telugu short stories 2

1.మనశ్శాంతి
2.మంచి మిత్రుడు
3.కుమారస్వామి వృత్తాంతం
4.బంగారు హంస
5.మంచి మాట
6.దత్తాత్రేయ అవతార కథ
7.మంచి పని
8.భేషజాల కప్ప
9.బాణాసురుడు
10.బుద్ధి బలం


1.మనశ్శాంతి



రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగుపొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా, హయిగా ఉండేవాడు. ధనం లేక పోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు.


సోమయ్య ఎప్పుడూ ఆదుర్దాగా, ఏదో ఆలోచనలో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలోని డబ్బును కాజేస్తాడేమోనని భయపడేవాడు సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య.


ఒక రోజు సోమయ్య రామయ్యను పిలిచి నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు.


రామయ్యకు కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టె వంకే చూస్తూ కాలం గడిపాడు సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది.


తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్ళి సోమయ్యకు తిరిగి ఇచ్చి నేను పేదవాణ్ణి సోమయ్యా నన్ను ఇలాగే ఉండనివ్వు నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తోంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు. 



2.మంచి మిత్రుడు (పావురం - ఎలుక)



పూర్వం గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న 'లఘుపతనక' అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది. ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది.


'అయ్యో! పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూసాను. ఈ రోజు నాకు ఏ ఆపద రానున్నదో...' అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు.


ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకు 'చిత్రగ్రీవుడు' అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేలమీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురములతో 'మిత్రులారా! మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షులకోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొనితెచ్చుకోవద్దు' అంటూ హెచ్చరించాడు.


ఆ గుంపులో ఉన్నా ఓ ముసలిపావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి 'చిత్రగ్రీవా! నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకొనుట మూర్ఖత్వము. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశములో మనుషులు తిరగరని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించతగ్గ విషయం ఏ మాత్రం కాదు. ఆ బూరుగు చెట్టుమీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత అవితినటానికి మనం క్రిందకు దిగుదాం!' అంటూ చిత్రగ్రీవుడి హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది.


ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన పావురములు వంత పాడుతున్నట్లుగా ఉండటంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చుట కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. చిత్రగ్రీవుడి మౌనం అర్ధాంగీకారంగా భావించిన పావురములన్ని నూకలను తినటానికి నేలమీద వాలి వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయాయి.


చిత్రగ్రీవుడి మాట వినకుండా ముసలిపావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని మిగిలిన పావురాలన్నీ కోపంతో తిట్టసాగాయి. చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ 'మిత్రులారా! వివేకవంతుడు కూడా ఒక్కొక్క సారి ఆవేశంవల్ల, దురాశ వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనలో మనం గొడవపడితే మంచిదికాదు' అన్నాడు. చిత్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురాలన్ని శాంతించాయి. వలకు కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు వలలో చిక్కుకున్న పావురములను చూసి 'ఆహ! పొద్దున్నే ఎవరి మొహం చూసానోగానీ... ఈ రోజు నా పంట పండింది' అనుకుంటూ పొదలోంచి లేచి వలవైపు రాసాగాడు.


వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి 'మిత్రులారా! వేటగాడు వస్తున్నాడు. మనమందరం ఒక్కసారి బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకుంటాం. ఆ తరువాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు, అతని దగ్గరకు వెడదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు' అని మిగిలిన పావురములతో చెప్పాడు. చిత్రగ్రీవుడి ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి. వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాటికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపాలాడించాయి. రివ్వుమంటూ వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాయి.


వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడకి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్ని ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్య బారి పోయాడి. వెంటనే తెలివితెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు. పావురములన్ని ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివశిస్తున్న చెట్టు దగ్గర వాలాయి. పావురముల రెక్కల శబ్ధమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టుతొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు. అప్పుడు చిత్రగ్రీవుడు 'మిత్రమా! నేను చిత్రగ్రీవుడిని' అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్ని కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధ పడ్డాడు.


చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి 'మిత్రమా! స్నేహితుడు ఆపదలో ఉన్నపుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని రక్షించు' అన్నాడు. చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ 'మిత్రమా! నీ కోరిక తప్పక మన్నిస్తాను. కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్ళకున్న తాళ్ళను కొరుకుతాను' అన్నాడు. హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి... ' అలాగే కానివ్వు మిత్రమా! కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్ళను కొరికి ఆ తరువాత నా కాళ్ళకున్న తాళ్ళను కొరుకు' అన్నాడు.


'చిత్రగ్రీవా! తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము' అన్నాడు హిరణ్యకుడు. 'హిరణ్యకా... మనలని నమ్మిన వారిని రక్షించుట మన ధర్మం. అదే న్యాయం, అందుకే ముందు ఈ పావురాలని రక్షించి ఆ తరువాత నన్ను రక్షించు. 'చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కొరికి వాటిని రక్షించెను.


చూసారా! ప్రతివారికీ అపద సమయంలో ఆదుకొనుటకు ఓ మంచి మిత్రుడు ఉండాలి. 'మిత్రలాభము కంటే మించిన లాభము లేదు' అన్నది ఈ కధలోని నీతి. నాలుగు రూపాయలను వెనకేసుకోవటం కంటే నలుగురు మిత్రులను సంపాయించుకున్నవాడే నిజమైన ధనవంతుడు, గుణవంతుడు అని చెప్పటం కూడా ఈ కధలోని ఉద్దేశం. 


3.కుమారస్వామి వృత్తాంతం


ధర్మరాజు "మహర్షీ ! మహాసేనాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడెలా అయ్యాడు " అని అడిగాడు.


*దేవసేన*


మార్కండేయుడు " ధర్మరాజా ! పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడి పోయాడు. రాక్షసులను గెలవడమెలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశమార్గంలో తీసుకు వెళ్ళడం చూసాడు. దేవేంద్రుడు తనవజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గధాయుదాన్ని ఇంద్రుని మీద విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గధను ముక్కలు చేసాడు. కేశి ఆస్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి " నీవెవరు? ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు? " అని అడిగాడు. ఆమె " అయ్యా! నాపేరు దేవసేన, నా అక్క పేరు దైత్య సేన మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకు పోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు " అని చెప్పింది. 


ఇంద్రుడు మీ తల్లి మాతల్లి దక్షుని పుత్రికలు. అందు వలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో " అని దేంద్రుడు అడిగాడు. ఆమె " దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు " అని కోరింది. ఆమె మాటలు విని దేవేంద్రుడు " ఈ రోజు అమావాస్య సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు " అని అనుకున్నాడు. దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. బ్రహ్మదేవుడు " దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాదిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు " అన్నాడు.


*కుమారసంభవం*


వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్ని దేవుని ఆహ్వానించారు. అగ్నిదేవుడు సర్వాలంకార భూషితలై భర్తల ప్రక్కన సప్త ఋషి పత్నులను చూసి మోహించాడు. వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడ్డాడు. హోమం ముగిసింది అగ్ని దేవుడు విరహంతో బాధపడ్డాడు. అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసికట్టింది. తన భర్త కోరిక తీర్చడానికి అంగీరసుని భార్య శివ రూపంలో భర్త దగ్గరకు వచ్చి " నేను అంగీరసుని భార్యను. నా తోటి వారైన సప్త ఋషుల భార్యలపై నీకు వలపు ఏర్పడింది మేమంతా నీ కోరిక తీర్చాలనుకున్నాము. నీ మనస్సు తెలుసు కోవడానికి నన్ను పంపారు " అన్నది. అగ్ని దేవుని ఆనందానికి అవధులు లేవు ఆమె యందు తన కోరిక తీర్చుకున్నాడు. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్న రెల్లు కుండలో దాచింది. ఇలా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరచింది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించ లేక పోయింది.

ఆ విధంగా ఆరు మార్లు కూర్చిన అగ్ని తేజస్సుతో కుమారస్వామి ఆరు ముఖాలతో అగ్ని తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మించాడు. శుక్లపక్ష పాడ్యమి నందు వీర్య సేకరణ, విదియ నందు గర్భం ధరించడం, తదియ నందు రూపం ఏర్పడటం, చవితి నందు అన్ని అవయవాలు ఏర్పడి, పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి శివుని విల్లు ధరించడం జరిగింది. కుమారస్వామి విల్లు ఎక్కు పెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకం అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి. కుమారస్వామి వాటిని తన చేతులతో అణచి పెట్టాడు. ఒక చేత్తో తనకు సహజసిద్ధంగా లభించిన శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరించాడు. బొటన వేలిని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేతపర్వతాన్ని భేదించాడు. ఆరు ముఖాలతో సింహనాదంచేసాడు. ఆ సింహనాదానికి పర్వతాలు చలించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేసారు. అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్న జనం " సప్తఋషి పత్నులకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి " అని ఆక్రోశించారు. ఈ అపనిందని భరించలేక ఋషులు తమ భార్యలను వదిలి వేసారు. కొందరు మాత్రం " ఇందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగినిదేవుని చేరింది " అని చెప్పుకున్నారు. స్వాహాదేవి " అయ్యా! ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. వారిని స్వీకరించండి " అని చెప్పింది. ఋషులు ఆమె మాటలు విశ్వసించ లేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని అగ్ని కుమారునకు జాతక కర్మలు చేసాడు.


దేవేంద్రుడు యుద్ధముకు వచ్చుట


దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి " దేవేంద్రా! అగ్ని కుమారుడు తేజోవంతుడు, గర్వం కలవాడు. అతని వలన నీ పదవికి ముప్పు రాగలదు. నీ పదవి దక్కాలంటే వెంటనే అతనిని సంహరించడం మంచిది " అన్నారు. దేవేంద్రుడు సప్త మాతృకలను పిలిచి " మీరు అగ్ని కుమారుని సంహరించండి " అని ఆజ్ఞాపించాడు. అందుకు అంగీకరించి వెళ్ళిన సప్త మాతృకలు బాలుని తేజస్సు చూసి భయపడి అతనిని శరణు వేడారు. కుమార స్వామి వారిని మన్నించాడు. సప్త మాతృకలు బాలుని సంరక్షణ కొరకు లోహితాస్య అనే దాదిని సృష్టించారు. అగ్నిదేవుడు కుమారుని సంరక్షణా భారం స్వీకరించాడు. ఇది తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహించి తన సేనలతో కుమారస్వామి మీదకు దండెత్తి వచ్చాడు. కుమారస్వామి ముఖము నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు భయపడిన దేవతలు అతనిని శరణుజొచ్చారు. దేవేంద్రుడు కుమారస్వామి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారస్వామి కుడి భాగాన్ని తాకగా అందు నుండి బంగారు చాయతో, మేషముఖంతో శక్తి ఆయుధంతో ఒక పురుషుడు జన్మించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు అనేక మంది బాల బాలికలు పుట్టారు. ఇది చూసిన దేవేంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడాడు.


కుమారస్వామి దేవతల మన్ననలను అందుకొనుట,  


దేవతలు సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చెంత చేరారు. దేదీప్యమానంగా వెలుగుతున్న అగ్ని పుత్రుని చూసి లక్ష్మీ దేవి సాకారమై అతని చెంతన నిలిచింది. ఆరవదినం ఋషులు కుమారస్వామిని భక్తితో నమస్కరించి " దేవా! నీవు పుట్టిన ఆరుదినములకే లోకాలను జయించావు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, సుపరిపాలనా దేవేంద్రుని కర్తవ్యం. షణ్ముఖా నీవు అందుకు తగిన వాడివి కనుక ఇంద్ర పదవిని స్వీకరించుము " అని దేవతలు, ఋషులూ అడిగారు. ఇంద్రుడు " కుమారస్వామీ! నీవు శౌర్యవంతుడవు కనుక ఇంద్రపదవిని అంగీకరించుము " అని అడిగాడు. " దేవేంద్రా! నాకు ఇంద్ర పదవి అక్కర లేదు. నీ తేజస్సు చూసి దేవతలు తిరిగి నీవే ప్రభువు అని మోహంకలుగ చేసిన నీకు నాకు శత్రుత్వం వస్తుంది కనుక ఆ పదవిలో నీవే ఉండు " అని కుమారస్వామి అన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలకు ఆనందించాడు.


"కుమారా! నీవు మా సేనలకు ఆదిపత్యం వహించు " అని ఇంద్రుడు కుమారస్వామిని అడుగగా అతడు అందుకు అంగీకరించాడు. ఋషులు దేవతలు జయజయధ్వానాలు చేసి కుమారస్వామిని దేవ సేనాధిపతిగా అభిషేకించారు. మహాశివుడు అక్కడకు వచ్చి కుమారస్వామిని చేరదీసి విశ్వకర్మచే కూర్చ బడిన బంగారు పుష్పమాలను బహూకరించాడు " అని చెప్పగా ర్మరాజు ఇక్కడ ఒక సందేహం వెలిబుచ్చాడు " మహర్షీ! కుమారస్వామి రుద్రాంశ సంభూతుడంటారు కదా అదెలా సంభవించింది " అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుతో " ధర్మరాజా! పూర్వం శివుడు తన తేజస్సును అగ్నియందు ప్రవేశపెట్టాడు. ఆ వీర్యము చేత అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అగ్నికి రుద్రుడనే నామాంతరం కూడా ఉంది. అందుచే కుమారస్వామిని అగ్ని పుత్రుడు, శివపుత్రుడు అని కూడా అంటారు " అన్నాడు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృత్తికల రూపంలో ఆరుగురు ముని పత్నుల రూపంధరించి భర్తను చేరి కుమారస్వామికి జన్మ ఇచ్చినందున కార్తికేయుడనే నామం కలిగింది. ఈ సమయమున దేవేంద్రుడు తన వద్ద పెంచుకుంటున్న దేవసేనను అక్కడకు రప్పించి " కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను స్వీకరించు " కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు.

4.బంగారు హంస



ఒక ఊరి చివర, అడవికి దగ్గరలో ఒక సరోవరం ఉండేది. ఆ సరోవరంలో ఒక బంగారు హంస ఉండేది. దాని ఒళ్ళంతా బంగారు ఈకలు. ఆ సరోవరం పక్కన ఒక చిన్న గుడిసెలో ఒక ముసలి అవ్వ తన ఇద్దరు మానవరాల్తో కలిసి ఉండేది. వాళ్ళు ఎంతో బీదవాళ్లు, కస్టపడి జీవనం సాగించేవాళ్ళు. అయినా పక్కన సరోవరంలో ఉన్న హంసకి తిండి పదార్ధాలు పెట్టేవారు. ఒక రోజు ఆ బంగారు హంస, "పాపం! వీళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నారో, వీళ్ళకి రోజుకొక బంగారు ఈకను ఇచ్చిన వీళ్ళ కష్టాలు తీరిపోతాయి" అనుకుంది. ఆ రోజు నుండి, రోజు హంస అవ్వ ఇంటికి వెళ్లడం, రోజుకొక బంగారు ఈక ఇవ్వడం మొదలు పెట్టింది. ముసలి అవ్వ, తన మనవరాళ్లు కష్టాలు కొద్దిగా తగ్గాయి. ఇది ఇలా ఉండగా, ఒక రోజు దురాశపరుడైన, అవ్వ తమ్ముడు ఇంటికి వచ్చాడు. బంగారు హంస అవ్వకి ఈక ఇవ్వడం చూసి, అతనికి మనసులో దురాశ కలుగుతుంది. అవ్వతో ఇలా అంటాడు, "రోజు బంగారు ఈకలు ఇచ్చే ఈ హంస ఏదొక రోజు మాయమైతే ఏమి చేస్తావు? వెళ్లిపోదని నమ్మకం ఏంటి? రేపు ఆ హంస వచ్చినప్పుడు దాని ఈకలన్నీ పీకేద్దాం, అప్పుడు జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు" అని చెడు ఆలోచనలు అవ్వ మనసులో నింపుతాడు. అవ్వకి ఇష్టం లేకపోయినా బలవంతపెడతాడు. మరుసటి రోజు హంస రాగానే, దాని ఈకలన్నీ పీకేస్తారు. అప్పుడు హంస "మీకు సహాయం చేద్దామని వచ్చిన నన్ను బాధపెట్టారు కదా, ఇప్పుడు మీరు పీకిన ఈ ఈకలు మాములు ఈకలతో సమానం" అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్కడ పడున్న ఈకల్ని మాములుగా మారిపోతాయి. అవ్వ ఎంతో బాధ పడుతుంది చేసిన తప్పుకి.

5.మంచి మాట


ఒక దుప్పి తనను వెంబడిస్తున్న వేట తోడేళ్ల నుండి తప్పించుకునేందుకు ఒక గొడ్లచావిడిలో దూరింది. ప్రాణభయంతో తమ చావిడిలో దూరిన దుప్పిని చూస్తూ ఒక ఎద్దు, "మిత్రమా! ఎందుకు నీ అంతట నీవే నీ శత్రువు గూటిలోకి దూరావు? ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో!" అని హెచ్చరించింది.


బదులుగా దుప్పి, "మిత్రమా! దయచేసి నేనెక్కడ ఉన్నానో అక్కడే ఉండనివ్వు. తప్పించుకునేందుకు సరైన అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి జారుకుంటాను" అని చెప్పింది. సాయంకాలం కాగానే కొందరు పనివాళ్లు వచ్చి గొడ్లచావిడిలోని ఎద్దులు, ఆవులకు గడ్డి, దాణా వేసి వెళ్లారు. కాని అక్కడే, ఎద్దులు, ఆవులతో పాటే వున్న దుప్పి ఉనికిని కనిపెట్టలేకపోయారు. పశువులు తమతోపాటే దుప్పిని కుడా గడ్డి మేయమని కోరాయి. కాని, "మిత్రమా! నువ్వు ఇప్పుడు మాతో పాటే గడ్డి మేయచ్చు. ఇప్పుడు వెళ్ళినవారు నిన్ను పసిగట్టలేదు. కాని నీకు పొంచివున్న ముప్పు తప్పిపోలేదు. ఇప్పుడు మా యజమాని వస్తాడు. అతడు వచ్చి వెళ్ళేవరకు నీకు ఆపద సమయమనే చెప్పాలి" అని అన్ని పశువులూ ముక్తకంఠంతో దుప్పిని తమ చావిడ్లో నుంచి వెళ్ళిపొమ్మని చెబుతుండగానే యజమాని రానేవచ్చాడు.


వచ్చీ రావడంతోనే, "నా పశువులకు నేను వేసే దాణా ఎందుకు సరిపోవడం లేదు. నేను వాటి ఖాళీ కడుపులను గమనిస్తున్నాను. ఇందులో ఏదో తిరకాసుంది" అంటూ చావిడంతా కలియదిరిగాడు. అన్ని పశువుల మధ్యలో రాటుదేలిన దుప్పి రాటుదేలిన కొమ్ములను కళ్లారా చూసిన యజమాని తన పనివారిని పిలిచి, దుప్పిని బంధించమని పురమాయించాడు.

పాపం! పశువుల మంచి మాట పెడచెవిన పెట్టిన దుప్పి గొడ్లచావిడి యజమాని చేతిలో బందీ అయిపోయింది. 

6.దత్తాత్రేయ అవతార కథ

బ్రహ్మవిష్ణు మహేశ్వరులను ఒకే రూపంలో చూడాలని నారదుని కోరిక. అప్పుడు భూలోకానికి అత్రిముని ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చాడు. ముని భార్య అనసూయ మహాపతివ్రత. తన పాతివ్రత్యాన్ని గురించి లక్ష్మీ, పార్వతి, సరస్వతులతో చెప్పగా వారు అసూయతో తమ భర్తలను పంపి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షిస్తామని చెప్పి, త్రిమూర్తులను పంపారు. త్రిమూర్తులు బ్రాహ్మణుల వేశంలో ఆశ్రమానికి వచ్చి తమకు ఆకలిగా ఉందని అనసూయ విగత వస్త్రయై తమకు అన్నం ప్టోలని కోరారు. అత్రిముని దివ్యదృష్టితో చూసి వీరు సామాన్యులు కారని చెప్పగా వెంటనే తన భర్త ఇచ్చిన మంత్రోదకం వారిపై చల్లగా వారు పసిపిల్లలుగా మారిపోయారు. వారికి అనసూయ తన స్తన్యం ఇచ్చి తృప్తిపరిచింది.  నారదుడు అక్కడికి వచ్చి త్రిమూర్తులు చిన్నారి శిశువులై ఉన్నవారిని చూసి ఆనందించి, వారి విషయం త్రిమూర్తుల భార్యలతో చెప్పితే తమకు చూపించమన్నారు. వారు వచ్చి తమ భర్తలను తమకు ఇవ్వమని చెప్పగా అనసూయ భర్త ఆజ్ఞ మేరకు శిశువులపై మంత్రోదకాన్ని చల్లితే వారు మామూలు మనుషులౌతారు. త్రిమూర్తులు ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమనగా త్రిమూర్తులు తమకు పుత్రుడుగా పుట్టాలని కోరారు. అలా వరప్రభావంతో జన్మించినవారే దత్తాత్రేయులు.దత్తాత్రేయుడు ప్రకృతిని ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని గురువుగా స్వీకరించాడు. ఇతనికి మొత్తం 24 మంది గురువులు. ఇంతమంది గురువులు ఉన్నదైవం మరెవరూ ఉండరు. దత్తాత్రేయుని భార్య పేరు అనఘా. అఘం = పాపం, అనఘా అంటే పాపం అంటనిది అని అర్థం.దత్తుడు అంటే ఇవ్వబడేవాడు అని అర్థం. జ్ఞానాన్ని అందించేవాడు. దత్తాత్రేయ దేవాలయాలు,  గాణగాపురం, కురువపురం, పిఠాపురం, లాిం క్షేత్రాలు దత్త సంప్రదాయాన్ని పాించేవి ఎక్కువగా ఉంటాయి.సాయిబాబా, నృసింహసరస్వతీ లాటివారందరూ దత్త్త సంప్రదాయ భావనలోఉన్నవారే. భగవత్‌ ప్రార్థన గట్టిగా చేసినప్పికి, గురు ప్రార్థన చేసినప్పికి వ్యక్తికి కావలసిన అవసరాలు, జ్ఞానం అందుతాయి. ఆకాశం, శక్తి రెండూ కలిసి ఉంటాయి కాబ్టి ఏదో ఒక రూపం లేదా భావన ద్వారానో మనకు సమాచారాన్ని అందించేవాడు గురువు. భగవంతుడిని చూపించే శక్తి, భగవంతుడు అంటే ఎవరో కూడా చెప్పేవారే గురువులు. దత్తాత్రేయ స్వామి దగ్గర 4 కుక్కలు నాలుగు వేదాలకు ప్రతీకలు.శిష్యులలోని అంధకారం అనే చీకిని, అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవారు గురువులు. ఆ గురువులకే గురువు దత్తాత్రేయస్వామి. కాబట్టే తాను లోకగురువైనాడు. ఆకాశ తత్త్వానికి సంబంధించినవాడు గురువు. ఆకాశం లేనిచోటు అనేది ఉండదు. కాబ్టి గురువు లేని ప్రదేశం ఎక్కడా ఉండదు. తల్లి మొది గురువు. ఆ తల్లికే గురువు దత్తాత్రేయ స్వామి. ఆ స్వామి ఆరాధనను చేసి అందరూ లోకంలో అంధకారాన్ని తీసేసి జ్ఞానాన్ని పెంచుకునే మార్గంలో ప్రయాణం చేద్దాం.

7.మంచి పని

రామయ్య, సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తరువాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడు కోవటం కూడా మానేశారు.ఓ రోజు రామయ్య ఇంటి తలుపును ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి. "అయ్యా...చాలా దూరం నుంచి వచ్చాను. ఏదైనా పనుంటే ఇప్పించండి." అని వడ్రంగి అడిగాడు.రామయ్య కొంచెం ఆలోచించి, 'అటు చూడు...ఆ కాలువ కనిపిస్తోంది కదా! దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటు వైపు రావటం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికే అంత పౌరుషముంటే నాకెంతుండాలి. కాబట్టి నువ్వేం చేస్తావో తెలీదు. వాడి ముఖం నేను చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు' అన్నాడు రామయ్య.అలాగే అన్నట్లు తలూపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావల్సిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య.'నాకు ఓ దీపం ఇప్పించి మీరు నిశ్చింతగా నిద్రపొండి. తెల్లారే సరికి నా పని పూర్తి చేస్తాను' అన్నాడు వడ్రంగి.తెల్లారింది, ఇక తమ్ముడి ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్ర లేచాడు రామయ్య. కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదు. దానికి బదులు కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు మారాయి.'అన్నయ్యకి నాపై కోపం తగ్గొందేమో! ఇటుపైపు రావటానికి వంతెన నిర్మించాడు' అనుకున్నాడు సొమయ్య.'తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది' అనుకున్నాడు రామయ్య.ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ల దగ్గరకి వచ్చాడు.'నన్ను క్షమించండి. మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేధాలు ఇంకాపెరుగుతాయి. నేనలా చెస్తే శాశ్వతంగా మీరు విడిపోయే వారు. ఆ పాపం నాకొద్దు. అందుకే వంతెన నిర్మించాను' అన్నాడు. ఇందులో క్షమించాల్సింది ఏమి లేదు. మనం చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియచేశావు. అందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. అని వడ్రంగికి బహుమానాలిచ్చి పంపించారు రామయ్య, సోమయ్య. >దేవ, దానవులు క్షీరసాగరం మథిస్తూంటే.,అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా.. అన్న విషయంమీద దేవ, దానవులు ఘర్షణకు దిగారు.అప్పుడు శ్రీమహావిష్ణువు జగన్మోహినీ రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు.మనసును మెలిబెట్టి, మరులను రగిలించే, మన్మథశరంలాంటి ఆ సుందరాంగి వొంపు సొంపుల తళతళలకు దానవులు తబ్బిబ్భై…..కనురెప్పలు కూడా వేయడం మరచి, గుటకలువేస్తూ నిలబడిపోయారు.జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ….,అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది.ఈ విషయాన్ని కలహ భోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు.అప్పుడు పరమశివుడు ‘మనోనిగ్రహం లేని మీవంటివారు విష్ణుమాయా విలాసానికి లోనౌతారుగానీ నావంటి విరాగిని ఎలాంటి సౌందర్యము వంచించలేదు’ అన్నాడు.అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి‘నీ జగన్మోహన రూపాన్ని చూపించు’అని అడిగాడు.పరమేశ్వరుడు అడిగితే పరంథాముడు కాదనగలడా. మరల జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివశతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి..విరాగి, శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై..తనను తానే మరచి ఆ జగన్మోహినినీ ఆనుసరించాడు..(ఇక్కడ తెలియనితనం తో చాలామంది శివుడు వెంట బడ్డాడు అని అంటారు.కానీ కాదు ,మహిషి ఘోర తపస్సు చేసి తనను చంపగలిగేవాడు హరిహారాదులకు పుట్టినవాడు కావాలని కోరుకుంది,అందుకు అక్కడ అయ్యప్ప జననం జరగాలి,విష్ణువు ,అమ్మవారికి సోదరుడు కనుక పార్వతి అంశ తనలో ఉండబట్టే పార్వతి దేవిలా శివునికి భార్యలా ప్రవర్తించగలిగాడు విష్ణువు)

8.భేషజాల కప్ప

ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులూ ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ, స్నేహంగా ఉండేది.ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, "ఏయ్‌ చేపా! నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి" అంటూ అరవడం మొదలెట్టింది.కప్ప మాటలకు చేప ఖంగుతింది. అప్పటివరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పను ఏమీ అనకుండా మడుగులోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. "నువ్వొక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు. కాని నేను, నీటిలో ఈదగలను, నేలమీద బతకగలను" అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేపమాత్రం ఏమీ మట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడ లేదు. దాంతో కప్పకు కోపమొచ్చింది.కప్ప తన గొప్పలను ఏకరువు పెడుతూ ఉండిపోయింది. "నువ్వు కనీసం మాట్లాడగలవా? నేను శ్రావ్యంగా పాడగలను కూడా" అంటూ మడుగులో నుంచి ఒడ్డుకు ఎగిరి "బెక బెక" మని అరవడం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. తనను నిద్రలేపిందెవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకొచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనబడింది. అంతే ఒక్క ఉదుటున కప్పపై దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది.

9.బాణాసురుడు

వెయ్యి బాహువులు కలిగిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి ఆయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఉండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.ఇప్పటి అస్సాంలోని తేజ్ పూర్ ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. ఇదివరకు దీనిని శోణాపుర్ లేదా శోనిట్ పూర్ అని కూడా పిలిచేవారు.

బాణాసురుని వంశపరంపర

బ్రహ్మ కుమారుడు మరీచి -మరీచుని కుమారుడు కశ్యపుడు -కశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు-హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు-ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు-విరోచుని కుమారుడు బలి చక్రవర్తి-ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు▪️ఆ బాణాసురుని భార్య కండల.

ఉషా అనిరుద్ధుల ప్రణయం

బాణాసురిని కూతురైన ఉష దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖకు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తరువులు గీసి చూపుతుంది. అందులోని ఒక చిత్తరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తరువు చూసి ఈ రాకుమారుడా ! ఇతను శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుని బృందావనం నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నవిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు. ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాటక సూత్రదారి శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు.

శైవజ్వరం వైష్ణవ జ్వరం

శ్రీకృష్ణుడు బలరామ సాత్యకి యదు వంశ సైన్యంతో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు. యాదవసైన్యం బాణాసురిడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికిచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమధ గణాలతో యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది. ఈ యుద్ధాన్ని యక్ష, గంధర్వ, కిన్నెర కింపురుషాదులు గగనతలం నుండి వీక్షించారు. శివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రం తోనే నిరోధించాడు.శివుడు వేసిన వాయవ్యా స్త్రాన్ని పర్వతాస్త్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు. శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఆంధ్రాస్త్రం సంధించాడు.శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణాస్త్రంతో చల్లారింది. అప్పుడు నారాయణుడు (శ్రీకృష్ణుడు) సమ్మోహనాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్ఛపోయాడు. శివుడు మూర్ఛపోవడంతో బాణుడు కొయ్యబారి నిలబడిపోయాడు. అప్పుడు బాణుడి తల్లి కోతరా జుట్టు వీరపోసుకొని వివస్త్రై శ్రీకృష్ణుడి ముందు నిలబడుతుంది. అప్పుడు కోతరని చూడలేక శ్రీకృష్ణుడు రథంపై నుండి తల వెనుకకు త్రిప్పుకొంటాడు, వెంటనే బాణుడు పలాయనమంత్రం పఠిస్తాడు. పరమ శివుడు మూర్ఛ నించి తేరుకొని యాదవ సైన్యంపైకి శైవజ్వరం ప్రయోగిస్తాడు. నారాయణుడు వైష్ణ్వ జ్వరం ప్రయోగిస్తాడు. శైవ జ్వరాన్ని నారాయణుడు ప్రార్థించడంతో ఉపశమనం పొందుతుంది. నారాయణుడు ప్రయోగించిన వైష్ణ్వ జ్వరం శివుడి వద్దకు వెళ్ళి ఉపశాంతి పొందుతుంది. అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధ రంగంలో నిలబడి ఉండటంతో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం బాణుడి సహస్ర కరాలలో నాలిగింటిని మిగిల్చి మిగతా వాటిని ఖండిస్తుంది. అప్పుడు శివుడు సకలదేవతలతో శ్రీకృష్ణుడి వేడుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చిన కారణమున బాణుడిని విడిచి పెడుతున్నాను. బాణుడు శివభక్తులలో అగ్రాసేరుడిగా నిలుస్తాడు అని వరమిస్తాడు. తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహం జరిపిస్తాడు.

10.బుద్ధి బలం

పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో గజగజలాడేవి. పొడుగైన దాని దంతాలు తగిలీ, దాని అడుగుల కింద పడీ చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలసవెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయింది. ఒకటొకటిగా మరణించసాగాయి. తమజాతి అంతరించిపోతుందేమోననే భయముతో ఒక రోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి.ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపునిండా భోజనం దొరుకుతుంది" అన్నది ఒక కుంటి నక్క. "నేను చంపుతా" అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ ఫక్కున నవ్వాయి. "ఇది ఆడుకొనే ఏనుగు అనుకొన్నావా? కాదు. దీన్ని చంపడం మాకే చేతకాదు. నీవేం చేస్తావు? వెళ్ళి ఆడుకో" అన్నది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా "వయసును, శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరి కాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా" అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క "సరే! చూద్దాం! కానీ!" అన్నాయి.మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి "మహారాజుకు జయము! జయము! అంటూ వినయంగా నిలుచుంది. మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది. "ఎవరు నువ్వు" అంది బిగ్గరుగా. "ప్రభూ నేను నక్క పిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది. మహారాజు గుణాలన్ని మీలో ఉన్నాయి, కాబట్టి మహారాజా! అని పిలిచాను. ఈ అడవికి మిమ్ముల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి. బయల్దేరండి" అంది నక్క పిల్ల.
ఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. "ఎంతదూరం వెళ్ళాలి మనం" అని గర్వంగా అడిగింది. "దగ్గరే. నాతోరండి స్వామీ!" అంటూ జిత్తులమారి నక్కపిల్ల ఒక ఊబి వైపుగా ముందు నడవసాగింది. దాని వెనకే రాచఠీవితో మాతంగం నడవసాగింది. రాజునవుతాననే ఆనందంతో కలులు కంటూ అడుగులేస్తున్న ద్విరదం హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని "కాపాడండి! కాపాడండి" అని అరవసాగింది."ప్రభూ! జిత్తులమారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు" అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడకు జంతువులు చేరే సరికే ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అన్నీ నక్క పిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి.