడు గొడ్డళ్లు పట్టుకొని ఇంటికి వెళ్తున్న రామయ్యకి తన స్నేహితుడు సోమయ్య ఎదురుపడగా, నది దగ్గర జరిగిందంతా చెప్పాడు. దురాశ కలిగిన సోమయ్య తాను కూడా నదిలో గొడ్డలి పడేస్తే దేవత బంగారు గొడ్డలి ఇస్తుంది అనుకోని నదిలో తన గొడ్డలి పడేస్తాడు. నదీదేవత ప్రత్యక్షమై ఏమైంది అని అడుగుతుంది. తన గొడ్డలి నదిలో పడిందని చెప్తాడు సోమయ్య. నదీదేవత రామయ్యకి చూపించినట్లే బంగారు గొడ్డలి చూపించి నీదేనా అని అడుగుతుంది. అత్యాశతో సోమయ్య ఆ గొడ్డలి నాదే తల్లీ అని చెప్పగా, అతని అత్యాసాని గ్రహించిన దేవత కోపంతో మాయమవుతుంది. లేని దానికోసం ఆశపడగా ఉన్నదీ కాస్త పోవడంతో సోమయ్య ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు.



4.శుకుడు



శుకుడు వేద వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని పరీక్షిత్తు మహారాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపించాడు.



ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు

వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి మథించుచుండగా ఘృతాచి కనుపించింది. ఆమెను చూడగానే వ్యాసుడు కామవశుడై వీర్యస్థలనం చేసికొన్నాడు. ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని చిలుక రూపం దాల్చి పొంచి యున్నది. అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుకుడు జన్మించాడు. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు దేవేంద్రుడు కమండలం యిచ్చాడు. దేవతలు దివ్యవస్త్రం ప్రసాదించారు. తండ్రి అనుమతి తీసికొని శుకుడు బృహస్పతిని గురువు చేసికొని ధర్మశాస్త్రము, రాజనీతి నేర్చుకొన్నాడు. విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. వచ్చిన శుకుని కౌగలించుకుని గౌరవించాడు. మునిబాలకులతో శుకుడు ఆట పాటలతో కాలం వెల్లబుచ్చుతున్నాడు. అది గ్రహించి తండ్రి కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు.


శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు. వార్త తెలియగనే సపరివారంగా ఎదురేగి జనకరాజు శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనం చూపాడు. కుసుమములచే అతని పూజించాడు. శుకుని రాకకు కారణం అడుగగా, శుకుడు జనక మహారాజ మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగొరి వచ్చాను అని మౌనం వహించాడు. జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వచ్చాడు. శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు.


శుకునకు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు. ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఎచ్చలను ఉండక భూభాగమంత సంచరించసాగాడు.ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి ఏడు దినములలో ముక్తి లభించునట్లు చేయని అర్ధించాడు.అంత శుకుడు తండ్రి గారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు రోజులు వినిపించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు.భాగవత కథా శ్రవణంలో పరీక్షిత్తు ముక్తినందాడు.శుకుడు సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు.


ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుకమహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడిగాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగియైనాడు. శుకుని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణము. కాని వ్యాసమహర్షిని చూచి వారు వలువలు ధరించేవారు. శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు. పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాల లోన లేడు. ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమచయోగీశ్వరుడు. శుకుని రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది. శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరించాడు. ఈ విషయం శుకరంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.

5.మార్పు


అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్‌చెయిన్, సఫారీ డ్రస్‌తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో బాబూ అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూసాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూసాడు నవీన్. బాబూ గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరో వైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబూ! అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్.


నవీన్ చూపులకు బయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబూ అన్నాడు. ఆ ఆగుతుందిలే అంటూ మరో వైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదోరకంగా ఫీలవుతున్నాడు. అదీగాక ఈ బస్‌స్టాండ్‌లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్ వచ్చి పాయింట్‌లో ఆగింది. బిల బిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకర్నొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతిరుమాళ్ళు, బ్రీఫ్‌కేసులు వేసి సీటులు రిజర్వ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్‌కేస్‌ను ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తరువాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు.


కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబూ! ఇదిగో బాబూ మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూసాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థంకాని నవీన్ ఒక్క ఉదుటున బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్‌కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్న మాట. అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేసాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులో కొచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్ళాడు.


ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్‌కు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకూ తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకోని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేసాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్‌కేస్‌లో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, రెండువేలరూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి ఋణం తీర్చుకోవాలి అని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాతా! నీకు చాలా నీరసంగా ఉంది కదూ! నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకొందువుగానీ రా తాతా! అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు.

6.మితిమీరిన విశ్వాసం



ఒకప్పుడు ఒక నగరంలో బాగా చదువుకున్న యువకుడు ఉండేవాడు. అతనికి తన తెలివితేటలు, మేధస్సు పట్ల ఎంతో నమ్మకముండేది. ఆ అతి నమ్మకం అతన్ని గర్విష్టిగా మార్చింది. అతను నగరాన్ని వదిలి భోధనలు చేయడానికి పల్లెటూళ్ల వైపు వెళ్లాడు.


అలా వెళ్లగానే అతనికి కష్టాలు మొదలయ్యాయి. అతనికి తారసపడిన వాళ్లందరూ తామే మేధావులం అని అనుకునేవాళ్లే. వాళ్లకు బోధించాలంటే ఇతనే వారికంటే తెలివైనవాడని నిరూపించుకోవలసి ఉంటుంది. తన మేధస్సుపట్ల ఎంతో నమ్మకమున్న యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్లి తను ఆ వ్యక్తి కంటే తెలివైనవాడినని నిరూపించుకోదలిచాడు.


తన ప్రశ్నకు ఆ వ్యక్తి జవాబు చెప్పలేకపోతే అతను తనకు నాణాలు ఇవ్వాలి. అని యువకుడు షరతు విధించాడు.


యువకుడు ఆ వ్యక్తిని "ఇది చాలా సులభంగా గెలుచుకోగల ప్రశ్న" అంటూ ఊరించాడు. ఊరు ఊరంతా ఆ క్విజ్‌ను చూసేందుకు పోగయ్యారు. చదువుకున్న యువకుడు ఇలా మొదటి ప్రశ్న అడిగాడు,' ఇంగ్లండ్ రాజధాని ఏది?'


"నాకు తెలియదు. నేను నీకు మూడు నాణాలిస్తాను" అని అవతలి వ్యక్తి అన్నాడు.

'లండన్‌' అని చెప్పాడు. ఆ యువకుడు ప్రజలంతా అతన్ని మెచ్చుకున్నారు. యువకుడు మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు.

"వేగంగా తిరుగుతుంది, కానీ అది తిరిగినట్లు అస్సలు అనిపించదు, ఏంటది? అని యువకుడు రెండో ప్రశ్న అడిగాడు.

"నాకు తెలీదు. నీకు మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడా వ్యక్తి.

'భూమి' అని చెప్పి మరో మూడు నాణాలు జేబులో వేసుకున్నాడు యువకుడు.

యువకుడు "పగలు పైకెళ్లి, రాత్రి కిందకు దిగేది ఏంటి? అని మూడో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి నాకు తెలీదు.

నీకు మరో మూడు నాణాలు ఇచ్చేస్తాను" అన్నాడు.

మొత్తం తొమ్మిది నాణాలు పొందిన యువకుడు సంతోషించగా, పేదవాడైన ఆ వ్యక్తి భార్య ఏడవడం మొదలెట్టింది.


ఇక అవతలి వ్యక్తి వంతు వచ్చింది. అతను యువకుడిని తన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే ఐదువేల నాణాలు ఇవ్వాలని షరతు విధించాడు దానికి సంతోషంగా సరేనన్నాడు యువకుడు.


ఆ వ్యక్తి "ఉదయం రెండు కాళ్లతో, మధ్యాహ్నం నాలుగు కాళ్లతో నడిచేది ఏది"? అని అడిగాడు.ఆ ప్రశ్నవిన్న యువకుడి నోటి మాట పెగల్లేదు. జుట్టు గోక్కోవడం మొదలెట్టాడు. ప్రజలంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ యువకుడికి తన వద్దనున్న ఐదువేల నాణాలు ఆ వ్యక్తికి సమర్పించక తప్పలేదు.


కుతూహలం పట్టలేక యువకుడు "ఉదయం రెండు మధ్యాహ్నం నాలుగు సాయంత్రం ఆరు కాళ్లతోనడిచేది ఏంటి?" అని అడిగాడు ఆ వ్యక్తిని.

"ఏమో నాక్కూడా తెలీదు నీకు మూడు నాణాలు ఇస్తాను" అన్నాడా వ్యక్తి.

అవతలి వ్యక్తి సమాధానంతో చదువుకున్న ఆ యువకుడికి బుర్ర తిరిగిపోయింది. 

7.ఐకమత్యం



ఒక అడవిలో నాలుగు ఎద్దులు కలిసి మెలిసి, ఒకే దగ్గర మేత మేస్తూ ఉండేవి. ఎక్కడికైనా కలిసే వెళ్ళేవి, ఆనందంగా జీవించేవి. ఒక రోజు ఒక సింహం ఆ దారినపోతూ, మేత మేస్తున్న ఎద్దులని చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అనుకుంటూ, గాండ్రిస్తూ ఎద్దుల మీదకి దూకబోయింది. అప్పుడు ఒకే సారి నాలుగు ఎద్దులు తమ వాడి కొమ్ములతో ఏ భయం లేకుండా సింహం మీదకి దూకాయి. అలా నాలుగు ఎద్దులు ఒకేసారి సింహం మీదకి దూకేసారికి, సింహం భయపడి పారిపోతుంది.

కొంతకాలం తర్వాత, ఆ నాలుగు ఎద్దులు తమలో తామే గొడవ పడి, విడిపోతాయి. అది తెలుసుకున్న సింహం, ఒక్కొక్క ఎద్దుని విడివిడిగా చంపి తినేస్తుంది.

నీతి: ఐకమత్యమే మహాబలం.

8.మాతృభాష



కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి, వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి, మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒక రోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చ్హాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.

"మహారాజా! మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా?" అని సవాలు విసిరాడు.

ఆస్ధాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏ మాత్రం తడుముకోకుండా, ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్ధానపండితులు చేతులెత్తేశారు.

"మీ రాజ్యంలో నా మాతృభాషను కనిరెట్టగల మేధావులే లేరా?" అన్నాడు ఆ పండితుడు మహారాజు మహామంత్రివైపు చూశాడు.

మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్ప సాగాడు. చివరికి విసుగు చెందిన, మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు.
"అమ్మో! కాపాడండి!" అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో.

మహామంత్రి ఖడ్గాన్ని దించి, చిరునవ్వుతో "మహారాజా! ఆ పండితుడి మాతృభాష కన్నడం, మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి." అని చెప్పాడు.
పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకుని సభ నుండి వెళ్ళిపోయాడు. 

9.కాకభుశుండి పూర్వజన్మవృత్తాంతము


(శ్రీతులసీదాస కృత రామచరితమానసము లోని కథ)

నారద మహర్షి పంపగా గరుడ భగవానుడు మేఘనాథుని చేతిలో తనకు తానే బంధింపబడిన శ్రీరాముని బంధములను తొలగించెను. శ్రీరాముని మాయావశుడైన గరుడుడు ఇలా ఆలోచించసాగెను “సర్వవ్యాపకుడు నిర్వికారుడు వాగాధిపతి మాయాతీతుడు అయిన పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరామునిగా అవతరించెనని విన్నాను. శ్రీరామ నామమును జపించినంత మాత్రముననే మానవులు భవబంధవిముక్తులు అగుదురనీ విన్నాను. కానీ అట్టి మహిమాన్వితుడైన శ్రీరాముడు ఒక రాక్షసాధముని నాగపాశముచే బంధింపబడుట ఏమి”? ఇలా మాయామోహితుడై వ్యాకులచిత్తుడైన గరుడుడు బ్రహ్మర్షి అగు నారదుని కడకేగి తన సందేహమును వ్యక్తపఱచి కాపాడమని ప్రార్థించెను. నారదుడు గరుడుని సందేహనివారణార్థం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికడకు పంపెను. తన వద్దకు వచ్చిన గరుడునితో బ్రహ్మదేవుడిలా అన్నాడు “ఓ విహగేశ్వరా! పరమశివుడు శ్రీరాముని మహిమను బాగా ఎఱుగును. కావున నీవు ఆ శంకరునే శరణువేడుము”. కుబేరుని కడకు వెళుతున్న మహాదేవుని కలిసి గరుడుడు తన సందేహమును చెప్పెను. “ఓ పక్షీంద్రా! ఎంతో కాలము సజ్జనుల సేవను చేసిగానీ జ్ఞానమును పొందలేము. నిన్ను నిరంతర రామకథాప్రసంగములు జరిగే దివ్యమైన నీలగిరిలోని పరమ భాగవతోత్తముడైన కాకభుశుండి ఆశ్రమమునకు పంపెదను” అని పార్వతీనాథుడు ఆనతిచ్చెను.

వేయి మందిలో ఒక్కడే ధర్మపథమును సర్వకాల సర్వావస్థలయందూ అనుసరించును. అట్టి కోటి ధర్మాత్ములలో ఒక్కడు పేరాశకులోనుకాక విరాగి వలె ఉండును. అట్టి కోటి విరాగులలో ఒక్కడు జ్ఞాని అగును. అలాంటి జ్ఞానులలో కోటికొక్కడే జీవన్ముక్తుడగును. అట్టి వేయిమంది జీవన్ముక్తులలో అరుదుగా ఒక్కడు బ్రహ్మైక్యమును పొందును. అలా బ్రహ్మైక్యమును పొందినవారిలో మిక్కిలి అరుదుగా సంపూర్ణముగా మాయావిముక్తుడై శ్రీరాముని భక్తిలో లీనమైన ప్రాణి ఉండును. అట్టి దుర్లభమైన నిష్కల్మష రామభక్తి ఉన్న కాకభుశుండి కడకు గరుడుడు వచ్చెను. వచ్చిన గరుడుని తగిన రీతిలో గౌరవించి కుశలమడిగి సముచిత ఆసనముపై కూర్చుండబెట్టి గరుడునికి సంక్షిప్త రామాయణము మొదలగు ఎన్నెన్నో అతిరహస్యములైన తత్త్వములను వివరించి గరుడుని కోరికపై తన పూర్వజన్మ కథను ఇలా చెప్పాడు రామభక్తుడైన కాకభుశుండి

“పూర్వము ఒకానొక కల్పములో కలియుగము ఆరంభమైనది. కలికాలము మిక్కిలి కలుషితమైనది. స్త్రీ పురుషులందఱూ పాపకర్మనిరతులై వేదవిరుద్ధముగా మోహాధీనులై క్షణికమైన జీవితకాలము కలిగియూ కల్పాంతములు దాటే గర్వము దంభము అహంకారమును కలిగియుందురు. పాషండులు తమవిపరీత బుద్ధులతో క్రొత్తక్రొత్త సాంప్రదాయాలను ఆచారాలను కల్పించి ప్రచారం చేయుదురు. ఎవరికి ఏది ఇష్టమో అదే ధర్మమని అందురు. ఒక వైపు బ్రహ్మజ్ఞానముగూర్చి మాట్లాడుతూ మఱొక వైపు లోభముచే ఎంత మహాపాపకార్యమైనా చేయుటకు వెనుకాడరు. తాము స్వయముగా భ్రష్టమగుటే కాక సన్మార్గమున నడచువారినికూడా భ్రష్టుపఱచెదరు. వర్ణాశ్రమధర్మాలు అడుగంటుతాయి. ప్రజలలో సామరస్యం సమైక్యభావం నశిస్తుంది. నిష్కారణ వైరములతో కక్షలతో ఉండెదరు. వేదశాస్త్ర పురాణములను గౌరవించరు. కుతర్కములతో వేదశాస్త్రపురాణ నిందచేసి అనంతపాపరాశిని సొంతం చేసుకుంటారు. పూజలు దానధర్మాలు స్వార్థబుద్ధితో తామసముతో చేసెదరు. విద్యను అన్నమును అమ్ముకొనెదరు. ధనవంతులకే గౌరవమివ్వబడును. గురుశిష్య భార్యభర్త మాతాపితభ్రాత అను సంబధములకు విలులేకుండును. ఆడంబరముగా జీవించుచూ వేదమార్గమును త్యజించి దిగంబరత్వము సమర్థించి ఆపాదమస్తకమూ కపటత్వముతో నిండియున్న వారు గురువులై అధర్మబోధలు చేశెదరు. అమంగళకరమైన వేషభూషణాదులను ధరించి శిరోజములను విరియబోసుకొనెదరు. తినదగినది తినగూడనిది అను విచక్షణ తినుటకు సమయం అసమయం అను విచక్షణ చేయక అన్నింటిని అన్నివేళలా తినెదరు. అలా పాపకూపములో పడి ఇహములో పరములో బహు క్లేశాలను అనుభవించెదరు.

కానీ ఈ కలియుగమున ఒక గొప్పగుణము కలదు. “కలౌ సంకీర్తనాన్ముక్తిః”. యొగ యజ్ఞ పూజాదులకు ఆస్కారములేని ఈ యుగములో భగన్నామస్మరణ చేసి జనులు ముక్తిని పొందెదరు. ఓ పన్నగాసనా! ఇంద్రజాలికుడు ప్రదర్శించుమాయ చూచువారిపైనే ప్రభావమును చూపును. కానీ అతనిసేవకులను అది ఏమీ చేయదు. అట్లే మాయకుమూలమైన భగంవంతుని శరణుజొచ్చిన వానికి ఆ అనూహ్యమైన మాయ అంటదు.

అట్టి కలియుగములో నేను భూవైకుంఠమైన అయోధ్యానగరములో ఒక శూద్రునిగా జన్మించినాను. మనోవాక్కర్మలచే నేను అఖండ శివభక్తుడను. కానీ నా బుద్ధిమాన్యముచే ఇతరదేవతలను దూషించుచుండెడి వాడను. అతిగర్వముతో ధనగర్వముతో నేనుండగా ఒకసారి అయోధ్యలో కఱవు వచ్చింది. దరిద్రుడనై దుఃఖితుడనై ఉజ్జయినీ నగరము చేరి అక్కడ కొంత ధనము సంపాదించి పరమ శివుని ఆరాధన కొనసాగించితిని. ఒక్కడ అతిదయాళువు నీతిమంతుడు పరమసాధువైన ఒక విప్రోత్తముడు వైదికపద్ధితిలో అహర్నిశలూ శివుని ఏకాగ్రచిత్తముతో నిష్కల్మషముగా పూజించుచుండెను. అతడు ఎన్నడునూ విష్ణు నింద చేయలేదు. కపటబుద్ధితో నేనతనికి సేవ చేయుచుండెడివాడను. ఆ భూసురుడు నన్ను పుత్రవాత్సల్యముతో చూచుచూ బోధించుచుండెను. శివభక్తినే కాక ఇతరములైన ఎన్నో నీతులను నాకతడు బోధించెను. నేను ప్రతి దినమూ దేవాలయమునకు పోయి శివనామస్మరణము చేసెడివాడను కానీ నా అహంకారమును నేను విడువలేదు. హరిభక్తులను పండిత సజ్జనులను ద్వేషించెడివాడను.

నా గురువు నా ప్రవర్తన చూసి చాల బాధపడి నిత్యమూ ఎన్నో సదుపదేశములిచ్చెడివాడు. ఆ ఉపదేశములను పెడచెవిన పెట్టి గురుద్రోహము చేయుచూ నాలోని కోపాగ్నిని ప్రజ్వలింప చేయుచూ జీవించుచుంటిని. ఇలా ఉండగా ఒక రోజు నా గురువు నన్ను పిలిచి శివకేశవుల అభేదత్వము బోధించి “పరమాత్మ అయిన శ్రీరామునికి సర్వదేవతలు బ్రహ్మ శివుడు నమస్కరించెదరు. అట్టిది నీవు ద్వేషించుట తగదు” అని అనెను. అది వినడంతో నా కోపాగ్ని మింటికెగసెను. అనర్హుడనైన నాకు విద్యనొసగిన నా గురువునకే ద్రోహము తలపెట్టాను. అయినా క్రోధాదులను జయించిన అతడు నాపై ఏమాత్రమూ కోపపడలేదు.

ఒక రోజు నేను శివాలయములో శివనామము జపించుచుండగా నా గురూత్తముడు అచటికి వచ్చెను. నా గర్వము వలన లేచి ఆయనకు నమస్కరించలేదు. దయానిధి అయిన నా గురువుకు నా దౌష్ట్యము చూచియు కొంచెముకూడా కోపమురాలేదు! కాని గురువును నిరాదరించుట మహాపాపము. పరమశివుడు ఇది చూసి సహింపలేక “ఓరీ మూర్ఖుడా! పూర్ణజ్ఞాని అయిన నీ గురువును అవమానించినావు. నీవు క్షమార్హుడవు కాదు. సద్గురువుపై ఈర్షగొన్నవాడు కోట్లాదియుగములు రౌరవాది నరకములలో పడి తరువాత పశుపక్షాది జన్మలు పొంది అటుపై వేలకొలది జన్మలు క్లేశములభవించును. నీ విప్పుడే అజగరమువై ఒక చెట్టుతొఱ్ఱలో పడివుండు” అని నన్ను శపించెను. భయకంపితుడనైన నన్ను చూసి నా గురువర్యుడు రుద్రాష్టకముతో శివుని ప్రసన్నుని చేసుకుని పశ్చాత్తాపముతో దుఃఖిస్తున్న నాకు శాపావశానము ప్రసాదించమని వేడుకొనెను. అంతట పరమేశ్వరుడు

“ఓ కృపానిధీ! మహాపకారికైనా మహోపకారము చేయు నిన్ను మెచ్చితిని. నీ శిష్యునికి శాపావశానమిచ్చెద” అని నన్ను చూసి “చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. నీవు దుర్భరమైన వేయి జన్మలెత్తుతావు. కానీ నీ గురువు మహిమవల్ల దివ్యమైన అయోధ్యానగరమున పుట్టినందువల్ల నీ మనస్సును నాయందు పెట్టి నన్ను పూజించినందువల్ల నీలో అచంచలమైన రామభక్తి ఉదయిస్తుంది. ప్రతి జన్మలో నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. వత్సా! ఇంకెప్పుడూ సాధుసజ్జనవిప్రులను నిరాదరింపవద్దు. ఇంద్రుని వజ్రాయుధముతో నాత్రిశూలముతో యముని దండముతో శ్రీహరి చక్రముతో చంపబడనివాడు సజ్జనద్రోహమనెడి అగ్నిలో పడి మాడిపోతాడు” అని చెప్పి నాపై కృపావర్షం కురిపించినాడు ఉమానాథుడు. అప్పటినుంచీ ప్రతి జన్మలోనూ నేను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ రామునిపై భక్తిని మఱువక చివరికి కాకి జన్మనెత్తి మహనీయుడైన లోమశ మహర్షి వద్ద శ్రీరామచరితమానసము విని కాకభుశుండినై శ్రీరామునికి ప్రియుడనైనాను”.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దామ్:

  గురుద్రోహం శివకేశవులను భేదబుద్ధితో చూడడం సాధుసజ్జనులను అవమానించడం ఘోరపాపములని మహాశివుడు కాకభుశుండితో చెప్పాడు. కావున మనము గర్వముతో ఇట్టి తప్పులెన్నడునూ చేయరాదు.
కాకభుశుండి గురువు యొక్క దయాగుణం మనకు ఆదర్శం కావాలి. శిష్యుడెన్ని అవమానాలుచేసినా తను చెప్పిన హితవాక్యాలను పెడచెవిన పెట్టినా ఏమాత్రమూ కోపగించుకోలేదు.
రామభక్తుడైన కాకభుశుండి కలియుగ వర్ణనము వలన మనకు చేయకూడనివి ఎన్నోతెలిసినాయి. ఇట్టి దుష్కృతాలకు దూరముగా ఉండి ధర్మమార్గములో నడచుచూ నిత్యం భగవన్నామస్మరణ చేయడమే మన కర్తవ్యమ్.

10.మాట్లాడే గాడిద


ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించటమే గాక గాడిదతో పుస్తకం కూడ చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కధనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్‌లు సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు. తాను తీసుకువచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశ్యం.

సమాయానికి బీర్బల్ కూడా సభలో ఉండటం చూసి ఆవ్యాపారి ఎంతో సంతోషించాడు.

అతను తీసుకువచ్చిన గాడిదను చూసి బీర్బల్ "మహారాజా!ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి కలదని నాకు అనిపిస్తుంది. మనం కొంచం శ్రద్ద తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం, చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది. "అన్నాడు.

అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. "అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు అవునా!" అని అడిగాడు మహారాజు
"అవును మహారాజా" అన్నాడు బీర్బల్
"మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం, వ్రాయటం నేర్చుకుంటుందని అంటావు అవునా!" అని అడిగాడు అక్బర్.

మళ్ళీ 'అవునని' చెప్పాడు బీర్బల్
వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణాయానికి వచ్చారు. ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు. ఆగాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్‌కు అర్దం కాలేదు. వెంటనే రాజుగారిని అదే ప్రశ్ననుఅడిగాడు.
బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకొని వెళ్ళు. ఓ నెల రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా ఈగాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించు. నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా! ఒక వేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం, వ్రాయాటం రాకపోతే నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. చెప్పు ఇది నీకు సమ్మతమేనా!? " అని అడిగాడు అక్బర్ చక్రవర్తి.

బీర్బల్‌కు రాజుగారి మాట మన్నించటం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది. "అలాగే మహారాజా! మీరు కోరుకున్న విధముగానే నెల రోజులలోపల ఈ గాడిదకు మాట్లాడటం, వ్రాయాటం నేర్పిస్తాను" అన్నాడు బీర్బల్.
రాజుగారు చెప్పిన విధంగా గాడిదను తీసుకొని ఇంటికి వెళ్ళాడు.
రాజుగారి సభలో ఉన్న వారంతా బీర్బల్ సాహాసానికి ఆశ్చర్య పోయారు.
"ఇదంతా జరుగుతుందా నిజంగా బీర్బల్ గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పిస్తాడా?"

ఒక వేళ ఆ పని చేయ లేకపోతే రాజుగారు బీర్బల్‌ను శిక్షిస్తారా? లేకపోతే బీర్బల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా?"
"అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా? మాట్లాడటమే రాని జంతువుకు బీర్బల్ చదవడం వ్రాయడం ఎలా నేర్పిస్తాడు?"
"బీర్బల్‌కు ఈ సారి ఎలా అయినా శిక్ష తప్పదు. అని ఓ వర్గం వారు.."

"ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటి చిక్కు సమస్యలను బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు. అలాగే ఈ సారి కూడా ఎంతో తెలివిగా ఈ సమస్యను పరిష్కరిస్తాడు" అని మరొక వర్గం వారు.

ఈవిధంగా సభ రెండుగా చీలిపోయింది. ఒక వర్గం బీర్బల్‌కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్‌కు వ్యతిరేకంగా ఉంది.

ఈ విధమైన ఊహాగానాలతో నెలరోజులు గడిచిపోయాయి. గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది. గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు.

"బీర్బల్! గాడిదకు వ్రాయటం, చదవటం వచ్చినదా!?" కుతూహలంగా అడిగాడు అక్బర్.
"చిత్తం మహారాజా" అన్నాడు బీర్బల్.
బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవారంతా ఆశ్చర్య పోయారు.
"గాడిదకు నిజంగా చదవటం, వ్రాయటం వచ్చిందా!"
"ఎప్పటిలాగే ఈసారి కూడ బీర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు" "బీర్బల్‌కు ఈసారి శిక్ష తప్పదు."
ఈవిధంగా తమలో తాము మాట్లడు కోసాగారు.
"బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా? గాడిద నిజంగా చదువుతుందా?" అడిగాడు అక్బర్ చక్రవర్తి.
"ఏదీ అయితే గాడిదతో ఏదైనా చదివించు" అడిగాడు అక్బర్ చక్రవర్తి.

వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకొని గాడిద ముందు పెట్టాడు. సభలో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుకతో పుస్తకంలో పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. ఆవిధంగా తిప్పుతూ మూడవ పేజికి రాగానే గట్టిగా చదవటం మొదలు పెట్టింది.
ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి, సభలో ఉన్న మిగతావారు ఆశ్చర్యంతో ముక్కున వేలువేసుకున్నారు.

"అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి. నిజంగా నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు. నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి" అంటూ బీర్బల్‌ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు.
బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రసంశలు స్వీకరించాడు.
"అదిసరే బీర్బల్ ఇంతకి ఆ గాడిద ఏమంటున్నది.?" అని అడిగాడు మహారాజు
"అది ఏ మంటున్నదో తెలియాలంటే మనకు గాడిద బాష తెలియాలి మహారాజా!" అన్నాడు బీర్బల్.

అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏమిటో అర్దం అయ్యిది. "సరే మనకు గాడిద బాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లడుతుందో మనకు తెలియదు. ఆ విషయం ప్రక్కన పెట్టు. కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది. అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది. చెప్పు బీర్బల్! నువ్వేం చేస్తావు.? పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు?" అని అడిగాడు అక్బర్.

అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు "మహారాజా! ఆరోజున గాడిదను చూచి దాన్ని మీదగ్గర మెచ్చుకుంటే ఆవ్యాపారకి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాను. అందుకే మీ ముందు అలా చెప్పాను. మీరు వెంటనే నెల రోజులు సమయం ఇచ్చి గాడిదకు చదవటం, వ్రాయటం నేర్పించమని చెప్పారు. జంతువులతో మాట్లాడించటానికి నాకు ఏలాంటి ఇంద్రజాల విధ్యలు తెలీవు కాని ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతోందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను. తీరా అసలు సంగతి విన్నాక మీరు నన్ను శిక్షించకూడదు." అన్నాడు బీర్బల్.
అక్బర్ అందుకు అంగీకరించాడు.

"మహారాజా! గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమి పెట్టలేదు. దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది. మరునాడు ఇదిగో ఈపేజీలో గడ్డి పెట్టాను. అంతే అసలే ఆకలి మీద ఉంది దానికి తోడు పుస్తకం లోంచి గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబ పుస్తకం తెరచి మొదటి పేజి తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది. మరునాడు రెండో పేజిలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను. పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉంటానని గాడిద అనుకోవడం మొదలు పెట్టింది. దాంతో రెండో రోజు కూడ పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబ మొదటి పేజీ తిప్పింది. దానికేమి కనిపించ లేదు. వెంటనే రెండో పేజీ తిప్పింది. ఈసారి అక్కడ గడ్డి కనిపించింది. మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదో గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. ఈవిధంగా షుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను. అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అంటూ తను ఏవిధంగా గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్.
అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్‌ను ఎంతగానో అభినందించారు.
ఇక రాజుగారైతే బీర్బల్‌కి బోలెడన్ని బహుమానాలు ఇచ్చారు.

11. కృష్ణుడితో అర్జునుడి యుద్ధం


అర్జునుడు మాట తప్పనివాడు. ఒకసారి అర్జునుడు ధ్యానాన్ని పూర్తి చేసుకుని తన మందిరానికి బయలుదేరబోతూ వుండగా అక్కడికి 'గయుడు' అనే గంధర్వ రాజు వస్తాడు. వస్తూనే అనేక విధాలుగా అర్జునుడి శౌర్య పరాక్రమాలను, సుగుణాలను ప్రస్తుతిస్తూ పాదాలపై పడతాడు. తనకి రక్షణగా నిలుస్తానని మాట ఇస్తే తప్ప అక్కడి నుంచి కదిలేదిలేదని అంటాడు.
 
దాంతో తాను ఉండగా అతని ప్రాణాలకు వచ్చే భయమేమీ లేదని అర్జునుడు మాట ఇస్తాడు. తాంబూలం సేవిస్తూ తాను ఆకాశ మార్గాన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ ఉన్నాననీ, ఆ తాంబూలాన్ని ఉమ్మివేయగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తోన్న శ్రీకృష్ణుడి దోసిట్లో పడిందని గయుడు చెబుతాడు. తనని సంహరిస్తానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేయగా భయంతో శరణు కోరి వచ్చానని అంటాడు.
 
అసలు విషయం తెలుసుకున్న అర్జునుడు నివ్వెరపోతాడు. బంధువు ... భగవంతుడు అయిన కృష్ణుడితో యుద్ధం చేయవలసి ఉంటుందనే విషయం ఆయనకి అర్థమై పోతుంది. అయినా ఇచ్చిన మాటకి కట్టుబడి గయుడి పక్షాన నిలుస్తాడు. అహంకారంతో ప్రవర్తించిన గయుడిని అర్జునుడు వెనకేసుకు రావడం కృష్ణుడికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది.

కృష్ణుడి పట్ల ప్రేమానురాగాలు ... గౌరవము ఉన్నప్పటికీ, గయుడికి ఇచ్చిన మాట కోసం అర్జునుడు యుద్ధరంగంలోకి దిగుతాడు. ఇద్దరి మధ్య యుద్ధం పతాకస్థాయికి చేరుకుంటూ వుండగా, బ్రహ్మాది దేవతలు వచ్చి వాళ్లని శాంతింపజేస్తారు. గయుడిని క్షమించిన కృష్ణుడు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం కోసం, తనతో బంధుత్వాన్ని కూడా పక్కనబెట్టి యుద్ధం చేసిన అర్జునుడిని అభినందిస్తాడు.

12.మర్యాదరామన్న కథలు



సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు - ఆ గొర్రెల కాపరి దంపతులకు, రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా, బుద్ధి వికసించలేదు. చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకు రమ్మని అడవికి పంపితే, అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు. తండ్రి "నీ మొహం చూపించ వద్ద" ని వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి. "అదృష్టం నిన్ను వరిస్తుంది. నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది" అని, వరం ఇచ్చింది కాళికాదేవి. ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచీ రామన్న కాస్తా మర్యాద రామన్నగా అందరి మన్ననలూ అందుకోసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. రామన్నకి ధర్మ బద్ధమైన న్యాయవేత్తగా - తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు, నలుగురు దొంగలతో తగువొచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం, వాళ్ళెప్పుడో అమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలూ, నలుగురూ కలిసి అడగ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటూండగా, వాళ్ళని చూపిస్తూ నలుగో దొంగ, పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటునుంచి అటే ఉడాయించాడు.

ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, "ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే" అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమనీ కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

శేషయ్య అనే రైతు, పెళ్ళి వేడుకల కోసం, ఖాన్ దగ్గర గుర్రం అద్దెకు తీసుకున్నాడు. దురదృష్టవశాన అది మరణించింది. శేషయ్య గుర్రం ఖరీదు ఇస్తానంటే, ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు. మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు. ఖాన్, మర్నాడొచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకు రమ్మన్నాడు. ఆ రాత్రి శేషయ్య ఇంట్లో, తలుపు తోయగానే పగిలేలా కుండలు పేర్పించాడు. ఖాన్ వచ్చి తలుపు తోసేసరికి కుండలన్నీ పగిలాయి. తన కుండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు. చనిపోయిన ఆ గుర్రానికీ, పగిలిన ఈ కుండలకీ చెల్లు! ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న.

రంగమ్మకీ, గంగమ్మకీ వీశెడు నెయ్యి బాకీ దగ్గర తగువొచ్చింది. రెండు గేదెల పాడి వున్న రంగమ్మ దగ్గర, ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా, ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు. ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, "అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?" అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. "ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?" అడిగాడు పేరయ్య.

"పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది" అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు పెట్టుకుంటూ, అందరితోనూ "ధర్మప్రభువు మర్యాద రామన్న" అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు. చరిత్రలో నిలిచిపోయాడు. 

13.అక్షయపాత్ర



అనుద్యూతంలో కూడా ఓడిపోయాకా అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలూ, కృష్ణజినమూ ధరించారు. కందమూల ఫలాలు తింటూ పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి సంసిద్ధులయ్యారు.

అలా వెళ్తున్న వాళ్ళను చూసి –

“ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాది, మృత్యుపుల్లగా కర్ణుడు, సైంధవుడు , శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం” అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు.

“నాయనలారా! మేము సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలే తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా కష్టపడటమెందుకు? మామీద అనుగ్రహముంచి వెనెక్కి వెళ్ళిపోండి” అని పాండవులు బ్రతిమాలారు.

“ధర్మరాజా! నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించినవాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు. అలాంటప్పుడు మీ మీద భక్తి కలిగి నిన్నాశ్రయించిన మమల్ని విడిచిపెట్టటం మీకు భావ్యమా?” అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడే శౌనక మహాముని అక్కడకు వచ్చాడు.

“మహాత్మా! అతిథులను, అభ్యాగతులనూ అర్చించడం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసుకదా! అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను?” అని ధర్మరాజు సంశయం వెల్లడించాడు.

“నాయనా! తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు. అందుచేత నువ్వు నియమవంతుడై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో” అని శౌనకుడు ధర్మరాజుకు తగిన సందేశ మిచ్చి ప్రయాణమయ్యాడు.

‘శౌనక మహాముని చెప్పినట్టు తపస్సు చేయాలి! కాని ఎవరి నుద్దేశించి తపస్సు చేయాలి?’ ఇంకో ధర్మసందేహం వచ్చింది ధర్మరాజుకు. వెంటనే ధౌమ్యులవారికీ సంగతి చెప్పాడు.

ధౌమ్యుడు చాలా సేపు ఆలోచించి ” ధర్మరాజా! పూర్వం భూతజాలమంతా ఆహారం కోసం పరితపించింది. ఆ ఆర్తనాదాలు విని కమలబాంధవుడు కరుణతో కరిగిపోయాడు. ఉత్తరాయణంలో ప్రవేశించి ఉర్వీరసాన్ని గ్రహించాడు. దక్షణాయనంలో ప్రవేశించి పర్జన్యుడై ఓషధులు సంగ్రహించాడు. రాత్రి వేళల్లో చంద్రకిరణాల్లో ఉన్న అమృతంతో ఆ ఓషధులను తడుపుతూ అభివృద్ధిపరిఛాడు. వాటిల్లోంచి అన్నం పుట్టి ప్రజా సంరక్షణం జరిగింది. అందుకే అన్నం ఆదిత్యమయమంటారు. పూర్వం రాజర్షులందరూ సూర్యభగవానుణ్ణి ప్రార్థించి అన్నం సంపాదించి ప్రజలందర్నీ ఆపదలపాలు కాకుండా కాపాడారు. పాండవాగ్రజా! ఆదిత్యుడు లోకానికి ఆదారమైనవాడు. త్రిమూర్తుల స్వరూపాలు అతనిలో ఉన్నాయి. ముల్లోకాలూ అతని కనుసన్నల్లో సుఖంగా జీవిస్తున్నాయి. అతడు అంధకారాన్ని మింగి లోకానికి వెలుగును అందించే ప్రత్యక్షదైవం! కనుక నువ్వు కూడా ఆ కరుణామయుణ్ణి పూజించి అతని అనుగ్రహం సంపాదించు” అని ధౌమ్యుడు కర్తవ్యం బోధించాడు. ధర్మరాజు ధౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు. అతని జపానికి మెచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు.

” పాండునందనా! ఇదిగో ఈ తామ్రపాత్ర గ్రహించు. ఈ పన్నెండు సంవత్సరాలూ నీ వంటింట్లో ద్రుపదకుమారి వండిన కందమూలాలన్నీ అక్షయములైన నాలుగు రకాల ఆహార పదార్థాలవుతాయి” అని సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయపాత్రను ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ధర్మరాజు అపరిమితానందంతో ఆ పాత్రను తీసుకుని పర్ణశాలకు తిరిగి వచ్చాడు. అప్పటినుంచి అక్షయపాత్ర వల్ల ద్రౌపతీదేవి అడిగినవారికి లేదనకుండా భోజనాలతో సంతృప్తులను చేస్తూ వుండేది.