నమ్మకం

  గంధర్వ పురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయ దారుడు వుండేవాడు. అతడు గుత్తకు సాగుచేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్ళే దారిలో వుండేది. అతడు నిత్యమూ మొదట మఠంలో శ్రీ గురుణ్ణి దర్శించుకొని పొలానికి వెళుతుండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగివచ్చేప్పుడు కనిపెట్టి పరుగునపోయి యెంతో శ్రద్ధాభక్తులతో కొద్దిదూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనినేమీ పల్కరించ కుండా అతడి భక్తిశ్రద్దలను గమనిస్తుండేవారు. ఎంత కాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒక రోజతడు నమస్కరించగానే, “నాయనా! నిత్యమూ నీవింత శ్రద్ధా భక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మానుండి నీకేమి కావాలో చెప్పు!' అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశమొచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి, చేతులు జోడించి, 'బాబూ, నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి, అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ' అన్నాడు. స్వామి, 'నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేసావు?' అని అడిగారు. అతడు 'అయ్యా! ఈ సంవత్సరం జొన్నవేశాను. రోజూ మీకు నమస్కరించు కుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలుపోసు కుంటున్నది. తమ దయవల్ల రెండునెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టినవారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి, నామాట త్రోసి పుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు' అని ప్రార్థించాడు.

శ్రీగురుడు, 'సరే పద, చూచి వద్దాము' అని చెప్పి, అతనితో గూడ చేనువద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయజూస్తూ, ఏమిరా! మేము చెప్పింది చేస్తానంటే ఒకమాట చెపుతాను' అన్నారు. ఆ రైతు, 'తండ్రి, మీమాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరెవరున్నారు? మీరొక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే వుండదు. స్వామికి తెలియనిది యేమున్నది? గుర్వాజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు' అన్నాడు. ఆ యతివరేణ్యుడు, 'అలా అయితే మా మాటమీద నమ్మకముంచి, మేము మధ్యాహ్నం యిటుగా వెళ్ళేలోపల యీ చేలోని పైరంతా కోయించు!' అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు.


ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలు పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి, ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే యీ సంవత్సరం గూడ గుత్త చెల్లిస్తానని, పైరు కోయడానికి అనుమతిపత్రం యివ్వమని కోరాడు. కాని ఆ ఏడాది పైరు యెప్పటికంటే యెక్కువగా పెరగడం వలన ఆసామి అందుకొప్పుకొనక, ఆ ముందటి సంవత్సరంకంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం వ్రాయించుకొని, పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిల్చుకొని పొలం వద్దకు వెళ్ళాడు. 'పైరుకు యింకా పాలుపట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా!' అని కూలీలు గూడ ఆశ్చర్యపోయారు. కాని, తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి, అతని భార్యబిడ్డలు నెత్తి, నోరూ మొత్తుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని యెంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి, అతడు వాళ్ళమీద రాళ్ళు రువ్వసాగాడు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, 'మహాప్రభూ! మావాడికి దయ్యం పట్టిందో యేమో గాని, కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డుబోతే మమ్మల్ని రాళ్ళతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని, పంటకొస్తున్న పైరుచేతులారా పాడుచేస్తున్నాడు. ఇంకొక నెలరోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్తా యిలా నాశనమై పోతున్నది. మీరైనా అతనిని నిగ్రహించండి' అని గొల్లున ఏడ్చారు.అది విని న్యాయాధికారి, 'మీరు ఈ విషయం నాతో చెబితే నేనేమి చేయగలను? ఏమైనా |చేయగల్గితే పొలం  యజమానే చేయగలడు. అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేసాడు. వాళ్ళు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకు వెళ్ళి మొర పెట్టుకుంటే అతడు 'వాడి యిష్టం! వాడేమి చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకిచ్చేలా వ్రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనుక, మా మనిషినిపంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి' అని చెప్పి ఒక మనిషిని పంపాడు. 

ఆ మనిషి పొలం వద్దకు వెళ్ళి అడ్డుచెప్పగానే ఆ సేద్యగాడు, 'ఏమయ్యా! కాగితం వ్రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలేగాని, నేనేమి చేసుకుంటే అతని కెందుకు? ఆయనకు యివ్వవలసిన ధాన్యం మాయింటి గాదెలోనే వున్నది. అది చాలకుంటే, వాటికి బదులు చెల్లించడానికి నాదగ్గర కావలసినన్ని పశువు లున్నాయిగదా?' అని చెప్పి, అతనిని వెనుకకు పంపివేశాడు. అంతటితో యజమాని వూరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తిచేయించి, కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి, శ్రీగురుణ్ణి స్మరిస్తూ, ఆయన సంగమంనుండి మఠానికి వెళ్ళేదారిలోఆయన రాకకై యెదురుచూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అటుగావస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి, వారిని పొలం వద్దకు తీసుకు వెళ్ళి, ఆ కోసి వేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్యం నటిస్తూ, 'అయ్యో! నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేసావే! ఎంతపని చేసావయ్యా! పాపం, ఇప్పుడు నీ జీవనమెలా? యజమానికి ధాన్యమెలా యిస్తావు? అమాయకుడా? పండనిపైరు కోసి అంతా వ్యర్థం చేసావు గదా!' అన్నారు. కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, 'స్వామీ! నాకు గురువాక్యమే ప్రమాణము. అదేమాకు శ్రీరామరక్ష. మీరుండగా మాకేమి భయం?' అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోలోపల సంతోషించి, 'నీకు అంత దృఢమైన విశ్వాసముంటే అలానే అవుతుందిలే!' అని నిర్వికారంగా మఠానికి వెళ్ళిపోయారు. ఆ కాపరి గూడ శ్రీగురుడు కనుమరుగయ్యే వరకూ తదేకంగా ఆయనను చూచి, నిశ్చింతగా యింటికి వెళ్ళాడు. దారిలో అతనిని చూచిన వారంతా యెన్నెన్నో మాటలన్నారు గాని, అతడవేమీ పట్టించు కోలేదు.

పర్వతేశుడు యిల్లు చేరేసరికి అతడి భార్య తమకా సంవత్సరం నోటివద్ద కొచ్చిన కూడు పాడై పోయిందని భోరుభోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం నిబ్బరంగా ఆమెతో, 'ఓసి వెర్రిదానా! నీవలా ఏడవ గూడదు. ఆ గురుదేవులు వాక్కే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడే. మనకాయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ వుంటేనే అందరమూ సుఖంగా బ్రతుకగలము. మామూలుగా పండవలసిన పంటకంటె యెన్నోరెట్లు యెక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది' అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారందరూ చోద్యము చూడవచ్చి, అతని మూఢవిశ్వాసానికి నివ్వెరబోయి, నవ్వుకుంటూ వెళ్ళి పోయారు.


ఒక వారం రోజులు గడిచాయి. ఎనిమిదవరోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దాని వలన చుట్టు ప్రక్కల చేలన్నీ వాలిపోయి, తాలుధాన్యం యేర్పడింది. దానికితోడు ఆ పుష్యమాసంలో భారీయెత్తున అకాలవర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ పూర్తిగా పాడయిపోయాయి. కాని పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్ళనుంచి ఒక్కొక్క మొక్కకు పది, పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది.


అదిచూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్యగూడ అమిత సంతోషంతో తన భర్త కాళ్ళమీదపడి, 'అయ్యా! తెలియక నేనెంతో గొడవచేసి మీ మనస్సును యెంతగానో నొప్పించాను. తెలివితక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి గూడ నిందించాను. తప్పో యిప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు' అని ప్రాధేయపడింది.

మీ చూపు పాపులను గూడ పావనం చేయగలదు' అన్నారు. పర్వతశుని భార్య, 'స్వామీ! నేను తెలియక మొదట యేమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు యెప్పుడూ యిలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేమెల్లప్పుడూ మిమ్మల్ని యిలాగే కొల్చుకునేలా అనుగ్రహించండి' అని విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు, 'అఖండ శ్రీరస్తు!' అని ఆశీర్వదించి, వాళ్ళను పంపివేసారు. ఆ దంపతులెంతో సంతోషంగా యింటికి పోయారు.


నెల గడిచేసరికి పర్వతేశుని పంటపండి, కంకులు అద్భుతంగా బయటికొచ్చాయి. నిజానికి ఆ ముందటి సంవత్సరంకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి, ఆసామి వద్దకుపోయి, 'అయ్యా! చూచారా, స్వామి దయవలన పైరెంత బాగా పండిందో? మీకుగూడ మనమొప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువే యిస్తాను తీసుకోండి. అయినా నాకింత ఎక్కువగా పండింది గనుక మనిద్దరమూ చెరిసగము తీసుకొనడం న్యాయమని నాకనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీభాగం మీరు తీసుకుపోండి' అని చెప్పాడు. కాని ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకొని, తనుఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం గూడా ఎక్కువ తీసుకొనడానికి అంగీకరించలేదు. ‘అది నీ భక్తిశ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది గనుక అదంతా నీకే చెందాలి' అన్నాడు. అప్పుడా రైతు, రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్లమీద వేసి యిల్లు చేర్చుకున్నాడు.

అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజచేసి శ్రీగురునివద్దకు వెళ్ళి ఆయన పాదాలమీద పూలువేసి నమస్కరించు కున్నారు. స్వామి నవ్వి, 'ఏమిటి విశేషం?' అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, 'స్వామీ, మీ దయవలన మేము కోరినదానికంటే ఫలితమెంతగానో యెక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు, సత్యమూర్తి భూమిమీద యింకెవరున్నారు?