telugu short stories 1
తెలుగు కథలు
1.ప్రేమ5.అసూయ
7.గుణపాఠం
10.మాయాజాలం
12.పూజలో దోషాలు
1.ప్రేమ
ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు.
మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.
గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.
చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.
ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.
టోపి కాస్తా నదిలో పడింది.
దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.
అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.
అయ్యో పాపం అని బాధపడ్డారు. "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.
పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకొకడు.
"నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.
బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.
వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.
వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా.
వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.
వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు.
భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు"
వేటగాడు : "ఆవు కూడా గాడిదకు మారకం వేశా"
భార్య : "కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే" అంది తృప్తిగా.
వేటగాడు : "గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా"
భార్య : "అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా"
వేటగాడు : "అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా"
భార్య : "సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు"
వేటగాడు : "కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది"
భార్య : "పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ" అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది.
గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.
ఇదే నిజమైన ప్రేమ..
ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.
2.అన్నదాతా సుఖీభవ
పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.
'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
-1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.
3.నీ మనసే నీకు శత్రువు
ఒక ఊరిలో మంగమ్మ అనే ఒక ఆవిడ పరమగయ్యాళి. ఈమె బాధ భరించలేక భర్త ఇల్లువదిలి వెళ్ళిపోయాడు. ఈమె నోటి దురుసు వలన ఊరు ఊరంతా శత్రువులు పెరిగిపోయారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. ఈమె గొంతుకి భయపడి ఈవిడ గారింటికి రావడమే మానేశారు. పాపం ఈవిడ "అయ్యో నాతో ఎందుకని ఊర్లో వారంతా ఎందుకు మాట్లాడడంలేదు. నేనంటే ఎందుకు అందరికి అంత శత్రుత్వం" అని తెగ బాధ పడిపోతుంది.
ఒకరోజు ఒక స్వామిజి ఈవిడ ఇంటికి వచ్చాడు. స్వామీజీతో ఈవిడ మొరపెట్టుకుంది. జరిగిందంతా చెప్పింది. ఊర్లో ఎవరూ నాతో మాట్లాడడంలేదు. ఎందుకు స్వామి నేనంటే అందరికీ అంత అసూయ? అని అడిగింది. దానికి సమధానంగా స్వామీజీ;
"బిచ్చం పెట్టవే భొచ్చు మొహమా!" అన్నాడు. ఈ మంగమ్మకి ఆ మాట వినేసరికి మంటెత్తిపోయింది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర ఒకటి తీసుకుని "సచ్చినోడా! నువ్వేదో స్వామీజీ వని నా బాధలన్ని నీతో చెప్పుకుంటే నన్నే తిడతవా!" అంటూ కొట్టడానికి కర్ర పైకెత్తింది. వెంటనే స్వామీజీ. నవ్వుతూ ఆగమ్మా ఆగు. ఇప్పుడు నన్నెందుకు దూషిస్తూ, నాతొ శత్రుత్వం పెంచుకున్నావు? నేను దూషించాననే కదా! అంటే నేను నిన్ను ఏదో అనబట్టే నువ్వు కొట్టడానికి కర్ర తీసుకున్నావు. నేను వాడిన బాష నీకు నచ్చలేదు. కనుకనే శత్రువు అనుకుంటున్నావు.
ఇలా ఎదుటివారి ప్రవర్తన మనకి నచ్చకపోవడమే మన శత్రువు అవ్వడానికి కారణం. అంతే తప్ప మరొకటి కాదు. ఉత్తముడికి లోకంలో అందరూ ఒకటే. కనుకనే సాదుస్వభావంతో అందరిని ఒకేలా చూస్తున్నాడు. నువ్వు కూడా ఇంటికి వచ్చినవారితో, నిన్ను కలిసిన వారితో సఖ్యంగా ఉండు, మృదువుగా మాట్లాడు. అప్పుడు నీకు అందరు మిత్రులుగా మారతారు. అని చెప్పి వెళ్ళిపోయాడు. స్వామీజీ చెప్పినట్లు మృదువుగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటంతో త్వరలోనే అందరూ బంధువులు అయ్యారు. ఈవిషయం తెలిసి భార్త కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు. కథ సుఖాంతం అయింది.
భావం: మనం మాట్లాడే తీరును బట్టి శత్రువులు, మిత్రులు ఏర్పడతారు. మనం దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అందరూ శత్రువులే ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మిత్రులు ఏర్పడతారు. ఎప్పుడైనా మనం మాట్లాడే తీరే మనకి ముఖ్యం. మన మనస్సే మనకి శత్రువు.
4.సుబ్బయ్య గుర్రం.
ఒక ఊళ్లో సుబ్బయ్య, శంకరయ్య అనే వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో కాపురం ఉండేవారు. సుబ్బయ్య వ్యాపారి కాగా, శంకరయ్య ఊర్లో కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుండేవాడు. సుబ్బయ్య అహంకారి, దుర్మార్గమైన మనస్తత్వం కలిగినవాడు. శంకరయ్య చాలా మంచివాడు, నిజాయితీపరుడు.
ఒకరోజు సుబ్బయ్య ఏదో పనిమీద పక్క ఊరికి వెళ్తూ... "శంకరయ్యా...! నేను పక్కనే ఉండే శివపురానికి వెళ్తున్నాను. తిరిగీ వచ్చేందుకు వారం రోజులుదాకా పట్టవచ్చు. అప్పటిదాకా నా గుర్రాన్ని నీ ఇంట్లో కట్టేసి వెళ్తాను" అని అన్నాడు. దీంతో మంచివాడైన శంకరయ్య, సరేనని గుర్రాన్ని తన ఇంటి వరండాలో కట్టేసుకున్నాడు.
సుబ్బయ్య ఊరెళ్లిన తరువాత రెండు రోజులపాటు బాగా ఆరోగ్యంగానే ఉన్న గుర్రం... మూడోరోజు అకస్మాత్తుగా జబ్బుపడి చనిపోయింది. ఏం చేయాలో, సుబ్బయ్యకు ఏమని చెప్పాలో తెలియని శంకరయ్య దేవుడా...! అంటూ తలపట్టుకుని బాధపడుతూ కూర్చున్నాడు. ఇక చేసేదేముంది.. సుబ్బయ్య వచ్చాక ఆ గుర్రం ఖరీదు కట్టిచ్చేస్తే సరిపోతుందని తననుతాను సముదాయించుకున్నాడు.
చెప్పినట్టుగానే వారం రోజుల తరువాత వచ్చాడు సుబ్బయ్య. గుర్రం చనిపోయిన విషయం తెలుసుకున్న సుబ్బయ్య ఆగ్రహంతో.. "చూడు శంకరయ్యా...! నేను గుర్రాన్ని అప్పగించి వెళ్ళాను. ఇప్పుడు నా గుర్రం నాకు కావాలి. దానికి బదులుగా డబ్బుగానీ, మరే ఇతర గుర్రముగానీ వద్దు...! ఏమైనా చేయి, నాకు దాంతో సంబంధం లేదు" అని తెగేసి చెప్పాడు. దీంతో ఏమీ పాలుబోని శంకరయ్య మర్యాద రామన్న వద్దకెళ్లి జరిగినదంతా చెప్పి వాపోయాడు.
అంతా విన్న మర్యాద రామన్న... ఒక గొప్ప ఎత్తువేసి, వివరంగా చెప్పి శంకరయ్యను పంపించాడు. మర్యాద రామన్న సలహా మేరకు కాచుక్కూర్చున్న శంకరయ్య ఇంటికి గుర్రం గురించి అడిగేందుకు వచ్చాడు సుబ్బయ్య. రావడమేగాకుండా, గోడకు ఆనించి పెట్టిన పెద్ద పెద్ద కుండలను పొరపాటున బద్దలు కొట్టేశాడు.
దీంతో "అయ్య బాబోయ్..! నా కుండలు బద్ధలైపోయాయి సుబ్బయ్యా... ఇప్పుడెలా..?" అని గట్టిగా అరిచాడు శంకరయ్య. "దీని కోసం ఇంత రాద్ధాంతం చేయాలా శంకరయ్యా...? వాటి ఖరీదు నేను కట్టిస్తాన్లే, లేకపోతే వేరే కుండలను కొనిస్తాను" అన్నాడు సుబ్బయ్య. "అయ్యో అలా చెబుతారేంటి..? నాకు నా కుండలే కావాలి, వేరేవి వద్దు" అని గట్టిగా పట్టుబట్టాడు శంకరయ్య.
సుబ్బయ్య, శంకరయ్యలు ఎంతసేపు వాదించుకున్నా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో... చివరకు ఇద్దరూ కలసి మర్యాద రామన్న ఇంటికి వెళ్ళారు. ఇద్దరి మాటలను ఓపికగా విన్న మర్యాద రామన్న,సుబ్బయ్యను మందలించి, గుర్రం ఖరీదును శంకరయ్య వద్ద తీసుకుని, అతడి కుండల ఖరీదును చెల్లించమని తీర్పు చెప్పాడు. దీంతో.. తప్పు తెలుసుకున్న సుబ్బయ్య ప్రశ్చాత్తాపంతో ఇంటిదారిపట్టాడు
5.అసూయ
ఒక ఆసుపత్రి గదిలో ఇద్దరు రోగులు వుండేవారు. ఒక రోగి మంచం కిటికీ పక్కనే ఉండేది. రెండవ రోగి మంచం కిటికీకి దూరంగా వుండేది. కిటికీ దగ్గర వున్న రోగి అప్పుడప్పుడు లేచి కూర్చుని కిటికీ బయట దృశ్యం ఎంత అందంగా వుంది. ఎంత పెద్ద మైదానం. ఎంత పచ్చని పచ్చిక. ఎంత చక్కని తోట. ఆ చక్కని తోటలో ఎన్నెన్ని రంగుల సువాసనల పూవులు. ఈ చల్లని సాయంకాలంలో ఎంత చల్లని గాలి వీస్తోంది. ఈ గాలిలో ఆ పచ్చిక అటూ ఇటూ కదులుతూ మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఆ తోట మధ్య ఎంత పెద్ద చెరువు, ఎన్ని బాతులు, ఎన్ని కలువ పూలు అని మంచం మీది రోగికి వర్ణించి చెబుతుండేవాడు. ఇది వింటున్న మంచం మీది రోగికి "నేనూ హాయిగా కిటికీ దగ్గర వుంటే బాగుండేది. బయట దృశ్యాలన్నింటినీ చూసేవాడ్ని" అని అనుకున్నాడు. ఆ రాత్రి కిటికీ దగ్గర రోగికి దగ్గుతో చాలా సీరియస్ అయింది. ప్రక్క మంచం మీద రోగి బటన్ నొక్క గలిగే స్థితిలో వున్నా నొక్క లేదు దుష్టబుద్దితో.
కిటికీ దగ్గర రోగి రాత్రి మరణించాడు. మరునాడు ఉదయం పక్క మంచం మీద ఉన్న రోగి కోరికపై అతన్ని అతి కష్టం మీద కిటికీ దగ్గర మంచం మీద పడుకోపెట్టారు. అతను అతి కష్టం మీద లేచి కూర్చుని బైటకు చూస్తే, బైట ఒక మర్రి చెట్టు, దిగువ బావి తప్ప ఏమీలేవు. "ఇన్ని రోజులూ నా తోటి రోగి నన్ను సంతోషపెట్టడానికే ఇన్ని దృశ్యాలూ కల్పించి చెప్పేవాడు. అతను నా మిత్రుడు" అని రెండవ రోగి బాధపడ్డాడు.
6.జ్ఞానోదయం
సింహపురి గ్రామంలో శివయ్య అనే పేద రైతు, అతని భార్య సావిత్రి కూలి పని చేస్తూ జీవించేవారు. వారి కొడుకు రంగడు. తాము తిన్నా తినకపోయినా వాడినెప్పుడూ పస్తుపెట్టకుండా చదివించి, ఆ గ్రామ పెద్ద సహకారంతో చిన్న ఉద్యోగం కూడా సంపాదించి పెట్టారు. రంగడు తల్లిదండ్రుల పట్ల వినవిధేయలతో ఉండేవాడు. చెప్పినట్లు వినేవాడు. ఉద్యోగంలో మొదటిసారి జీతం తీసుకున్నవెంటనే వాళ్లను కూలి పని మానిపించి, కుటుంబ భాద్యత తనే వహించాడు. కొడుక్కి తమ పట్ల గల ప్రేమకు సావిత్రి, శివయ్య ఎంతగానో పొంగిపోయేవారు. ఊళ్ళో నలుగురికీ వాడి గురించి ఎంతోగొప్పగా చెప్పుకుని మురిసిపోయేవారు.
కొంతకాలం తర్వాత రంగడికి విమల అనే అమ్మాయితో పెళ్ళయింది. కన్నవారు ధనవంతులు కావడంతో రంగడికి కట్నకానుకలు కాస్త ఎక్కువగానే ముట్టజెప్పారు. అయితే, విమల బాగా గడుసు మనిషి ఆమె నోరు చాలా చెడ్డది. పైగా డబ్బు పిచ్చి ఎక్కువ. అత్తామామలు ఊరికే కూర్చుని తినడం, ఆ ఇంట్లో ఉండటం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. రంగడు ఇంటికి రావడమే ఆలస్యంగా వాళ్ళమీద లేని పోని చాడీలు చెబుతుండేది. చెప్పుడు మాటలు విషం లాంటివి. ఎంత మంచివారైనా వాటి ప్రభావంలో పడిపోతారు. భార్య ఎక్కించే విషంతో రంగడిలో విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించింది.
తల్లిదండ్రులు బారంగా తోచారు. ఎక్కడికైనా పంపుదామన్నా వాళ్ళు వెళ్లరు. కాబట్టి మొత్తంగా ఈ లోకం నుంచే పంపించేయాలని నిశ్ఛయించుకున్నాడు. ఒక రోజు సంచి ఒకటి భుజాన తగిలించుకొని, పతంగిపురంలో జరుగుతున్న తలుపులమ్మ తల్లి తీర్థానికి వెళదామని చెప్పి. వాళ్లను బయలుదేరమన్నాడు. వాళ్ళు కోడల్ని కూడా రమ్మన్నారు. కానీ ఏదో వంక పెట్టి తప్పించుకుంది విమల. పతంగిపురం వెళ్లడానికి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించాలి. అడవి మద్యకు రాగానే రంగడు విశ్రాంతి మిషతో ఓ చెట్టు నీడన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టాడు. ఇప్పడే వస్తానని చెప్పి, వెళ్ళి సంచిలో ఉన్న సామాగ్రితో దొంగోడి వేషం వేసుకున్నాడు.
ధృఢంగా ఉన్న ఓ చెట్టు కొమ్మను విరిచి పట్టుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. దానితో కొట్టి తల్లిదండ్రులను చంపాలని కర్రను పైకెత్తాడు. మారువేషంలో ఉన్న కొడుకుని గుర్తుపట్టలేదు వాళ్ళు. ‘‘ ఒరే రంగా ఎవడో మమ్మల్ని కొట్టిచంపబోతున్నాడు. ఎక్కడున్నావో గాని నువ్వు ఇటు రావద్దు. వెంటనే పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకో’’ అంటే అదే పనిగి అరవసాగారు. రంగడి చేతిలోని చెట్టు కొమ్మ అసంకల్పితంగా కిందికి జారిపోయింది విమల ఎక్కించిన విషం విరిగి, వాడికి జ్ఞానోదయమైంది.తల్లిదండ్రులకు తమ పిల్లల మీదుండే ప్రేమ అమృతం లాంటిదని, అనంతమైనదని అర్థమైంది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతూండగా మారువేషం తీసేశాడు. తల్లిదండ్రుల కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.
వాళ్లను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి రంగడు బార్యను అదుపులో పెట్టి, తల్లిదండ్రుల్ని ఎప్పటిలా ఆదరంగా, ఆప్యాయంగా చూసుకోసాగాడు.
7.గుణపాఠం
ఒక అడవిలో వింత పక్షి జీవించేది. దానికి రెండు తలలు, రెండు ముక్కులు, రెండు మెడలు ఉన్నాయి. కాని ఒక్కటే కడుపు ఉంది. ఒకరోజు అది అలా పచార్లు కొడుతుండగా దానికొక దేవతాఫలం దొరికింది. పక్షి సంతోషం పట్టలేక ఒక నోటితో ఆ పండును రుచి చూసి, "ఆహా! ఎంత రుచిగల పండు. ఎన్నో పండ్లు తిన్నాను కాని దీనంత రుచిగల పండు తినలేదు" అనసాగింది మొదటినోరు.
"నాక్కుడా సగం ఫలం ఇవ్వవా? నేను కూడా రుచి చూస్తాను" అని రెండోనోరు. "నేను తిన్నా నువ్వు తిన్నా ఒక కడుపులోకే కదాపోయేది" అంటూ మిగతా పండునంతా తినేసింది మొదటినోరు. ఎలాగైనా మొదటినోటికి గుణపాఠం చెప్పాలనుకున్నది రెండోనోరు.
ఆ రోజు నుండి మొదటినోటితో మాట్లాడటం మానేసింది రెండోనోరు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రెండోనోటికి ఒక చెట్టుకు వేలాడుతున్న విష్పు ఫలం కనబడింది.
"అది విషపుఫలం. నీవు దానిని తింటే నువ్వు, నేను ఇద్దరం చనిపోతాం. ఎంతైనా మనకున్నది ఒకే పొట్ట కదా!" అని మొదటి నోరు రెండో నోటిని ఆ విషపు ఫలం తిన వద్దని వారించసాగింది.
విషపు ఫలాన్ని తింటున్నట్టు నటించిన రెండోనోరు మొదటినోటిని ఒకసారి గమనించింది. చావు అంచుల్లో ఉన్నామని మొదటినోరు అనుకుంటున్న తరుణంలో, "చుశావా? నేనీ విషఫలం తింటే నువ్వు, నేను ఇద్దరం చచ్చే వాళ్లం. మనకిద్దరికీ ఒకే పొట్ట ఉన్నా మనిద్దరం ప్రతి వస్తువును పంచుకుని తింటూ, సజావుగా, సఖ్యతగా ఉంటే సమస్యలే రావు" చెప్పింది రెండోనోరు.
అవునన్నట్టు సిగ్గుతో తలదించుకున్న మొదటినోరు ఆ రోజు నుండి రెండోనోటితో సజావుగా, సఖ్యతగా ఉండసాగింది.
8.విచిత్రమైన జాతకం
కళింగ రాజ్యంలో అనేకమైన గొప్ప నగరాలుండేవి. వాటిలో దాంతిపురమనే నగరానికి ప్రభువు కళింగు. అతనికి పెద్ద కళింగు, చిన్న కళింగు అని ఇద్దరు కొడుకులు. వీరి జాతకాలు పరిశీలించిన దైవజ్ఞులు ఇలా చెప్పారు:
తండ్రి తదనంతరం పెద్దవాడే రాజ్యానికి వస్తాడు. చిన్నవాడిది మాత్రం చిత్రమైన జాతకం. అతని జీవితమంతా సన్యాసి యోగమే. కాని, మహారాజయోగం గల అదృష్టవంతుడు కుమారుడుగా పుడతాడు!
కొద్ది కాలానికి రాజు కళింగు కాలం చేశాడు. జ్యేష్ఠుడు సింహాసన మధిష్ఠించాడు. చిన్నవాడికి రాజప్రతినిధి పదవి వచ్చింది. తనకు కలగబోయే కుమారుడు మహారాజు కాబోతాడని జ్యోతిష్కులు చెప్పిన మాట చిన్న కళింగుకు బాగా మనసుకు పట్టింది. ఈ ధీమాతో అతడు అన్నకు లొంగి వుండక స్వతంత్రుడుగా వ్యవహరింప సాగాడు. ఉభయుల మధ్యా కలతలు ప్రారంభమయ్యాయి. కొన్నాళ్ళకు రాజు చిన్నవాణ్ణి బంధించమని ఆజ్ఞాపించాడు.
అదే కాలమందు బోధిసత్వుడు అవతరించి, కళింగరాజ్య మంత్రులలో ఒకడుగా ఉంటూ వచ్చాడు. పెద్ద కళింగుతరం నాటికి అతడు బాగా వృద్ధుడయ్యాడు. కుటుంబ క్షేమం కోరిన ఆ వృద్ధమంత్రి చిన్నకళింగు వద్దకు వచ్చి, రహస్యంగా రాజాజ్ఞను వెల్లడించాడు. రానున్న అవమానాన్ని తలపోశాడు చిన్నవాడు.
‘‘తాతా! అన్నివిధాలా నాకు నీవే హితుడవు. ఆనాడు జ్యోతిష్కులు చెప్పిన మాటలు నీకు తెలుసుకదా! అవి ఫలించడమే నిజమైతే నా కోరిక నెరవేర్చవలసిన బాధ్యత నీపై వున్నది. ఇదిగో, నా పేరుగల ఉంగరం, నా శాలువా, నా ఖడ్గం, ఈ మూడూ ఎవడైతే నీ వద్దకు తెచ్చి ఆనవాలు చూపిస్తాడో, వాడే నా కొడుకని గుర్తుంచుకో. నీ చేతనైన సహాయం కూడా చెయ్యి,'' అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రెండవ కంటికి తెలియకుండా అరణ్యాల్లోకి పారిపోయాడు.
ఆ రోజుల్లో మగధరాజుకు లేకలేక ఒక కుమార్తె కలిగింది. ఈమె జాతకం చూసిన జ్యోతిష్కులు, ‘‘ఇది ఒక చిత్రమైన జాతకం. రాజకుమారి జీవితం ఒక సన్యాసినిగా గడుపుతుంది. ఐతే, ఆమెకు మహారాజయోగంగల కుమారుడు పుడతాడు,'' అని చెప్పారు.
ఈ సంగతి తెలియగానే సామంతరాజులందరూ రాజకుమారిని పెళ్ళాడాలని వచ్చి పోటీలు పడసాగారు. రాజుకు గట్టి చిక్కే వచ్చింది. వీరిలో తన కూతుర్ని ఏ ఒకరికి ఇచ్చినా తక్కినవారు కక్షగట్టి పగ తీర్చుకోవడం సహజం. కనుక, ఈ అపాయం నుంచి తప్పించుకోడానికి నిశ్చయించాడు. గత్యంతరం లేక భార్యనూ, కూతుర్నీ వెంటబెట్టుకుని మారువేషంతో అరణ్యాల్లోకి పలాయనమయ్యాడు.
నదీతీరాన సదుపాయమైన స్థలంలో ఒక చిన్న కుటీరం నిర్మించుకుని అందులో ముగ్గురూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. వీరి కుటీరానికి కొంచెం ఎగువనే కళింగరాజపుత్రుని కుటీరం ఉన్నది.
ఒక రోజున, కుమార్తెను కుటీరంలో వదలి, మగధ రాజదంపతులు కందమూల ఫలాదులకోసం వెళ్ళారు. ఆ సమయంలో రాజపుత్రి రకరకాల పువ్వులు పోగుచేసి ఒక చక్కని దండ కట్టింది. కుటీరం పక్కనే గంగ ఒడ్డున ఒక గున్న మామిడిచెట్టు వుంది. మగధ రాజపుత్రి ఆ చెట్టెక్కి కొమ్మల్లో కూర్చుని తను కట్టిన పువ్వుల దండను అక్కడి నుండి నీటిలో పడవేసి, వేడుక చూస్తున్నది.
ఆ పువ్వులదండ తేలి ఆడుతూ పోయి పోయి, స్నానం చేస్తున్న చిన్న కళింగు తలకు తాకింది. వెంటనే అతడు దానిని తీసి చూసి, ‘‘ఎంత చక్కటి పూలదండ! ఎన్ని రకాల పువ్వులు! దీనిని ఇంత ఇంపుగా సొంపుగా కూర్చినామె అపురూపమైన అందకత్తె అయివుంటుంది. ఈ మహారణ్యంలో ఇటువంటి సుందరికి పనియేమిటో?'' అని ఆలోచించాడు. దండ కట్టిన సుందరిని వెతకాలని అతని మనసు ఉరకలు వేయసాగింది.
ఈ సంకల్పంతో కళింగు అరణ్యమార్గాన వెళుతూవుండగా, ఒక దిక్కు నుండి వీనులవిందు చేసే తీయని కంఠస్వరం వినవచ్చింది. అట్టె నిలబడి అటు ఇటు చూడగా, మామిడిచెట్టు కొమ్మల్లో కూర్చొని పాడుతున్న సుందరి అతడికి కనిపించింది. ఆ యువతిని చూసి, కళింగు పరవశుడై ఆమెతో కుశల ప్రశ్నలు ప్రారంభించాడు.
చివరకు, ఆమెను తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం వెల్లడించాడు. అందుకామె, ‘‘మీరు ఋషిసంతతికి చెందిన వారు, మేము క్షత్రియులం!'' అన్నది.
వెంటనే కళింగు, ‘‘నేనూ క్షత్రియుణ్ణే,'' అంటూ తన గుట్టుమట్టులన్నీ విప్పి చెప్పాడు. అప్పుడు రాజకుమారి తమ పరిస్థితులు కూడా దాపరికం లేకుండా చెప్పివేసింది.
ఇద్దరూ కలిసి ఆమె తండ్రివద్దకు వెళ్ళగానే, సంగతి సందర్భాలు తెలుసుకుని, ‘‘ఇతడే అమ్మాయికి తగిన వరుడు,'' అని మగధరాజు నిశ్చయించాడు.
చిన్న కళింగుకూ, మగధ రాజకుమారికీ వివాహం జరిగింది. కొద్ది కాలానికే వారికి ఒక కుమారుడు కలిగాడు. గొప్ప లక్షణాలతో ప్రకాశించే ఆ బిడ్డడికి, విజయకళింగు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
కొన్నాళ్ళు గడిచిన తరవాత ఒక రోజున, చిన్న కళింగు జాతకాలు తీసి, లెక్కవేసి గ్రహకూటాలు ఎలా వున్నదీ చూశాడు. అప్పటికి తన అన్న ఐన పెద్ద కళింగు ఆయువు మూడి వుంటుందని లెక్కలవల్ల తేలింది.
అప్పుడు కళింగు కొడుకును చేర బిలిచి, ‘‘కుమారా! నీవు జీవితం గడప వలసింది ఈ అడవులలో కాదు. నా అన్న పెద్ద కళింగు దాంతిపుర ప్రభువు. ఆ రాజ్యానికి వారసుడవు నీవే! కనుక, వెంటనే వెళ్ళి ఆ సింహాసనం అధిష్ఠించు,'' అని చెప్పి, వృద్ధమంత్రిని గురించి చెప్పి, మూడు వస్తువులూ ఆనవాలిచ్చి దీవించి పంపాడు.
తల్లిదండ్రుల వద్దా, తాతా అమ్మమ్మల వద్దా సెలవు తీసుకున్న విజయకళింగు దాంతిపురం చేరుకుని, వృద్ధమంత్రిని దర్శించి, తాను ఫలానా అని చెప్పాడు.
అప్పటికి, చిన్న కళింగు అంచనా ప్రకారమే అతని అన్న కాలం చేశాడు; దాంతిపురం అరాచకస్థితిలో వున్నది.
ఒక మహాసభ ఏర్పాటు చేసి, వృద్ధమంత్రి చిన్నవాడైన విజయకళింగు పుట్టుపూర్వోత్తరాలు వెల్లడించేసరికి, సభికులందరూ ఆశ్చర్యభరితులై జేజేలు పలికారు.
వృద్ధమంత్రి అయిన బోధిసత్వుడి సలహాలు పాటిస్తూ, విజయకళింగు చక్కగా రాజ్యం పరిపాలించి, పెద్దల పేరు నిలబెట్టాడు.
9.గురువును మించిన శిష్యుడు
ఆ రోజు సోమవారం. సూరిబాబు ఎంతో ఉత్సాహంగా బడికి బయలుదేరాడు. దారిలో స్నేహితులు కలిశారు. మాటల సందర్భంలో ఆదివారం నాడు తాము ఎలా గడిపామో ఒక్కొక్కరు సంతోషంగా చెప్పడం ప్రారంభించారు. నిఖిల్ తాను తన అభిమాన హీరో సినిమా చూశానన్నాడు. చంద్రం తానెంతో ఇష్టపడే క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. లోకేష్ తాను గీసిన డ్రాయింగ్ గురించి వర్ణించాడు. సూరిబాబు వంతు వచ్చింది. ఇంతలో బడి గంట మోగటంతో వారంతా బడిలోకి గబగబ అడుగులు వేయసాగారు. గదుల నుంచి బయటకు వచ్చారు. అప్పుడే పాఠశాల ఆవరణలో ఆగిన కారు వంక అందరూ తదేకంగా చూడసాగారు. కారులోంచి ఓ వ్యక్తి దిగడం, ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్ళడం గమనించిన విద్యార్థులు అతడు ఎవరై ఉంటాడోనని గుసగుసలాడసాగారు. మధ్యాహ్నాం చివరి పీరియడ్ "నీతిబోధన" తరగతికి తెలుగు మాష్టారు వచ్చారు. మాష్టారు చెప్పే నీతి కథలంటే పిల్లలకెంతో ఇష్టం. ఆ రోజు మాష్టారు చెప్పబోయే కథకోసం పిల్లలెంతో ఆత్రుతతో ఎదురు చూడసాగారు. కానీ మాష్టారు తాను చెప్పిన నీతికథలు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాలని ఉత్సాహపడ్డారు.
తెలుగు మాష్టారు విద్యార్థులను తాము ఇతరులకు సాయపడిన సందర్భాల గురించి అడగడంతో వారు అవాక్కయ్యారు. మాష్టారు చెప్పిన కథలు వినడం వాటిని తమ స్నేహితులకు చెప్పడం తప్ప ఆ కథల్లోని నీతిని తమ జీవితంలోని వివిధ సందర్భాలలో ఎలా అన్వయించుకోవాలో తెలియక, బొత్తిగా ఆచరించని ఆ విద్యార్థులు మాష్టారు వేసిన ప్రశ్నకు బిక్కముఖం వేశారు. తాను ఇన్నాళ్ళు చెప్పిన నీతికథలు బాలల ఆలోచనల్లో ఏ మాత్రం కదలిక తేలేకపోయినందుకు మాష్టారు బాధపడ్డారు. మాష్టారి మనస్సును సరిగ్గా చదవగలిగిన సూరిబాబు, తాను ఆచరించిన పనులను మాష్టారి ముందుంచేందుకు తనకెందుకు ధైర్యం చాలడంలేదోనని కలవరపడ్డాడు. ఎలాగైనా సరే, మాష్టారి బోధనల వల్ల తాను చేసిన ఒక మంచి పనిని మాష్టారికి చెప్పి అతడి వేదన పోగొట్టాలని తలచిన సూరిబాబు "మాష్టారూ! నేను చెబుతా!" అని మనసులోనే అనుకుంటూ పైకి లేవబోయాడు. ఇంతలో తెలుగు మాషార్ని ప్రధానోపాధ్యాయుడు పిలుస్తున్నారని కబురు రావడంతో మాష్టారు వెళ్ళిపోయారు. సూరిబాబుకు తాను చేసిన పని మాష్టారికి చెప్పే అవకాశం చేజారిపోయింది. కొంత సేపటికి లాంగ్‌బెల్ కొట్టడంతో పిల్లలంతా బడి వదిలిపెట్టారు.
మరుసటి రోజు ఉదయం ప్రార్థనా సమావేశం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుడు ఓ కొత్త వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు. క్రితం రోజు పాఠశాలకు కారులో వచ్చిన ఆ వ్యక్తిని కొందరు గుర్తించారు. అతడు వృద్దాశ్రమానికి చెందిన ఆఫీసరు. తర్వాత తెలుగు మాష్టార్ని వేదికపైకి ఆహ్వానించారు. మాష్టారి నీతికథల వల్ల ఓ విద్యార్థి ఆలోచనల్లో వచ్చిన మంచి మార్పే నేడు మన పాఠశాలకు ఎంతో గర్వకారణమయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతుండగా, అందరూ ఆ విధ్యార్థి ఎవరో? అని ఎదురు చూడసాగారు. తెలుగు మష్టారి ముఖంలో ఆనందం చూసి సంబరపడుతున్న సూరిబాబు తనను వేదికపైకి పిలవడాన్ని పట్టించుకోలేకపోయాడు. తమ తోటి విద్యార్థులు తనను వేదికపైకి వెళ్ళమని చెప్పడం, అందరూ తన వంకే చూస్తూ ఉండటం, ఏమి జరుగుతుందో ఏమీ అర్థంకాని సూరిబాబు తడబడుతూ వేదికపైకి వెళ్ళాడు. ఆదివారం నాడు నడిరోడ్డుపై అడ్డంగా వెళుతున్న ఓ అంధ వృద్ధుణ్ణి బస్సు ప్రమాదం నుండి కాపాడడమేకాక అతణ్ణి వృద్ధాశ్రమంలో చేర్చిన సూరిబాబుకు వృద్ధాశ్రమ ఆఫీసర్ మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
విద్యార్థులు, టీచర్లు తమ కరతాళ ధ్వవనులతో సూరిబాబును అభినందించసాగారు. సూరిబాబుని మాట్లాడమని వృద్ధాశ్రమ ఆఫీసరు కోరారు. "తాను ఆచరించడమే కాక, నీతికథల ద్వారా మాలో మానవతా దృక్పథాన్ని పెంపొదిస్తున్న మా తెలుగు మాష్టారే నాకు ఆదర్శం" అన్నాడు. ప్రధానోపాధ్యాయుడు సూరిబాబును అభినందిస్తూ, గురువుని మించిన శిష్యుడని అభివర్ణించారు.
10.మాయాజాలం
ప్రకాష్ సెల్ఫోన్లో పాటలు వింటూ చెప్పబోయే పాఠం కోసం పుస్తకంలో పాయింట్స్ నోట్ చేసుకోసాగాడు. అంతలో పక్కన సోషల్ సార్ కూర్చుంటూ "మిత్రమా... కొంచెం ఆ పాట బ్లూటూత్ ద్వారా ఎక్కిస్తావా... చాలా బాగుంది" అంటూ కొత్తగా కొన్న సెల్ చేతిలో పెట్టాడు.
ప్రకాష్ దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ “ఏమో సార్... నాకు అంత ఐడియా లేదు. ఫోన్లు, మెసేజ్ లు, పాటలు వినడం తప్ప మిగతా ఆప్షన్లు ఎప్పుడూ చూడలేదు" అన్నాడు తిరిగి ఇచ్చేస్తూ.
"నాదీ అదే సమస్య సార్... హైస్కూల్ చదివే చిన్న చిన్న పిల్లలు కూడా చేతికి సెల్ దొరుకుతే చాలు చకచక ఏవేవో నొక్కి ఏమేమో చేసేస్తుంటారు. మనకేమో ఈ టెక్నాలజీ అర్థమై చావడం లేదు" అన్నాడు సోషల్ సార్.
“సార్... మన కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ ఉన్నాడు గదా... పోయి వాన్ని అడగండి, చెప్తాడు" అన్నాడు ఇంగ్లీష్ సార్ మధ్యలో జోక్యం చేసుకుంటూ.
"నిజమేననుకో...
కానీ ఆ కంప్యూటర్ రూంలోకి పోవాలంటేనే ఏదో అనీజీ. వానికి పెద్ద టెక్కు ఏదో ఆకాశం నుండి ఊడిపడ్డట్టు, పెద్ద మేధావి అయినట్టు తెగ ఫోజు కొడుతుంటాడు".
“నిజమే సార్... మీరు చెప్పేది. మనమింత చదువులు చదివి, ఇంత అనుభవమున్నా ఆ పొట్టెగాళ్ళ ముందు చులకనైపోయాం. డిగ్రీ పాస్ కావడం చేతగాని సన్నాసులు గూడా కంప్యూటర్ల ముందు కూర్చోని ఏవేవో గెలుకుతుంటే కడుపులో దేవినట్లనిపిస్తాది" బాధ పడ్డాడు తెలుగు సారు.
“సార్... ఈసారి అందరం మెయిల్ ఐడీ సబ్ మిట్ చేస్తేగానీ జీతాలు రావంట గదా... నిజమేనా?" అడిగాడు ఇంగ్లీష్ సార్.
"అవునవును. మొన్న మీరు సెలవు పెట్టారుగదా... ఆరోజు వచ్చింది స్టాఫ్ ఆర్డర్. ఐనా అదేమంత కష్టం కాదులే. కొండారెడ్డి బురుజు ఎదురుగా రామం ఇంటర్నెట్ సెంటర్ ఉంది. యాభై రూపాయలు ఇస్తే చాలు. పది నిమిషాల్లో ఐడీ క్రియేట్ చేసి పాస్ వర్డ్ ఇచ్చేస్తాడు. మన టీచర్సంతా అక్కడికే వెళ్ళేది" సమాధానమిచ్చాడు సోషల్ సార్.
అంతలో బెల్ కొట్టడంతో ఎవరికి వారు పుస్తకాలు సర్దుకొని వాళ్ళ తరగతులకు బయలుదేరారు.
ఫోన్ మోగుతోంది. ఆదివారం కావడంతో బద్దకంగా మంచమ్మీద అటూ యిటూ దొర్లుతున్న లావణ్య విసుగ్గా ఫోన్ అందుకుని చూసింది.
ధనలక్ష్మి
ఏమబ్బా ఇంత పొద్దున... అనుకుంటూ, నిద్రపోతున్న భర్తకు డిస్టర్ కాకుండా పక్కకు వచ్చి ఆన్ చేసింది.
“ఏమే... ఈ రోజు ఇంట్లోనే ఉంటున్నావా? బైటికెక్కడికన్నా వెళుతున్నావా? అని అడిగింది ధనలక్ష్మి.
“ఇంట్లోనే లే... ఏం?"
"కొంచెం మాట్లాడాల... ఎన్ని గంటలకు రమ్మంటావ్?"
లావణ్య ఒక నిమిషం ఆలోచించింది. ఎప్పుడూ అడగని ధనలక్ష్మి ఇలా అడుగుతోందంటే ఏదో అత్యవసరమైన పనే ఉంటుందని నిర్ణయానికి వచ్చి “సర్లేవే.... పదకొండింటికి రా... మా ఆయనకు వాళ్ళ కొలీగ్ ఇంట్లో ఏదో ఫంక్షనుందట. అప్పటికంతా వెళ్ళిపోతాడు" చెప్పింది.
లావణ్యతో మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి వంటగదిలోకి వచ్చి బెండకాయలు కడిగి, ముక్కలు కట్ చేయసాగింది ధనలక్ష్మి.
అప్పుడే నిద్రలేచిన ప్రకాష్ నిద్రకళ్ళతోనే అక్కడికి వచ్చి “ధనా... తొందరగా టిఫిన్ చేయ్... బైటకెళ్ళాలి" అన్నాడు...
“సెలవురోజు కూడా అంత తొందరేమీ? పదకొండుకు గదా నీవు బైటపడేది" అంది మూకుడు స్టవ్ పైకి ఎక్కిస్తూ.
"నిజమేలే... కానీ ఈ రోజు కొంచెం పనుంది. నిన్న సాయంత్రం ట్యూషన్లో చిన్న గొడవయ్యింది. ఒక పిల్లవాడి పేరెంట్స్ ని పిలిపిస్తున్నారు... వెళ్ళాలి" అన్నాడు.
“గొడవా... ఏమయ్యింది?" ఆసక్తిగా పనాపేసి భర్తవైపు తిరిగింది.
"చెబుతా గానీ, ముందు ఆ టిఫిన్ సంగతి చూడు.
"పది నిముషాల్లో కూరయిపోతుందిలే. చపాతీ పిండి ముందే తడిపి పెట్టా...
ఇంతకూ ఏమైంది? ఏదో గొడవైందన్నావే" మరొకసారి గుర్తు చేసింది ధనలక్ష్మి.
“అదా... నిన్న సాయంత్రం సాయిరాం కాలేజీలో ఈవినింగ్ క్లాస్ చెబుతున్నానా.. వెనక బెంచీలో ఒక పిల్లవాడు కూర్చొని పాఠం వినకుండా కిందికే చూస్తా వున్నాడు. పక్కనున్న పిల్లోళ్ళు గూడా అప్పుడప్పుడు కళ్ళు తిప్పి అటువైపు తొంగి చూస్తా వుంటే... అనుమానం వచ్చి హఠాత్తుగా వాళ్ళ దగ్గరికి పోయి చూస్తే... ఇంకేముంది?! పుస్తకం మధ్యలో సెల్ ఫోన్ పెట్టుకోని సినిమా హీరోయిన్ల బొమ్మలు చూస్తా వున్నాడు. పిచ్చికోపమొచ్చిందనుకో... ఫట్ ఫటమని చెంప మీద రెండు వాయించి, చొక్కా పట్టుకొని
ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకుపోయినా. ఆయన దాన్ని ఓపెన్ చేసి చూస్తే... సెల్ ఫోన్ నిండా హాట్ హాట్ వీడియో సాంగ్సే. హీరోయిన్ల అర్ధనగ్న దృశ్యాలు, నీలి చిత్రాల బిట్స్... ఈ తల్లిదండ్రులకు కొంచెం కూడా బుద్ధిలేదు. పిల్లలకు సెల్‌ఫోన్లతో ఏం పని? వాళ్ళు అడిగిందే ఆలస్యం - ఎందుకు, ఏమిటి, అవసరమా, అనవసరమా అని ఆలోచించకుండా కొనియ్యడమే. ఆఖరికి ఆరోతరగతి పిల్లల బ్యాగుల్లో కూడా సెల్ ఫోన్లే. అందుకే ఆ అబ్బాయి తల్లిదండ్రులని పిలిపిస్తున్నాం కౌన్సిలింగ్ కి...." అంటూ బ్రష్ పై పేస్టు వేసుకొని బాత్ రూం వైపు నడిచాడు.
ప్రకాష్ చాలా బిజీ. అతని సబ్జెక్ట్ కు మంచి డిమాండ్ వుండడం, పైగా బాగా చెబుతాడనే పేరుండడంతో ఉదయం, సాయంత్రం నాలుగైదు కాలేజీలలో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. పొద్దున ఏడు గంటలకు క్యారియర్ తీసుకొని బైలుదేరితే తిరిగి ఇంటికి చేరేది రాత్రి పదికే.
ధనలక్ష్మి డిగ్రీ వరకు చదువుకొంది. ఇంటి బాధ్యతంతా ఆమెదే. పిల్లలు కాలేజీకి పోగానే ఇంటికి కావలసిన సరుకుల దగ్గర్నుండి. కట్టాల్సిన బిల్లుల వరకూ అన్నీ చకచక పూర్తి చేసుకుంటుంది.
టైం చూసింది. ఎనిమిదవుతోంది. పిల్లలింకా మిద్దెమీది నుండి దిగిరాలేదు. ఆదివారమయితే చాలు ఏ పదింటికోగాని దిగిరారు. ఇంటర్నెట్ పెట్టించాక మరీ ఆలస్యం అవుతోంది. ఇద్దరూ ఆడపిల్లలే. పెద్దమ్మాయి ఇంజనీరింగ్, చిన్నమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు. పెద్దమ్మాయి సబ్జెక్ట్ కు కావలసిన సమాచారం కొరకు చాలాసార్లు నెట్ సెంటర్‌కు పోవాల్సి వస్తోంది. అది ఇంటికి దూరంగా ఉండడం, రాత్రుళ్ళు ఆలస్యం అవుతుండడంతో... పైగా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ రహస్య వీడియోల వల్ల అమ్మాయిలకు రక్షణ కరువవ్వడం... ఇదంతా ఎందుకని ఇంటికే కనెక్షన్ పెట్టించుకున్నారు. కింద వుంటే ఇంటికొచ్చే బంధువులతో, స్నేహితులతో పిల్లల చదువులకి డిస్టర్బెన్స్ అవుతుండడంతో పై గదిలోకి మార్చారు. అప్పటి నుంచి పిల్లలు కిందికి దిగిరావడమే లేదు. ఇంతకు ముందు టీవీలో సినిమా చూడ్డానికో, సీరియల్ చూడ్డానికో వచ్చేవారు. ఇప్పుడు అన్నం ప్లేట్లు కూడా తీసుకొని పైకి ఉరుకుతున్నారు. చిన్నపిల్ల కూడా గేమ్స్ అనీ, ఫేస్ బుక్ అని వాళ్ళక్కతో పోటీ పడుతూ ఉంటుంది. కంప్యూటర్ కి సంబంధించిన జ్ఞానం ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ లేకపోవడంతో అసలు వాళ్లేమి చేస్తున్నారో, ఏం చదువుతున్నారో కూడా అర్ధం కావడం లేదు. పిల్లలతో మాటలు కూడా చాలా కరువైపోయాయి.
ఇంటర్నెట్ ఇంటికి వచ్చాక పిల్లల్లో వచ్చిన మార్పు గురించి ఒకసారి లావణ్యకు బాధపడుతూ చెప్పింది ధనలక్ష్మి.
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది లావణ్య.
“చూడు పిల్లలని గుడ్డిగా నమ్మకూడదు. స్వేచ్ఛని సద్వినియోగం చేసుకునే వయసు, పరిపక్వత వాళ్ళకింకా ఉండదు. కొంచెం నియంత్రణ అవసరం. ఒకసారి నెట్ ఆన్ చేయి. కుడివైపున స్పానర్ లాగా ఒక గుర్తు ఉంటుంది. దానిని క్లిక్ చేయి. కొన్ని పేర్లు వస్తాయి. అందులో హిస్టరీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయి. గతవారం రోజులుగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే విషయాలన్నీ వరుసగా తేదీ, టైమ్ తో సహా ప్రత్యక్షమవుతాయి. దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు" అంది లావణ్య.
తరువాత రోజు పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయాక మేడ మీది గదికి చేరింది ధనలక్ష్మి, ఇంటర్నెట్ ఓపెన్ చేసి లావణ్య చెప్పినట్లుగానే చేస్తూ హిస్టరీ ఓపెన్ చేసి చూడగానే అదిరిపోయింది. పెద్దపిల్ల కన్నా చిన్నపిల్ల ఇంకా ఫాస్ట్ గా ఉంది. ఎవరో అబ్బాయితో రోజూ రాత్రి పన్నెండు వరకు ఛాట్ కూడా చేస్తూ వుంది. భర్తకు చెబితే అనవసరంగా గొడవ. నిమిషాల మీద కోపమొచ్చేస్తుంది. వయసొచ్చిన పిల్లలని కూడా చూడకుండా బాదేస్తాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. అందుకే ఆ సమస్య నుండి ఎలా బైటపడాలో అర్థంకాక పొద్దున్నే లావణ్యకు ఫోన్ చేసింది.
ఆ ఆలోచనలలో వుండగానే అంతలో భర్త తలస్నానం చేసి బైటకు వచ్చాడు. టిఫిన్ తింటూ "ఇంకా లేవలేదా పిల్లలు" అన్నాడు.
“ఆదివారం కదా" అంది ధనలక్ష్మి.
“పడుకోనియ్యిలే పాపం... రాత్రంతా చదివి చదివీ అలసిపోయి ఉంటారు. ఈ మధ్య కాలేజీలో వర్క్ ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. రాత్రి పన్నెండయినా పైన లయిట్లు ఆరిపోవడం లేదు.పాపం చాలా కష్టపడుతున్నారు" అంటూ టిఫిన్ తిని కాలేజీ కి వెళ్ళిపోయాడు.
ధనలక్ష్మి వంటగది శుభ్రంగా సర్ది పిల్లలను లేపుదామని పైకి పోయింది. పెద్దపిల్ల మంచమ్మీద పడి నిద్రపోతోంది. చిన్నపిల్ల నిద్రమబ్బుతోనే కంప్యూటర్ ముందు కూర్చోని ఏదో టైప్ చేస్తూ వుంది.
"ఏందే అంత పొద్దున్నే మొదలు పెట్టేశావ్? బ్రష్ చేసేదుందా... లేదా?" అంది కోపంగా ధనలక్ష్మి,.
“నీకేం తెలియదులేమ్మా.... చాలా ఇంపార్టెంట్ పని. ఫిజిక్స్ ఎక్స్ పెరిమెంట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఉదయమైతే నెట్ ఫాస్ట్ గా ఉంటుంది" తల తిప్పకుండా సమాధానమిచ్చింది.
ధనలక్ష్మి కంప్యూటర్ వైపు చూసింది. ఏదో సినిమా డౌన్లోడ్ అవుతోంది. అమ్మ చూస్తోందని తెలిసినా ఏ మాత్రం తడబాటు లేదు. తమ అజ్ఞానం మీద వాళ్ళకంత నమ్మకం. ఒళ్ళు జలదరించింది. ఏమీ మాట్లాడకుండా "నాకు కొంచెం పనుంది. బైటికి పోతున్నా. చపాతీ పిండి ఫ్రిజ్ లో ఉంది. కాల్చుకుని తినండి" అంటూ కిందికి వెళ్ళిపోయింది.
పిల్లల గురించే ఆలోచిస్తూ స్నానం పూర్తి చేసింది. సమయం పది దాటింది. టిఫిన్ తిని నెమ్మదిగా లావణ్య ఇంటికి బైలుదేరింది. చేరుకొనేసరికి పదకొండయ్యింది.
“రా... రా... నీ కోసమే ఎదురు చూస్తున్నా" అంటూ ఆహ్వానించింది లావణ్య.
“ఫోన్లో మాట్లాడుకోవడమే తప్ప... చాలా రోజులైంది నిన్ను చూడక. కొంచెం ఒళ్ళు చేసినట్లున్నావే" అంది నవ్వుతూ.
"నీ మాదిరి తిరిగే వుద్యోగం కాదు గదా. తినడం, పడుకోవడం. ఒళ్ళురాక ఏమొస్తాది చెప్పు" నవ్వుతూ సమాధానం ఇచ్చింది ధనలక్ష్మి.
ఇద్దరూ కాసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక “ఏందే... ఎప్పుడూ లేంది అంత పొద్దున్నే ఫోన్ చేశావ్?" అంటూ లావణ్య అసలు విషయంలోకి దించింది.
“అదేనే... నీవు చెప్పావు కదా, నెట్లో పిల్లలు ఏం చేస్తున్నారో గమనించమని. అలాగే చూశా. పనికొచ్చేవి పదయితే పనికిరానివి నూటాపది. కొన్ని చూస్తే తల తిరిగిపోయింది. ఆడపిల్లలు కూడా ఇలాంటివి చూస్తారా అని ఆశ్చర్యమేసింది. ఏం చేయాలో తోచక నీ దగ్గరకొచ్చాను" అంటూ జరిగిందంతా వివరించింది.
“ఆడపిల్లలా, మగపిల్లలా అని చూడొద్దు. ఆకర్షణలు అంత బలంగా ఉంటాయి. ఏ మాత్రం నియంత్రణ కోల్పోయినా చాలు సాలెగూట్లో చిక్కుకుపోతారు. మా బంధువుల అబ్బాయైతే చదువులో నెంబర్ వన్. కాలేజీలో టాపర్. అవసరమంటే నెట్ పెట్టించారు. ఎలా చిక్కుకున్నాడో గానీ ఎప్పుడు చూడూ కొత్త సినిమాలు, గేమ్స్, పాటలు, పోర్న్ వీడియోలు, ఫేస్ బుక్ లు, యూట్యూబ్, టిక్ టాక్ , వాట్సాఫ్, ట్విట్జర్లు, ఛాట్లు, మెయిళ్ళంటూ రాత్రింబవళ్ళు ఆ గదిలోనే... వాళ్ళ నాన్న వాడి కళ్ళ కింద నల్లని చారలు చూసి నెట్ పెట్టించాక పాపం ఇంకా కష్టపడి చదువుతున్నాడు అనుకున్నాడేగానీ, రిజల్ట్స్ వచ్చేదాక వాస్తవం గ్రహించలేకపోయాడు. కానీ ఏం లాభం? అప్పటికే బానిసయిపోయాడు. కనెక్షన్ తీసేస్తే పిచ్చిపట్టినవానిలా అరుస్తూ కేకలేస్తున్నాడు. మానసికంగా దెబ్బతిని ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు" చెప్పింది లావణ్య.
ఆ మాట విని ధనలక్ష్మికి భయం వేసింది. “ఐతే, ఇప్పుడే నెట్ తీపించేస్తా... పీడా పోతుంది" అంది.
"నేను చెబుతున్నది అందుక్కాదు. వాళ్ళు ఎదగడానికి సదుపాయాలు ఎంత అవసరమో, వాటికి బలి కాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం అని అర్థం చేసుకోవడానికి. ఇందులో పిల్లల తప్పు కన్నా మన తప్పే ఎక్కువ. వచ్చేది కంప్యూటర్ యుగం. భవిష్యత్తులో కంప్యూటర్ తెలియనివాడు నిరక్షరాస్యుని కిందనే లెక్క. ఇంత చదువు చదివి కూడా పిల్లల భవిష్యత్ కోసం ఆ కంప్యూటర్ గురించి, ఇంటర్నెట్ గురించి మనం తెలుసుకోకుంటే ఎలా? అదేదో పెద్ద బ్రహ్మరాక్షసి అన్న భయం మనలో పేరుకుపోయింది. మనం దాంట్లో కోర్సులు నేర్చుకోవడమంటే కష్టంగానీ బేసిక్స్ తెలుసుకోవడానికి ఎంత సేపు? ఈడ్చి కొడితే మూడు నెలలు చాలు. ఏమాత్రం తెలివితేటలు లేని, పనికిరాని సన్నాసయినా సరే... కాస్త బట్లర్ ఇంగ్లీష్ వస్తే చాలు సులభంగా వచ్చేస్తుంది అది. మనకు గూడా కంప్యూటర్ గురించి తెలుసు అనే భావన పిల్లల్లో కలిగితే చాలు. వాళ్ళు హద్దుల్లో వుంటారు. ఆలాగే ఆ కంప్యూటర్ మేడ మీద గదిలోంచి కిందకి దించి అందరూ తిరిగే ప్రదేశంలోనే కాస్త ప్రైవేట్ గా వుండేలా ఏర్పాటు చేయి. దాన్ని వాడటానికి రెండు గంటలో, మూడు గంటలో సమయాన్ని నిర్ణయించు. అలాగే మీరు తప్పు చేయడం లేదు కాబట్టి మీ సెల్ ఫోన్ కూడా ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూస్తామని సున్నితంగా చెప్పండి. అలాగే మీ పిల్లలకి నీవు తెలుసుకున్న విషయాన్ని ఏ మాత్రం తడబాటు లేకుండా నిర్మొహమాటంగా ముఖాముఖి చెప్పి... ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఊర్కోనని , నాన్నకు చెబుతానని వార్నింగ్ ఇవ్వు" అంటూ అనేక సలహాలు ఇచ్చింది.
లావణ్యకు థాంక్స్ చెప్పి బయలుదేరింది ధనలక్ష్మి, ఇంటికి దగ్గరలో 'నైస్' కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ కనిపించింది. లావణ్య మాటలు గుర్తుకు వచ్చాయి. కొత్త బ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో కనుక్కోవడానికి లోపలికి అడుగు పెట్టింది.
11.పరమానందయ్య శిష్యులు
అనగనగా ఒక వూరు. ఆ వూరు పేరు పుణే అనబడే పూనా.ఆ నగరంలో ఇద్దరు గురువులు. ఒకరు పరమానందయ్య, మరొకరు ఆనందయ్య. పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు, ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్యరికం చేస్తున్నారు.
గురువుల సంగతేమో కానీ వారి శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం. అలాగే అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై అంతులేని అపనమ్మకం.
ఒక రోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబై లో ఒక పని చక్కపెట్టుకుని రమ్మని ఆదేశించారు.
గురువాజ్ఞను శిరసావహించి ఆ పద్నాలుగుమంది రెండు జట్లుగా పుణే రైల్వే స్టేషనుకు వెళ్లారు.
ఆ శిష్యబృందానికి ఒక మహత్తరమయిన ఆలోచన వచ్చింది. గురువులు ఎట్లాగో లేరు. ఎదుటి పక్షం వారు తమ సమక్షం లోనే వున్నారు. రెండు పక్షాలలో ఎవరి తెలివి తేటలు గొప్పవో తేల్చుకోవడానికి ఈ ప్రయాణమే ఇదే సరయిన తరుణం అనుకున్నారు.
ఆనందయ్య బృందం తమ ఏడుగురికీ ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు. పరమానందయ్య శిష్యులు మాత్రం ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకటే ఒక టిక్కెట్టు కొన్నారు. ఇంతలో టీసీ వచ్చాడు. పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం ఆనందిస్తుండగానే, పరమానందయ్య శిష్యులు ఏడుగురూ తటాలున రైలు బోగీలో వున్న టాయిలెట్లో దూరారు. టీసీ టాయిలెట్ తలుపు తట్టాడు. తలుపు ఓరగా తెరుచుకుని ఒక చేయి బయటకు వచ్చింది. అందులో ఒక టిక్కెట్టు వుంది. టీసీ సంతృప్తి పడి వెళ్ళిపోయాడు. ఇది చూసిన ఆనందయ్య శిష్యులకు వొళ్ళు మండింది. పరమానందయ్య శిష్యులు చేసిన ట్రిక్కు అర్ధమయింది.
సరే రెండు జట్లూ ముంబాయ్ చేరాయి. గురువులు ఒప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ముంబాయ్ నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్ లో టిక్కెట్లు దొరకలేదు. లోనావాలా వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడినుంచి లోకల్ ట్రైన్లో పుణే వెళ్ళాలనుకున్నారు.
తిరుగు ప్రయాణంలో ‘ఒకే టిక్కెట్టు’ అనే ట్రిక్కుతోనే ఎదుటి పక్షం ఆట కట్టించాలని ఆనందయ్య శిష్యులు పధకం వేసారు. ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒకే టిక్కెట్టు కొనుక్కుని లోనావాలా రైలెక్కారు. పరమానందయ్య శిష్యులు ఒక్క టిక్కెటు కూడా కొనలేదు.
టీసీ రావడాన్ని పసికట్టి రెండు జట్లూ చెరో టాయిలెట్లో దూరాయి. పరమానందయ్య శిష్యుల్లో ఒకడు టాయిలెట్ నుంచి బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదుటి టాయిలెట్ తలుపు తట్టాడు. అలా తట్టింది టీసీయే అని భ్రమపడి ఆనందయ్య శిష్యులు తమ వద్ద వున్న ఒకే ఒక టిక్కెట్టును తలుపు ఓరగా తెరిచి బయట పెట్టారు. అదను కోసం వేచి వున్న పరమానందయ్య శిష్యుడు తటాలున ఆ టిక్కెట్టు తీసేసుకుని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు. మళ్ళీ పాత ట్రిక్కే వాడి టీసీ నుంచి తప్పించుకున్నారు. కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్టును పోగొట్టుకున్న ఆనందయ్య శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు. ఏమయితేనేం, మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పుణే వెళ్ళే లోకల్ ఎక్కారు.
ఆనందయ్య శిష్యులు ఒక్క టిక్కెట్టు ట్రిక్ మళ్ళీ ప్రదర్శించి వూరుచేరేలోగా ప్రత్యర్ధి జట్టుపై ఒక్కమారయినా ఆధిక్యత చూపాలని అనుకున్నారు.
పరమానందయ్య శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టిక్కెట్లు కొనుక్కుని లోకల్ ట్రైన్ ఎక్కారు. ఈ కధలో లెక్కప్రకారం రావాల్సిన టీసీ యధాప్రకారం వచ్చాడు. పరమానందయ్య శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు. ఒక్క టిక్కెట్టుతోనే రైలెక్కిన ఆనందయ్య శిష్యులు టీసీ కళ్లబడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు. కానీ అది వారికి దొరక్కపోగా వాళ్లు మాత్రం ఎంచక్కా టీసీకి దొరికిపోయారు.
ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆత్రుతలో లోకల్ ట్రైన్లలో టాయిలెట్లు వుండవన్న సంగతి వారు మరచిపోయారు.
12.పూజలో దోషాలు
ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.
ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇఖ బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది.
ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు.
"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు.
ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది.
అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.
తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.
ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది.
" ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.
ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.
" అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది " అని కోపంతో వెళ్ళిపోయాడు.
ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.
ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.
ఓ రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.
ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి
" అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు " అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.
కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి.
మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.
Post a Comment