రుక్మిణీ కల్యాణం
రుక్మిణీ కల్యాణం
శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా పలికాడు.
“పరీక్షిన్మహారాజా! పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని తీసుకొచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు విన్నావు కదా ఈ వృత్తాంతం?!!''
రేవతీ బలరాముల వివాహం
ఆనర్తుడు అనే రాజుకు రైవతుడు జన్మించాడు. అతడు సముద్రం లోపల కుశస్థలి యను పట్టణాన్ని నిర్మించాడు. రైవతుడికి కాకుద్మి మొదలైన నూరు మంది కొడుకులు మరియు రేవతి అను కూతురు జన్మించారు. రేవతికి తగిన వరుడిని తెలుసుకొనగోరి రేవతితో పాటు రైవతుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. అచట బ్రహ్మ గంధర్వ కిన్నెర ఆట పాటల సందడిలో ఉండగా కాసేపు వేచిఉన్నాడు. అంతట అవకాశము చిక్కినంతనే రైవతుడు బ్రహ్మదేవుడికి నమస్కరించి, రేవతిని చూపి ఇట్లు అన్నాడు.
ఈ ముగ్ద యౌవ్వనవతి, సౌందర్యవతి, శుభాత్మురాలికి యోగ్యుడైన భర్తను తెలుపమని కోరగా, బ్రహ్మదేవుడు నవ్వి రైవతునితో ఇలా పలికాడు. ఓ రైవతా! ఈమెకు తగిన వరుడు అని నువ్వు భావించిన వారు అందరూ కాలవశమున చనిపొయారు. కనీసం వారి బిడ్డలు, వారి మనుమలు, వారి గోత్రము కలిగిన వారు కూడా ఈ భూమి మీద నీకు కనిపించరు. నీవు యిచటికి వచ్చి వేచి ఉన్న సమయంలో భూమిపైన 27 సార్లు నాలుగు యుగాలూ గడిచిపోయాయి. నీవు ఇప్పుడు భూమికి తిరిగి వెళ్ళు. దేవదేవుడైన హరి బలరాముడుగా భూమి భారము తగ్గించుటకు పుట్టినాడు. ఆ సకల భూతాత్ముడికి ఈ కన్యామణిని ఇచ్చి వివాహం జరిపించు. అని చెప్పిన బ్రహ్మకు నమస్కరించి, భూలోకానికి వచ్చి సోదరులు, స్వజనము లేని తన రాజ్యానికి వచ్చి, బలభద్రుడిని వెతికి, రేవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. తర్వాత రైవతుడు నారాయణాశ్రమం అయిన బదరికావనమునకు నిష్ఠగా తపస్సు చేసుకొనుటకు వెళ్ళాడు.
అలా రేవతీ బలరాముల వివాహం జరిగిన తరువాత...
పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించినట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజులందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.
రుక్మిణీ జననం
విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కొడుకులు {రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది. ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది. బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆట్లాడుతోంది. గుజ్జన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపుటుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాటలాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది.
ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది. తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది. ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ది, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందామనుకొన్నాడు.
రుక్మిణిని బంధువులంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడికిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.
రుక్మిణి సందేశము పంపుట
తన అన్న ఆలోచన తెలిసిన రుక్మిణి, తన మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేది దేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తానంటున్నాడు. ఏ విధంగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియజెప్పు. ఓ బ్రాహ్మణోత్తమా! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలువు.” ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. భటుల ద్వారా తన రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్న కృష్ణుణ్ణి దర్శించి “కళ్యాణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి, ఆ బ్రాహ్మణుడిని ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం పెట్టించాడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.
“బుద్దిశాలీ! మీరే దేశంలో ఉంటారు? ఎవని రాజ్యంలోనైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సులువైనపని కాదు. మీరెలా వచ్చేరు? మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొచ్చిన విప్రుని పలకరించాడు.
ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు “భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది.
శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు. ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించేవాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించలేదా? అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి?
ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహంనికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి యైన శశిపాలుడు నీ పదభక్తురాలనైన నన్ను(రుక్మిణి) తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు. రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోక కల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శిశుపాలాది అధములు ఓడిపోవుదురు గాక!
నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు, జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.
రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పుడక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా!” అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!
ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, తగ్గిన స్వరంతో సౌమ్యంగా ఇంకా ఇలా చెప్పాడు... ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది. ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ వాళ్ళతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.
వాసుదేవాగమన నిర్ణయము
ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి, శ్రీకృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.
“సచ్చీలుడా! రుక్మిణీకన్య మీద నాకు గాఢమైన మనసుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. మా పెళ్ళికి ఇష్టపడక రుక్మి పెట్టే అడ్డంకులు నాకు ముందే తెలుసు. కట్టెలను అగ్ని దహించినట్లు, శత్రువులను మర్ధించి కన్యను తీసుకొస్తాను. విదర్భలోని భీష్మకుని కుండినపురానికి వస్తాను. రుక్మిణీబాలను అలవోకగా తీసుకొస్తాను. అడ్డం వచ్చే శత్రువులను యుద్దంచేసి చిటికలో చీల్చి చెండాడుతాను.” అని విప్రునితో అన్నాడు శ్రీకృష్ణుడు.
రుక్మిణి పెళ్ళి ముహుర్తం కృష్ణుడు తెలుసుకొన్నాడు. కృష్ణుని ఉత్తర్వు ప్రకారం రథసారథియైన దారకుడు "సైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము" లనే గుర్రాలు నాలుగింటిని కట్టిన రథం సిద్దం చేసాడు. వాసుదేవుడు బ్రాహ్మణునితోబాటు రథమెక్కేడు. ఒక్క రాత్రిలోనే ఆనర్తకదేశాలు దాటి కుండినపురం చేరాడు. ఆ సమయములో అక్కడ, కొడుకునకు వశుడు అయిన భీష్మకుడు కూతుర్ని శిశుపాలునికి ఇద్దామనుకుంటూ పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాడు.
ఆ కుండిన నగరమంతా ఉత్సాహంతో వెలిగిపోతోంది. వీధులు, సందులు, రాజమార్గాలు, బజార్లు అన్ని శుభ్రం చేసారు. మంచి గంధం కలిపిన నీళ్ళు కళ్ళాపి జల్లారు. కలువపూల దండలు మనోహరమైన తోరణాలు కట్టారు. నగరంలోని ఇళ్ళన్ని శుభ్రపరచారు. సుగంధ ధూపాలు పట్టారు. ప్రతిచోట రకరకాల పూలు, బట్టలు, అలంకారాలు స్త్రీ పురుషులు ధరించారు. ప్రజలు సంతోషంతో మంగళ వాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు.
భీష్మకుడు పద్దతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. పుణ్యాహవచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణాలతో అలంకరించాడు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. నవ దంపతుల శుభం కోసం భీష్మకుడు విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది ధానాలు చేసాడు. అప్పుడు...
విదర్భ రాకుమారి రుక్మిణిని పెళ్ళాడతానంటు శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో, ఎందరో కాల్బంటులతో, రథాల వరుసలతో, భద్రగజాల సమూహంతో, మిక్కిలి వేగవంతమైన గుర్రాల సైన్యంతో, బంధువులతో, చెలికాళ్ళతో గొప్ప అట్టహాసంగా ఆ కుండిన నగరానికి వచ్చాడు.
జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరథుడు, పౌండ్రకుడు మొదలైన వాళ్ళంతా “బలరామ కృష్ణులు బంధువులందరను తోడు తెచ్చుకొని వచ్చినా సరే తరిమేస్తాం. శిశుపాలుడికి బాలికను తెచ్చి ఏ ఇబ్బంది లేకుండా కట్టబెడతాం.” అంటూ చతురంగబలాలతో వచ్చారు.
ఇంకా వివిధ దేశాల నుండి అనేకమంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడికి ఎదుర్కోలు మొదలైన మర్యాదలు చేసి తగిన విడిది ఏర్పాటు చేసాడు. ఈ విషయాలు తెలిసి...
బలరాముడు “అయ్యో! కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడు జరాసంధుడు మున్నగువారు శిశుపాలునికి సాయంగా వెళ్ళారు; బాలికను తెచ్చేటప్పుడు యుద్దం తప్పదు; కృష్ణుడికి సాయం అవసరం.” అంటూ బలరాముడు కృష్ణుని వెనుక సైన్యం తీసుకొని వెళ్ళాడు.
ఇంతట్లో చలించుతున్న పెద్ద పెద్ద కళ్ళున్న ఆ రుక్మిణీదేవి తనలో తాను తన ఏకాంతమందిరంలో “సూర్యచంద్రులు కన్నులుగా ఉండుట వల్ల లోకాలకు చూసే శక్తిని ఇచ్చేవాడైన కృష్ణుడు ఏకారణంచేతనైనా తన మీద దృష్టిపెట్టి తనను చేరరాడేమో” నని బెంగపెట్టుకుంది. ఇంకా ఇలా అనుకోసాగింది . . .
“నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహుర్తం దగ్గర కొచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? (అంటూ రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.) ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో? లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకు పోయాడేమో? నా సందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో? పార్వతీదేవి నన్ను కాపాడాలనుకుందో లేదో? నా అదృష్టమెలా ఉందో?” అంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్రాహ్మణుని పంపిన రుక్మిణీదేవి, డోలాయమాన స్థితి పొందుతోంది.
“మాధవుని మథురకి బ్రాహ్మణుడు అసలు వెళ్ళే వెళ్ళి ఉండడు. వాసుదేవుడు ఇంక రాడు. పిలుచుకొచ్చే ప్రియ బాంధవుడు ఇంకొకడు లేడు. అన్నయ్య రుక్మికి ఇంక అడ్డే లేదు. శిశుపాలుడికి ఇచ్చేస్తానంటున్నాడు. ఇవాళ పార్వతీదేవికి నామీద దయలేదు కాబోలు” అని రకరకాలుగా మధనపడుతోంది.
రుక్మిణీ దేవి, ముకుందుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అటునుండి చూపులు తిప్పడం లేదు. తన మనసులోని వేదనలు తల్లికి కూడ చెప్పటం లేదు. చిరునవ్వులు చిందించటం లేదు. ముఖపద్మానికి మూగిన తుమ్మెదలని తోలటం లేదు. వక్షస్థలం మీది గొలుసుల చిక్కులను విడదీయటం లేదు. తనను తీసుకెళ్ళటానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడో లేదో అని మధనపడుతున్న రుక్మిణీదేవి, కన్నీరు తుడుచుకోవటం లేదు. జుట్టు సరిగా ముడవటం లేదు. నెచ్చలులతో ముచ్చట్లు చెప్పటం లేదు. అన్నపానీయాలు తీసుకోవటం లేదు. ఇష్టమైన చిలుకకి పద్యాలు చెప్పటం లేదు. వీణ వాయించటం లేదు. ఎవ్వరి దగ్గరకు పోవటం లేదు. రుక్మిణి ఇంత గాఢంగా కృష్ణుని ప్రేమిస్తోంది కనుకనే తనను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకోమని సందేశం పంపించింది.
కృష్ణుడు తనను ప్రేమతో కరుణించడానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోవడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట. మన్మథతాపాగ్నిలో వేగిపోతున్న మగువ పిల్లగాలికి అలసి పోతుంది. దోగాడే తుమ్మెదలకి తొలగిపోతుంది. కోయిల కూసినా చిరాకు పడుతుంది. చక్కటి చిలక పలుకులకి ఉలికి పడుతుంది. వెన్నెల వేడికి వేగిపోతుంది. మామిడి చెట్టు నీడకి తప్పుకుంటుంది.
వాసుదేవాగమనం
ఇలా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు; అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదురెళ్ళింది; అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు. . .
“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగా వచ్చేడు. దేవదానవులడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచితనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.
రుక్మిణి, విప్రునికి నమస్కరించింది. ఈలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు...
“ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడు గాక.” రుక్మిణీ స్వయంవరానికి వచ్చినప్పుడు కృష్ణుని దర్శించుకున్న కుండిన నగర పౌరులు వారిలో వారు అలా అనుకున్నారు...!
రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది; ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి; సర్వాయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్న శూరులు చుట్టూ కొలుస్తున్నారు; వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు; సర్వాలంకార శోభితలైన విప్రుల భార్యలు పాటలు పాడుతూ వస్తున్నారు; మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళవాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నాయి; చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు; తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు;
అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళికూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాదేవి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూలమాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిదేవి గౌరమ్మకు మొక్కింది. బ్రాహ్మణదంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.
వారు ఉత్సాహంతో చక్కగా దీవించి, ఆమె తల మీద అక్షతలు వేసారు. రుక్మణి ఆ ఆశీర్వచనాలు ధరించి పార్వతీదేవికి నమస్కారాలు పెట్టింది. మౌనవ్రతం వదలి బయటకొచ్చింది.
గౌరీపూజ పూజచేసి దేవాలయం బయటకు వచ్చిన రుక్మిణీవనిత సౌందర్యానికి విభ్రాంతులైన అక్కడి రాజులందరు ఆమె చిరునవ్వులకి, సిగ్గులతో కూడిన ఓరచూపులకి మనసులు కరిగిపో యి, ధైర్యాలు వదలారు; గాంభీర్యాలు విడిచిపెట్టి. గౌరవమర్యాదలు మరిచారు; చేష్టలుదక్కి మైమరచారు; ఆయుధాలు జారవిడిచారు; ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎక్కలేక నేలకు వాలారు; ఆ లేడి కన్నుల చిన్నదేమో తన ఎడంచేతి గోరుతో ముంగురులు సరిచేసుకుంటోంది; పైట సర్దుకుంటోంది; కడగంటి చూపులతో ఆ రాజ సమూహాన్ని పరిశీలిస్తోంది.
రుక్మిణీ గ్రహణం
రుక్మిణి, కృష్ణుని చూసింది. అతని సౌందర్యం, యౌవనం, లావణ్యం, వైభవం, గాంభీర్యం, నేర్పరితనం, తేజస్సుల అతిశయానికి సంతోషించింది. మన్మథ బాణాలకు గురై రథం ఎక్కాలని ఆశ పడుతున్న ఆమెను చూసాడు కృష్ణమూర్తి. సింహం తిన్నగా వచ్చి నక్కల మధ్యన ఉన్న ఆహారాన్ని పట్టుకు పోయినట్లు శత్రుపక్షం రాజులందరు చూస్తుండగా వాళ్ళని లెక్కచేయకుండా రాకుమారిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నిండేలా శంఖం పూరిస్తూ ద్వారక కెళ్ళే దారి పట్టాడు. బలరాముడు యాదవ సైన్యాలు అనుసరిస్తున్నారు. అప్పుడు కృష్ణుని పరాక్రమం చూసి జరాసంధుని పక్షం రాజులు సహించలేకపోయారు.
"గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నరు. రాకుమారిని విడిపించలేకపోతే మన పరాక్రమాలెందుకు. మన అస్త్రశస్త్రాలెందుకు దండగ. సందుగొందుల్లో జనాలు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.
అలా కృష్ణుడు రుక్మిణిని తీసుకుపోతుంటే, శిశుపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు. కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైనవారంతా పంతాలేసుకొని తమతమ చతురంగ సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించి అడ్డుకున్నారు.
ప్రతిపక్ష సైన్యాల బాణాలు కృష్ణుని సైన్యాన్ని కప్పేస్తుంటే చూసి, సుకుమారి రుక్మిణీదేవి బెదిరిన లేడి చూపులతోను భయంతోను సిగ్గుతోను ముకుందుని (కృష్ణుని) ముఖంకేసి చూసింది.
రుక్మిణీ! కంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు. ఇలా చెప్పి మాధవుడు రుక్మిణిని ఊరడించాడు. ఈలోగా ప్రళయం వచ్చినప్పుడు ఆకాశమంతా కప్పేసి పెద్దపెద్ద పిడుగులు కురిపించే కారు మబ్బులు లాగ బలరాముడు మొదలైన యాదవులు విజృంభించారు. జరాసంధుడు మొదలైన పరపక్ష రాజులందరి మీద అవక్ర పరాక్రమంతో విరుచుకు పడ్డారు. అగ్నికీలలతో సరితూగే ఉక్కుబాణాలు మొదలైన వాడి బాణాలు కురిపించారు. అప్పుడు శత్రు సేనలో ఏనుగులు కూలిపోయాయి, గుర్రాలు చెల్లాచెదురయ్యాయి. రథాలు ముక్కలయ్యాయి, కాల్భంట్లు బెదిరి పోయారు, గజాశ్వ రథారోహకుల తలలు తెగి పోయాయి. గుండెలు, నడములు, చెవులు, కంఠాలు, చెక్కిళ్ళు, చేతులు తునాతునక లయ్యాయి. కపాలాలు పగిలిపోయాయి, తలవెంట్రుకల చిక్కులు రాలాయి. పాదాలు, మోకాళ్ళు, పిక్కలు తెగిపోయాయ. దంతాలు రాలిపోయాయి. వీరుల కాలి యందెలు, భుజ కీర్తులు పడిపోయాయి. చెవిపోగులు, కిరీటాలు, కంఠహారాలు జారిపోయాయి. వీరుల సింహనాదాలు మూగబోయాయి. గదలు, బల్లేలు, గుదియలు, గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, విల్లులు విరిగిపోయాయి. జెండాలు, గొడుగులు, వింజామరలు ఒరిగి పోయాయి. కవచాలు పగిలిపోయాయి. గుర్రాల కాలి గిట్టల తాకిడికి రేగిన దుమ్ము కమ్మేసింది. రథాల వేగం నెమ్మదించింది. వందిమాగధ వైతాళికుల స్తోత్ర పఠనాలు ఆగిపోయాయి. గుర్రాల సకిలింపులు, భేరీల భాంకారాలు, ఏనుగు గుంపుల ఘీంకారాలు, రథచక్రాల పటపట శబ్దాలు, గుర్రాల నడుములకు కట్టిన గంటల గణగణలు, వీరుల హుంకారాలు, ఆభరణాల గలగలలు, నగారాల ధణధణలు, మణిమంజీరాల క్రేంకారాలు, మువ్వల గలగలలు, అల్లెతాళ్ళ టంకారాలు, భటులు ఒకరినొకరు ధిక్కరించుకోవడాలు ఆణిగిపోయాయి. రాజ సమూహం చెదిరిపోయింది. నెత్తుటేరులు పారాయి. భూత భేతాళాల కలకల ద్వని వినిపిస్తోంది. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు మొదలైన వాని అరుపులు చెలరేగాయి. తల తెగిన మొండెములు కదలాడాయి. మాంసం కంపు గొట్టింది. మెదడు, మాంసం తింటూ రక్తం తాగుతూ ఉన్న డాకినీ మొదలైన పిశాచాలకి ఆ రణరంగం ఆనందం కలిగిస్తోంది.
Post a Comment